సాధారణంగా చాలా సినిమా కథలు పెళ్లి కార్డుతో సుఖాంతమవుతాయి. అయితే అసలు 'కథాకమామీషు' ఆ తరువాతనే మొదలవుతుందని చెప్పదలచుకున్న దర్శకులు గౌతమ్ - కార్తీక్, అక్కడి నుంచి ఈ కథను అల్లుకుంటూ వెళ్లారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీకి తీసుకుని వచ్చారు. ఈ రోజు నుంచే ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: సత్య (వెంకటేశ్ కాకుమాను) ఉష (హర్షిణి) ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. అతను ఓ బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. సత్యకి తల్లి లేకపోవడం .. ఇద్దరు బ్రదర్స్ కి జాబ్ లేకపోవడం .. అందువలన పెళ్లి కాకపోవడం సమస్యగా మారుతుంది. దివ్య - బాలు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. ప్రతిదీ పద్ధతి ప్రకారం జరగాలని బాలు అంటూ ఉంటాడు. అతని ధోరణి దివ్యకి చిరాకు కలిగిస్తూ ఉంటుంది. తనని అతను అమెరికా తీసుకుని వెళ్లే సమయం కోసం వెయిట్ చేస్తూ, ఆమె ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ ఉంటుంది.
ఇక శ్రీధర్ - కల్పన ( కరుణ కుమార్ - ఇంద్రజ) రెండో పెళ్లి చేసుకుంటారు. అప్పటికే ఇద్దరికీ పిల్లలు ఉంటారు. కల్పన అదే ఊర్లో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఒక తోడు అవసరమనుకుని వాళ్లు పెళ్లి చేసుకుంటారు. ఇక కిరణ్ - స్రవంతి ప్రేమించుకుంటారు. అయితే వారి పెళ్లికి స్రవంతి పేరెంట్స్ నుంచి వ్యతిరేకత రావడంతో, ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు.
సత్య - ఉష ఉమ్మడి కుటుంబంలో ఏకాంతంగా గడిపే అవకాశం లేక సతమతమైపోతుంటారు. దివ్య - బాలు చెరొక చోట ఉండటం వలన, ఒంటరిగానే కాలం గడిపేస్తూ ఉంటారు. ఇక తలిదండ్రులను బాధపెట్టిన కారణంగా, స్రవంతి తన భర్తకి దగ్గర కాలేకపోతూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ గా కనిపించే కల్పనతో ఆమె భర్త సాన్నిహిత్యంతో మెలగలేకపోతూ ఉంటాడు. ఇలా అందరూ ఒక రకమైన అసంతృప్తితో రోజులు గడుపుతూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ.
విశ్లేషణ: ఈ సినిమాకి దర్శకులలో ఒకరైన గౌతమ్ కథను అందించాడు. ప్రేమ - పెళ్లి అనే రెండు అంశాలను కలుపుకుంటూ సాగే కథ ఇది. ఆయా సందర్భాలకు తగినట్టుగా ఒక్కటైన నాలుగు జంటల చుట్టూ తిరిగే కథ ఇది. పెళ్లి తరువాత ఏ జంట ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయవలసి వస్తుంది అనేది ఈ కథలో ప్రధానమైన ఉద్దేశంగా కనిపిస్తుంది.
పెద్దల అంగీకారంతో జరిగిన పెళ్లి .. అందుకు వ్యతిరేకంగా జరిగిన పెళ్లి .. కొన్ని కారణాల వలన జరిగిన రెండో పెళ్లి .. ఇలా పెళ్లి అనేది ఆయా జంటలను ఎలా ప్రభావితం చేస్తుందనేది చెప్పడానికి దర్శక ద్వయం గౌతమ్- కార్తీక్ ప్రయత్నించారు. ఒకే ఊర్లో .. ఈ నాలుగు కుటుంబాల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఈ నాలుగు ట్రాకులను రసవత్తరంగా అల్లుకుని ఉంటే కథ పట్టుగా పరిగెత్తేది. కానీ అది కుదరకపోవడం వలన కథ నిస్సారంగా .. నీరసంగా కొనసాగుతుంది.
ఇంద్రజ - కరుణకుమార్ ట్రాక్ మరింత మైనస్ అయినట్టుగా అనిపిస్తుంది. మిగతా మూడు ట్రాకులలో మంచి ఫన్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ అలా డిజైన్ చేయకపోవడం ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. నాలుగు ట్రాకులలోని సమస్యకు ఫన్ యాడ్ చేయకపోవడమే ప్రధానమైన సమస్యగా కనిపిస్తుంది. మొదటి నుంచి చివరివరకూ ఎలాంటి ట్విస్టులు లేకుండా కథ నిదానంగా .. ప్లాట్ గా నడవడమే అసలైన సమస్యగా అనిపిస్తుంది.
పనితీరు: సినిమాల్లో హీరో హీరోయిన్ల పెళ్లితో శుభం కార్డు పడుతుంది. కానీ అసలు కథ ఆ తరువాతనే మొదలవుతుంది అంటూ దర్శకుడు ఎంచుకున్న పాయింటు ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అందుకు నిదర్శనంగా ఆయన ఎంచుకున్న నాలుగు జంటల కథలను వినోదభరితంగా చెప్పలేకపోవడం నిరాశను కలిగిస్తుంది. హత్తుకునే సన్నివేశాలుగానీ .. సంభాషణలుగాని లేవు.
ప్రధానమైన కథ ఎనిమిది పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. అరవింద్ విశ్వనాథన్ ఫొటోగ్రఫీ .. ధృవన్ నేపథ్య సంగీతం .. విశాల్ - సత్య ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. కథాకథనాల్లో బలం లేకపోవడం .. కామెడీని కలుపుకోకపోవడం .. ఎమోషన్స్ ను కనెక్ట్ చేయలేకపోవడం వలన ఈ సినిమా అలా సాదాసీదాగా .. రొటీన్ గా సాగిపోతుంది అంతే.
'కథాకమామీషు' (ఆహా) మూవీ రివ్యూ!
| Reviews
Katha Kamamishu Review
- నేరుగా ఓటీటీకి వచ్చిన 'కథాకమామీషు'
- పెళ్లి తరువాత అనే కాన్సెప్ట్ తో నడిచే కంటెంట్
- బలహీనమైన కథాకథనాలు
- వినోదానికి దూరంగా వెళ్లిన కథ
- కనెక్ట్ కాని ఎమోషన్స్
Movie Name: Katha Kamamishu
Release Date: 2025-01-02
Cast: Indraja, Karuna Kumar, Kruthika Roy, Krishna Prasad, Harshini, Moin
Director: Goutham - Karthik
Music: RR Dhruvan
Banner: Three Whistles Talkies - IDream Media
Review By: Peddinti
Katha Kamamishu Rating: 2.00 out of 5
Trailer