'మురా' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Mura

Mura Review

  • మలయాళంలో రూపొందిన 'మురా'
  • దారితప్పిన నలుగురు కుర్రాళ్ల కథ 
  • యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా సాగే కంటెంట్ 
  • స్క్రీన్ ప్లే - బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్
       

మలయాళంలో ఈ మధ్య కాలంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాలలో 'మురా' ఒకటి. రియా శిబూ నిర్మించిన ఈ సినిమాకి, ముహమ్మద్ ముస్తఫా దర్శకత్వం వహించాడు. నవంబర్ 8వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నెల 25వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: ఆనంద్ (హృదు హరున్) షాజీ (జోబిన్ దాస్) మను (యదుకృష్ణ) మనఫ్ (అనుజీత్) ఈ నలుగురూ మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళుతూ ఉంటారు .. కలిసే తిరుగుతూ ఉంటారు. ఆ గ్రూప్ లో ఆనంద్ మాత్రమే మిడిల్ క్లాస్ కుర్రాడు. మిగతా వాళ్లంతా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. నలుగురికీ కూడా చదువు పెద్దగా వంటబట్టదు. ఖర్చుల కోసం లోకల్ రౌడీలతో చేతులు కలుపుతారు. 

లోకల్ రౌడీ లీడర్ వాళ్లను 'అనీ' (సూరజ్ వెంజరమూడు)కు పరిచయం చేస్తాడు. గ్యాంగ్ స్టర్ రమాదేవి (మాలా పార్వతి) దగ్గర ప్రధానమైన అనుచరుడిగా అతను పనిచేస్తూ ఉంటాడు. ఈ నలుగురు కుర్రాళ్లకు భయమనేది తెలియదనీ, అప్పగించిన పనిని ధైర్యంగా పూర్తి చేస్తారనే విషయాన్ని అనీ గమనిస్తాడు. తమ గ్రూప్ లో అలాంటి కుర్రాళ్లు ఉండాలని భావించి, వాళ్లకు అడ్వాన్స్ ఇస్తాడు. ఇక అప్పటి నుంచి నలుగురు కుర్రాళ్లు చెలరేగిపోతారు. 

ఒక సీక్రెట్ ప్లేస్ లో పెద్దమొత్తంలో బ్లాక్ మనీ ఉంటుంది. మధురై ప్రాంతంలో దాచబడిన ఆ బ్లాక్ మనీని తీసుకొచ్చే బాధ్యతను ఆ నలుగురు కుర్రాళ్లకు అప్పగించాలని అనీ అనుకుంటాడు. వాళ్లపై తనకి పూర్తి నమ్మకం ఉందని రమాదేవిని ఒప్పిస్తాడు. ఈ నలుగురు కుర్రాళ్లు, మధురైకి చెందిన లోకల్ కుర్రాళ్లను ఇద్దరినీ వెంటబెట్టుకుని, బ్లాక్ మనీ దాచిన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ ఏం జరుగుతుంది? ఊహించని ఆ సంఘటనతో వాళ్ల జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ. 

విశ్లేషణ: సురేశ్ బాబు అందించిన కథ ఇది. నలుగురు కుర్రాళ్లు .. అందరూ 20 .. 21 సంవత్సరాల లోపువారే. ఇంట్లోవాళ్లు చదువుకోమన్నా .. ఏదైనా పని చూసుకుకోమన్నా పెద్దగా పట్టించుకోరు. కుటుంబ బరువు బాధ్యతలు ఎంతమాత్రం పట్టనివారే. సరదాగా కబుర్లు  చెప్పుకుంటూ కులాసాగా బైక్ లపై తిరిగేస్తూ ఉంటారు. అలాంటి కుర్రాళ్లు ఖర్చులకి అవసరమైన డబ్బు కోసం రౌడీ గ్యాంగ్ తో చేతులు కలపడంతో ఈ కథ మొదలవుతుంది.

దర్శకుడు ఈ నలుగురు స్నేహితుల పాత్రలను డిజైన్ చేయడంలోనే ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ఈ నాలుగు పాత్రలు ఆదర్శవంతమైనవి కాకపోయినా, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం .. స్నేహానికి కట్టుబడి ఉండటం ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది. ఇక్కడే ఈ నలుగురికి ఆడియన్స్ వైపు నుంచి మద్దతు లభిస్తుంది. వాళ్లతో కలిసి ఎమోషనల్ గా ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. 

ఈ కుర్రాళ్లు గ్యాంగ్ స్టర్ కోసం పనిచేయడం ఫస్టు పార్టుగా .. గ్యాంగ్ స్టర్ తోనే తలపడటం సెకండ్ పార్టుగా తెరపైకి వస్తుంది. అందుకు సంబంధించిన సన్నివేశాలు సహజత్వానికి చాలా దగ్గరగా .. ఉత్కంఠ భరితంగా సాగుతాయి. యాక్షన్ .. ఎమోషన్ అనేవి సమపాళ్లలో కుదురుకున్నాయి. ఎక్కడా సినిమాటిక్ గా ఏదీ అనిపించదు. మొదటి నుంచి చివరివరకూ ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. 

పనితీరు: ప్రధానమైన పాత్రలను పోషించిన నలుగురు కుర్రాళ్లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అడ్డదారి తొక్కిన ఆకతాయిల బిహేవియర్ ఎలా ఉంటుందో .. అలాగే చేశారు. వాళ్లు నటిస్తున్నట్టుగా అనిపించదు. అంత గొప్ప అవుట్ పుట్ ఇచ్చారు. ఇక సూరజ్ వెంజరమూడు .. మాలా పార్వతి యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు.

ఫాజిల్ నజర్ ఫొటోగ్రఫీ బాగుంది. యాక్షన్ .. ఛేజింగ్ దృశ్యాలను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. క్రిస్టీ జోబీ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి. ఆయన అందించిన థీమ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది అనడంలో అతిశయోక్తి లేదు. చమన్ చాకో ఎడిటింగ్ మెప్పిస్తుంది. ఎక్కడా అనవసరమైన సీన్ అనేది కనిపించదు.  

ఈ సినిమాలో ఒకటి రెండు చోట్ల హింస కనిపిస్తుంది .. అది కూడా చివరిలో. అభ్యంతరకరమైన సన్నివేశాలు .. సంభాషణలు మాత్రం లేవు. జీవితం ఎంతో అందమైంది .. సరదాల కోసం .. సంతోషాల కోసం .. తాత్కాలికమైన ఆనందాల కోసం అడ్డదారిలో వెళ్లకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆ జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతాయి. స్నేహం నీ ఆయుధం అయినప్పుడు దానిని మంచి కోసం ఉపయోగించు అనే సందేశం ఈ కథలో కనిపిస్తుంది.

Movie Name: Mura

Release Date: 2024-12-25
Cast: Hridu Haroon, Anujith, Yedu Krishana,Jobin Das, Suraj Venjaramoodu, Mala Parvathi
Director: Muhammad Musthafa
Music: Christy Joby
Banner: HR Pictures

Mura Rating: 3.00 out of 5

Trailer

More Reviews