విక్రమ్ కథానాయకుడిగా 'తంగలాన్' సినిమాను దర్శకుడు పా రంజిత్ రూపొందించాడు. స్టూడియో గ్రీన్ - నీలమ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేశారు. అయితే కొన్ని కారణాల వలన ఓటీటీకి వెంటనే రాలేకపోయింది. ఈ రోజు నుంచే తమిళ .. తెలుగు .. మలయాళ .. కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: ఈ కథ 18వ శతాబ్దంలో .. ఆంగ్లేయుల కాలంలో జరుగుతుంది. అది నార్త్ ఆర్కాట్ పరిధిలోని ఒక గిరిజన గూడెం. ఆ గూడానికి 'తంగలాన్' (విక్రమ్) నాయకుడిగా ఉంటాడు. తంగలాన్ భార్య జంగమ్మ (పార్వతీ తిరువోతు) ఆ కుటుంబానికి ఎంతో అండగా ఉంటుంది. తంగలాన్ ను కట్టడి చేయడం కోసం ప్రభుత్వం అతనికి గల కొద్ది పాటి భూమిని జప్తు చేస్తుంది. అలాగే వెట్టి చాకిరి చేయవలసిందేనని ఆదేశిస్తుంది.
అదే సమయంలో ఆంగ్లేయ అధికారి అయిన లార్డ్ క్లెమెంట్ (డేనియల్) రాజుల కాలంలో బంగారం కోసం జరిగిన అన్వేషణను గురించి పరిశీలన చేస్తాడు. బంగారు గనులు ఎక్కడ ఉన్నాయనేది తెలుసుకోవడానికి తంగలాన్ తెగ సాయాన్ని తీసుకోక తప్పదనే నిర్ణయానికి వస్తాడు. ఈ విషయంలో తనకి సహకరిస్తే, బంగారంలో కొంత భాగం ఇస్తానని మాట ఇస్తాడు. బంగారం దొరికితే తమ బతుకులు మారతాయనే ఆశతో తంగలాన్ అందుకు ఒప్పుకుంటాడు.
అయితే ఆ బంగారు భూమిని ఆరతి (మాళవిక మోహనన్) అనే మాంత్రికురాలు కాపాడుతూ ఉంటుందనీ, దానిని చేజిక్కించుకోవడం అంత తేలికైన విషయమేం కాదని లార్డ్ క్లెమెంట్ తో తంగలాన్ చెబుతాడు. అయినా ఆరతిని ఎదిరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంటాడు. ఈ విషయంలో తన గూడెం ప్రజలందరికీ భరోసా ఇచ్చి, వాళ్లను తనతో పాటు బంగారు గనులున్న ప్రదేశానికి తీసుకుని వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఆరతికి .. తంగలాన్ కి గల సంబంధం ఏమిటి? అనేది కథ.
విశ్లేషణ: తమిళ్ ప్రభ తయారు చేసిన కథ ఇది. వెట్టి చాకిరి నుంచి బయటపడటం కోసం ఒక తెగకి చెందిన ప్రజలు, మాంత్రిక శక్తులను .. విషసర్పాలను ఎదుర్కోవడానికి ఎలా సిద్ధపడ్డారనేది కథ. అడవులు .. కొండలు నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆంగ్లేయుల కాలమే అయినా, తెరపై కనిపించే తెల్లదొరల స్వఖ్య చాలా తక్కువ. గూడెం సెటప్ మాత్రం సహజత్వానికి దగ్గరగా కనిపిస్తుంది.
18వ శతాబ్దంలో ఈ కథ నడుస్తుంది. కథ అంతా అడవి నేపథ్యంలోనే నడుస్తుంది గనుక, ఆ వాతావరణాన్ని సృష్టించడానికి దర్శకుడు పెద్దగా కష్టపడవలసిన పని లేకుండా పోయింది. కాస్ట్యూమ్స్ .. మేకప్ విషయంలో గట్టిగానే దృష్టి పెట్టారు. విక్రమ్ .. పార్వతి తిరువోతు వంటి క్రేజ్ ఉన్న ఆర్టిస్టులు తెరపై అలా కనిపించడానికి ఆసక్తిని కనబరచడం అభినందనీయమేనని చెప్పాలి.
దర్శకుడు ఈ కథను మొదటి నుంచి చివరివరకూ సీరియస్ గా చెప్పడానికి ప్రయత్నించాడు. ఇది ఒక ప్రత్యేకమైన కంటెంట్ తో కూడిన సినిమా. అందువలన ఎంటర్టైన్ మెంట్ కి దూరంగా నడుస్తుంది. ఫలితంగా ఆడియన్స్ కోరుకునే వినోదం పాళ్లు అంతగా లభించవు. కొన్ని అంశాలను పక్కన పెడితే డాక్యుమెంటరీకి దగ్గరగా అనిపిస్తుంది. ఒకటి రెండు వివాదాస్పదమైన సన్నివేశాలు .. సంభాషణలు ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ విషయానికి వచ్చేసరికి గూడెం నాయకుడైన హీరో, నిక్షిప్తమై .. సంరక్షించు .. మిత్రమా వంటి మాటలు మాట్లాడటం ఆ పాత్రకి దూరంగా తీసుకుని వెళుతుంది.
పనితీరు: పాత్ర కోసం .. అందుకు తగినట్టుగా తెరపై కనిపించడానికి విక్రమ్ వెనుకాడడనే విషయం తెలిసిందే. లుక్ పరంగా .. నటన పరంగా ఆయన ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. తెరపై విక్రమ్ కనిపించలేదనే చెప్పాలి. ఇక ఆయన భార్య పాత్రలో పార్వతి తిరువోతు కూడా మెప్పించింది. పశుపతితో పాటు మిగతా ఆర్టిస్టులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
కిశోర్ కుమార్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. యాక్షన్ .. ఎమోషన్స్ నేపథ్యంలో దృశ్యాలను ఆయన చాలా సహజంగా ఆవిష్కరించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఆయన స్వరపరిచిన బాణీలు, ఆ సందర్భానికి .. ఆ కాలానికి తగినట్టుగా అనిపిస్తాయి. సెల్వ ఎడిటింగ్ ఓకే. గిరిజన తెగకి సంబంధించిన పోరాటాలను డిజైన్ చేసిన తీరు బాగుంది.
ఇది కలర్ఫుల్ గా .. కనువిందుగా సాగే రెగ్యులర్ సినిమా కాదు. 18 శతాబ్దంలో నడిచే కథ .. బంగారు గనుల నేపథ్యంలో ఒక తెగకి చెందిన గూడెం ప్రజలు చేసే పోరాటం కథ. ఎక్కడా గ్లామర్ టచ్ ఉండదనే విషయాన్ని అర్థం చేసుకుని ఫాలో అయితే, ఈ కంటెంట్ కనెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కథ మొదలైన దగ్గర నుంచి చివరివరకూ గూడెం ప్రజల చుట్టూ తిరగడం వలన, థియేటర్లలో ఈ సినిమా అంతగా సందడి చేయలేకపోయింది. ఇక ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.
'తంగలాన్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
| Reviews
Thangalaan Review
- ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన 'తంగలాన్'
- ఆలస్యంగా ఓటీటీకి వచ్చిన సినిమా
- 18వ శతాబ్దంలో నడిచే కథాకథనాలు
- బంగారు గనుల నేపథ్యంలో సాగే కంటెంట్
- విక్రమ్ నటన హైలైట్
Movie Name: Thangalaan
Release Date: 2024-12-10
Cast: Vikram, Parvathi Thiruvothu, Malavika Mohanan, Pasupathy, Daniel Caltagirone
Director: Pa Ranjith
Music: G V Prakash Kumar
Banner: Studio Green - Neelam Productions
Review By: Peddinti
Thangalaan Rating: 2.75 out of 5
Trailer