కోలీవుడ్ లో జయం రవికి మంచి ఇమేజ్ ఉంది. ఆయన కథానాయకుడిగా 'బ్రదర్' అనే సినిమా రూపొందింది. రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 31వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 5వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: కార్తీక్ ( జయం రవి) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. విశాఖలో ఆయన కుటుంబం నివసిస్తూ ఉంటుంది. తండ్రి కుమారస్వామి (అచ్యుత కుమార్) రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపాల్. ఎంతకాలమైనా డిగ్రీ పూర్తి చేయని కార్తీక్ ను తల్లి సరస్వతి (సీత) వెనకేసుకు వస్తూ ఉంటుంది. తన కళ్లముందు ఎలాంటి అక్రమాలు .. అవినీతి .. అన్యాయం జరిగినా ఎదిరించే స్వభావం కలిగినవాడిగా కార్తీక్ కనిపిస్తూ ఉంటాడు.
కార్తీక్ కి ఒక అక్కయ్య ఉంటుంది .. ఆమె పేరే ఆనంది (భూమిక). వివాహమైన ఆమె 'ఊటీ'లోని అత్తగారింట్లో ఉంటుంది. ఆమె మామగారు శివగురునాథ్ (రావు రమేశ్) ఓ కలెక్టర్. అత్తగారు హేమమాలిని (శరణ్య) ఓ లాయర్. ఆనంది భర్త అరవింద్ ( నటరాజన్ సుబ్రమణియన్) అటవీశాఖలో రేంజ్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు .. వారికి ఇద్దరు పిల్లలు. ఇక అరవింద్ కి అర్చన (ప్రియాంక అరుళ్ మోహన్) అనే చెల్లెలు ఉంటుంది. ఆమె కార్తీక్ ను ఇష్టపడుతూ ఉంటుంది.
కార్తీక్ వ్యక్తిత్వం వలన తన తండ్రి హార్ట్ ఎటాక్ వరకూ వెళ్లాడని తెలుసుకున్న ఆనంది, అతను తండ్రికి దూరంగా ఉండటం మంచిదని భావిస్తుంది. తనతో పాటు ఊటీకి తీసుకుని వచ్చేస్తుంది. స్వేచ్ఛగా తిరిగిన కార్తీక్, టైమ్ టేబుల్ ప్రకారమే నడచుకునే ఆ ఇంట్లో ఇమడలేకపోతాడు. అతని ధోరణి కారణంగా అత్తామామ .. భర్త వలన ఆనంది మాటపడవలసి వస్తుంది. తన పిల్లలతో సహా ఆ ఇంటికి దూరమవుతుంది. అదే సమయంలో కార్తీక్ కి ఒక నిజం తెలుస్తుంది. అదేమిటి? క్క కాపురాన్ని అతను ఎలా చక్కదిద్దుతాడు? అర్చనతో అతని వివాహం జరుగుతుందా? అనేది కథ.
విశ్లేషణ: ఒక తమ్ముడు తన వలన అక్క జీవితంలో తలెత్తిన సమస్యలను తానే పరిష్కరించే కథనే 'బ్రదర్'. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథ ఇది. కార్తీక్ నిజాయితీ కారణంగా అతని కుటుంబం .. అతని అక్కయ్య వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడటం అనే అంశం ఫస్టాఫ్ గా వస్తుంది. అతని కారణంగా ఉత్పన్నమైన సమస్యలను అతనే పరిష్కరిస్తూ వెళ్లిన విధానం సెకండాఫ్ గా నడుస్తుంది. ఈ నేపథ్యంలో కార్తీక్ కి తెలిసే ఒక నిజం, కథలో కీలకంగా మారుతుంది.
దర్శకుడు రాజేశ్ ఈ కథను మొదటి నుంచి చివరివరకూ చాలా క్లారిటీతో చెబుతూ వెళ్లాడు. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసుకున్న తీరు .. ఆ పాత్రలను నడిపించిన విధానంలో ఎలాంటి లోటుపాట్లు కనిపించవు. కాకపోతే కథలో కొత్తదనం లేకపోవడం వలన, అక్కాతమ్ముళ్ల ఎమోషన్స్ నేపథ్యంలో ఇంతకంటే బలమైన కథలు రావడం వలన .. ఆడియన్స్ కి పెద్దగా ఏమీ అనిపించదు.
ఈ కథలో అక్కాతమ్ముళ్ల ఎమోషన్స్ పై మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేశారు. అవకాశం ఉన్నప్పటికీ లవ్ .. రొమాన్స్ ను అస్సలు టచ్ చేయడకపోవడం ఒక లోపంగా అనిపిస్తూ ఉంటుంది. రావు రమేశ్ పాత్ర కీలకమైనదే అయినా, ఆ పాత్రకి వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం వలన, ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదు. కేర్ టేకర్ కేశవ్ గా వీటీవీ గణేశ్ కామెడీ, ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయిందనే చెప్పాలి.
పనితీరు: నిజాయితీ కారణంగా ఏ ఉద్యోగంలో ఇమడలేకపోయిన కార్తీక్ పాత్రలో జయం రవి నటన బాగుంది. ప్రియాంక అరుళ్ మోహన్ అందంగా మెరిసింది. ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత కనిపించదు. అహంభావంతో కూడిన కలెక్టర్ గా రావు రమేశ్ .. స్వార్థపరుడైన అటవీశాఖ ఆఫీసర్ గా నటరాజన్ సుబ్రమణియన్ .. డబ్బున్నవారు చెప్పే మాటనే నెగ్గాలనే శరణ్య నటన మెప్పిస్తుంది. తన పోర్షన్ తక్కువే అయినా భూమిక తన మార్క్ చూపిస్తుంది.
వివేకానంద్ సంతోష్ ఫొటోగ్రఫీ బాగుంది. ఊటీ అందాలను .. పాటలను ఆయన తెరపైకి తీసుకొచ్చిన తీరు ఆహ్లాదంగా అనిపిస్తుంది. హారిస్ జైరాజ్ బాణీలు .. నేపథ్య సంగీతం ఫరవలేదు అనిపిస్తాయి. డేవిడ్ జోసెఫ్ ఎడిటింగ్ ఓకే.
ఈ కథ చాలా నీట్ గా కలర్ఫుల్ ప్రెజెంటేషన్ తో కనిపిస్తుంది. కాకపోతే 90's లో వచ్చిన సెంటిమెంట్ కంటెంట్ మాదిరిగా రొటీన్ గా అనిపిస్తుంది. అభ్యంతరకరమైన సన్నివేశాలు గానీ, ఇబ్బంది పెట్టే డైలాగులు గానీ ఏమీ లేకపోవడం వలన ఫ్యామిలీ ఆడియన్స్ ఒకసారి ట్రై చేయవచ్చు.
'బ్రదర్' (జీ 5) మూవీ రివ్యూ!
| Reviews
Brother Review
- తమిళంలో రూపొందిన 'బ్రదర్'
- అక్టోబర్ 31న థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ నెల 5 నుంచి మొదలైన స్ట్రీమింగ్
- రొటీన్ కి బిన్నంగా లేని కథాకథనాలు
- ఓ మాదిరిగా అనిపించే కంటెంట్
Movie Name: Brother
Release Date: 2024-12-05
Cast: Jayam Ravi, Priyanka Arul Mohan, Bhumika, Rao Ramesh, Achyuth Kumar
Director: Rajesh
Music: Harris Jayaraj
Banner: Screen Scene Media
Review By: Peddinti
Brother Rating: 2.50 out of 5
Trailer