'అమరన్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

Amaran

Amaran Review

  • అక్టోబర్లో థియేటర్లకు వచ్చిన సినిమా 
  • నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది 
  • ఆకట్టుకునే సన్నివేశాలు 
  • మనసును కదిలించే ఎమోషన్స్  

శివకార్తికేయన్ - సాయిపల్లవి ప్రధానమైన పాత్రలుగా 'అమరన్' సినిమా రూపొందింది. కమల్ హాసన్ - సోనీ పిక్చర్స్ వారు కలిసి నిర్మించిన సినిమా ఇది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన థియేటర్లకు వచ్చింది. 'మేజర్ ముకుంద్ వరదరాజన్' బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను మంచి వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 5వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) ఇందు రెబెక్కా (సాయి పల్లవి) ఒకే కాలేజ్ లో చదువుకుంటారు. ఆ సమయంలోనే వాళ్ల మధ్య పరిచయం ఏర్పడుతుంది .. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. తమ మతాలు వేరు .. ప్రాంతాలు వేరు.. అయినా కలిసి బ్రతకాలని నిర్ణయించుకుంటారు. ఆర్మీలో చేరాలనేది అతని లక్ష్యం. ఆ విషయాన్ని అతను ముందుగానే ఇందుకు చెబుతాడు. అయినా ఆమె తన మనసు మార్చుకోదు. 

ఇందు మలయాళ అమ్మాయి .. క్రిస్టియన్ కుటుంబానికి చెందిన యువతి. అందువలన వాళ్ల పెళ్లి నిర్ణయం పట్ల ముకుంద్ తల్లి కొంత అసంతృప్తిని ప్రదర్శిస్తుంది. ఆమెకు ముకుంద్ అనేక విధాలుగా నచ్చచెబుతాడు. ఇక తమ ప్రేమ విషయాన్ని ఇందు తన ఇంట్లో చెబుతుంది. ఆమె ముకుంద్ ను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని తండ్రి తెగేసి చెబుతాడు. మతం.. ప్రాంతం .. భాష సంగతి అలా ఉంచితే, తన కూతురును ఆర్మీలో పనిచేసే వారికి ఇవ్వనని తేల్చేస్తాడు. 

ఈ విషయం తెలియగానే ముకుంద్ నేరుగా ఇందు తండ్రిని కలిసి, అతనిని ఒప్పిస్తాడు. తన కూతురు సంతోషంగా ఉంటుందనే నమ్మకం కలగడంతో ఆయన అందుకు అంగీకరిస్తాడు. ముకుంద్ తో ఇందు పెళ్లి జరుగుతుంది .. అతను ఆర్మీలో చేరతాడు .. ధైర్యసాహసాలతో తన స్థాయిని పెంచుకుంటూ వెళతాడు. వారికి ఒక సంతానం కలుగుతుంది. ఆ సమయంలోనే కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. అప్పుడు ముకుంద్ ఏం చేస్తాడు? అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది కథ. 

విశ్లేషణ: ఇది సినిమా కోసం అల్లుకున్న కథ కాదు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలకు ఇచ్చిన తెర రూపం. ఒక సాధారణ మధ్యతరగతి కుంటుంబంలో పుట్టిపెరిగిన ముకుంద్, మొదటి నుంచి కూడా దేశభక్తిని కలిగి ఉంటాడు. తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాననే బాధకన్నా, తనదేశానికి సేవ చేయడంలోని ఆనందం ఎక్కువ అని నమ్ముతాడు. 

ఇలా ముకుంద్ ఉన్నతమైన ఆలోచనలు .. ఆర్మీలో అతను చురుకుగా తీసుకున్న నిర్ణయాలు .. తన తోటివారిని కాపాడుకోవడంలో చూపించిన తెగువ .. ప్రమాదకర పరిస్థితులలో తానే ముందుగా వెళ్లడం .. తన తోటి వారికి ఆదర్శంగా నిలవడం చేస్తాడు. అందుకు సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు ఆవిష్కరించిన తీరు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. అలాగే ముకుంద్ ఫ్యామిలీ వైపు నుంచి ఉన్న ఎమోషన్స్ ను కూడా దర్శకుడు ప్రెజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.

ఆర్మీలో ఉండే పరిస్థితులు .. తీవ్రవాదుల దాడులు .. ఆ సమయంలో జవాన్లు స్పందించే తీరు .. ఇవన్నీ చూస్తుంటే, మనం ఒక సినిమా చూస్తున్నామనే విషయాన్ని మరిచిపోతాం. 'ఎంత చెప్పినా వినిపించుకోలేదు .. ఇప్పుడేమైంది .. ' అన్నట్టుగా ఇందు వైపు తండ్రి చూసే ఒక చూపు, సహజత్వాన్ని పతాకస్థాయికి తీసుకుని వెళుతుంది. కంటెంట్ ను డిజైన్ చేసుకోవడంలో .. దానిని పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.    

పనితీరు: శివకార్తికేయన్ తన పాత్రలో పూర్తిగా ఇమిడిపోయాడు. సినిమా చూస్తున్నంత సేపు ఆయనలో ఒక సోల్జర్ మాత్రమే కనిపిస్తాడు. ఇక ఇందు పాత్రలో మన కళ్లముందున్నది సాయిపల్లవి అనే విషయం మనం మరిచిపోతాం. సర్వం కోల్పోయినప్పుడు అన్ని రకాల ఎమోషన్స్ కి అతీతంగా ఎలా వెళ్లిపోతారో, అలా ఆమె పలికించిన హావభావాలు ప్రేక్షకుల మనసులను భారం చేస్తాయి. 

సాయి ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ అనే చెప్పాలి. కశ్మీర్ లొకేషన్స్ .. తీవ్రవాదుల దాడులు .. ఆర్మీ ఎటాక్ చేసే దృశ్యాలను చాలా సహజంగా ఆయన తెరపైకి తీసుకుని వచ్చారు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం కూడా బాగుంది. యాక్షన్ .. ఎమోషన్స్ తాలూకు దృశ్యాలకు అయన అదనపు బలాన్ని జోడించాడు. కలైవనన్ ఎడిటింగ్ చాలా పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువలకు వంక బెట్టవలసిన అవసరం లేదు. 

ఇది దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఒక మేజర్ కథ. ఒక లక్ష్యం దిశగా .. ఒక ఆశయంతో ఆయన సాగించే ప్రయాణం .. చేసిన పోరాటమే ఈ సినిమా. ఆయన కథ అక్కడక్కడా మనసును భారం చేస్తుంది .. కళ్లను తడి చేస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా ఇది. 

Movie Name: Amaran

Release Date: 2024-12-05
Cast: Sivakarthikeyan , Sai Pallavi, Rahul Bose, Bhuvan Arora, Lallu
Director: Rajkumar Periasamy
Music: G V Prakash Kumar
Banner: Raaj Kamal Films International - Sony Pictures

Amaran Rating: 3.50 out of 5

Trailer

More Reviews