'పుష్ప 2 - ది రూల్ ' - మూవీ రివ్యూ!

Pushpa 2 The Rule

Pushpa 2 The Rule Review

  • బలమైన కథాకథనాలు
  • ఆసక్తికరమైన సన్నివేశాలు 
  • ఆకట్టుకునే యాక్షన్ .. ఎమోషన్స్
  • మెప్పించే ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం 
  • సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచిన బన్నీ నటన  

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'పుష్ప' సంచలన విజయాన్ని నమోదు చేసింది. సుకుమార్ కథాకథనం .. అల్లు అర్జున్ స్టైల్ .. దేవిశ్రీ పాటలు ఆ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయి. అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ గా 'పుష్ప 2' రూపొందింది. భారీ అంచనాల మధ్య ఈ రోజునే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఎర్రచందనం స్మగ్లింగ్ లో పుష్పరాజ్ (అల్లు అర్జున్) అంచలంచెలుగా ఎదుగుతాడు. ఒక వైపున శ్రీవల్లి (రష్మిక)తో వైవాహిక జీవితాన్ని హ్యాపీగా గడుపుతూనే, మరో వైపున తన స్మగ్లింగ్ కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లాలనే పట్టుదలతో ఉంటాడు. అయితే తన ఇంటిపేరు విషయంలోని అసంతృప్తి మాత్రం అతణ్ణి వెంటాడుతూనే ఉంటుంది. అతణ్ణి ఆధారలతో సహా పట్టుకుని, తనకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పగతో షెకావత్ ( ఫహాద్ ఫాజిల్) ఉంటాడు. మరో వైపున పుష్పరాజ్ వలన తాము కోల్పోయిన సిండికేట్ ను తిరిగి సొంతం చేసుకోవడానికి మంగళం శీను (సునీల్) వెయిట్ చేస్తూ ఉంటాడు. 

 ఈ నేపథ్యంలోనే శ్రీవల్లి ముచ్చట తీర్చడం కోసం ముఖ్యమంత్రి (ఆడుకాలం నరేన్)తో కలిసి ఫొటో దిగాలని పుష్పరాజ్ నిర్ణయించుకుంటాడు. ఎంపీ సిద్ధప్ప (రావు రమేశ్)తో కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళతాడు. పుష్పరాజ్ పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పిన ముఖ్యమంత్రి, ఆయనతో ఫొటో దిగడానికి మాత్రం 'నో' చెబుతాడు. ఒక స్మగ్లర్ తో కలిసి ఫొటో దిగడం కుదరదని అవమానపరుస్తాడు.

ముఖ్యమంత్రి ఫొటో దిగే ఛాన్స్ ఇవ్వకపోవడంతో పుష్పరాజ్ ఫీలవుతాడు. అక్కడికక్కడే సిద్ధప్పతో కలిసి ఫొటో దిగుతాడు. అతనిని తాను ముఖ్యమంత్రిని చేయనున్నట్టు చెబుతాడు. అందుకు పెద్దమొత్తంలో డబ్బు అవసరమవుతుందని సిద్ధప్ప అంటాడు. ఆ డబ్బు కోసం  తాను అప్పటివరకూ దాచిన ఎర్రచందనం దుంగలను ఇతర దేశాలకు తరలించాలని పుష్పరాజ్ భావిస్తాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? అతణ్ణి రెడ్ హ్యాండెడ్ గా షెకావత్ పట్టుకోగలుగుతాడా? పుష్పరాజ్ నుంచి సిండికేట్ ను సొంతం చేసుకోవాలనే మంగళం శ్రీను ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఎదిగేవాడికి ఎక్కువమంది శత్రువులు ఉంటారు. ఇక అక్రమంగా ఎదిగేవారికి మరింతమంది శత్రువులు ఉంటారు. అలాంటివారి నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగడుతూ .. తాను అనుకున్నది సాధించే దిశగా దూసుకుపోయే పుష్పరాజ్ అనే ఒక ఎర్రచందనం స్మగ్లర్ కథ ఇది. గతంలో వచ్చిన మొదటి భాగానికి కొనసాగింపుగా సుకుమార్ ఈ కథను సిద్ధం చేశాడు. 

హీరోకి తన పుట్టుక .. ఇంటిపేరు విషయంలో ఒక అసంతృప్తి ఉంటుంది. ఆ నింద నుంచి తన పిల్లలు కూడా బయటపడేలా లేరే అనే ఒక ఆవేదన ఉంటుంది. అలాగే తన భార్య ముచ్చట తీర్చడం కోసం అతను రాజకీయాలనే శాసించే పరిస్థితి వస్తుంది. ఇక మరో వైపున షెకావత్ నుంచి తప్పించుకుంటూ తన సిండికేట్ ను నడపాలి. ఇంకో వైపున మంగళం శీను కదలికలను కనిపెడుతూ ఉండాలి. ఇన్ని వైపుల నుంచి హీరో పాత్రను బిగిస్తూ సుకుమార్ కథను తయారు చేసుకున్న తీరు బాగుంది. 

ఈ ఆపదల నుంచి హీరో ఎలా బయటపడతాడు? తాను అనుకున్నది ఎలా సాధిస్తాడు? అనే ఒక ఉత్కంఠ భరిత పరిస్థితుల మధ్య ఆయన తన కథనాన్ని పరుగులు పెట్టించిన విధానం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. శ్రీవల్లి - పుష్పరాజ్ మధ్య ఒకే సమయంలో కామెడీతో కూడిన రొమాంటిక్ టచ్ ఇచ్చిన పద్ధతి ప్రేక్షకుల నుంచి ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. పుష్పరాజ్  ఇంట్రడక్షన్ సీన్ .. సిద్ధప్పను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించుకోవడం .. నది మార్గంలో లారీల్లో ఎర్రచందనాన్ని తరలించడం .. జాతర సీన్ .. అన్నకూతురు మానం కాపాడటం వంటి సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయని చెప్పచ్చు. 

పనితీరు: అల్లు అర్జున్ తన పాత్రలో పూర్తిగా ఇమిడిపోయాడు. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ లో కట్టిపడేశాడు. ముఖ్యంగా 'జాతర'లో ఒకేసారి చూపించిన యాక్షన్ .. ఎమోషన్ .. 'మాతంగి' అమ్మవారి లుక్ తో వేసిన డాన్స్ ఆయన టాలెంట్ కి కొలమానంగా నిలుస్తుంది. ఆయన భార్య పాత్రలో శ్రీవల్లి నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు పుష్పరాజ్ ను దెబ్బకొట్టబోయి, తానే భంగపడే షెకావత్ పాత్రలో ఫహద్ నటన మెప్పిస్తుంది. ఇక జగపతిబాబు .. రావు రమేశ్ .. ఆడుకాలం నరేన్ పాత్రలకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వలేదు. సునీల్ .. అనసూయ పాత్రలు కూడా ఈ పార్టులో నామమాత్రంగా కనిపిస్తాయంతే.

మిరోస్ల క్యూబా బ్రోజెక్ కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచిందని చెప్పచ్చు. అడవి నేపథ్యం .. యాక్షన్ సీన్స్ .. నైట్ ఎఫెక్ట్ సీన్స్ ను .. సాంగ్స్ ను ఆయన చిత్రీకరించిన తీరు ప్రేక్షకులను కదలనీయకుండా చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు మాస్ ఆడియన్స్ కి పట్టుకునేలా ఉన్నాయి. ఇక ఆయనతో పాటు సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా మంచి మార్కులు రాబడుతుంది. 

శ్రీకాంత్ విస్సా సంభాషణలు కూడా సందర్భానికి తగినట్టుగా అనిపిస్తాయి. పీటర్ హెయిన్ .. డ్రాగన్ ప్రకాశ్ కంపోజ్ చేసిన ఫైట్స్ .. క్లాప్స్ కొట్టిస్తాయి. మైత్రీ వారి నిర్మాణ విలువలు .. సుకుమార్ కథ - స్క్రీన్ ప్లే .. దేవిశ్రీ సంగీతం .. బన్నీ నటన .. ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రాధానమైన బలంగా చెప్పుకోవచ్చు. 'పుష్ప' తరువాత ఆ సినిమా సీక్వెల్ కోసం ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న అభిమానులను ఈ సినిమా ఎంతమాత్రం నిరాశపరచదనే చెప్పాలి.

Movie Name: Pushpa 2 The Rule

Release Date: 2024-12-05
Cast: Allu Arjun , Rashmika Mandanna , Fahadh Faasil , Jagapathi Babu, Prakash Raj, Sunil, Rao Ramesh
Director: Sukumar
Music: Devi Sri Prasad
Banner: Mythri Movie Makers - Sukumar Writings

Pushpa 2 The Rule Rating: 3.50 out of 5

Trailer

More Reviews