'నారదన్' (ఆహా) మూవీ రివ్యూ!

Naradan

Naradan Review

  • టోవినో థామస్ హీరోగా రూపొందిన 'నారదన్'
  • 2022లో మలయాళంలో విడుదలైన సినిమా 
  • నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చిన తెలుగు వెర్షన్
  • ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చే కంటెంట్            

మలయాళంలో టోవినో థామస్ కి మంచి క్రేజ్ ఉంది. 'మిన్నల్ మురళి' .. '2018' .. 'ARM' వంటి అనువాదాల వలన, ఓటీటీ సినిమాల వలన ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆయన నటించిన 'నారదన్' సినిమా, 2022లో థియేటర్లకు వచ్చింది. ఆ తరువాత మలయాళంలోనే ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. నిన్నటి నుంచి 'ఆహా'లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: తెలుగు అనువాదం ప్రకారం ఈ కథ హైదరాబాద్ లో జరుగుతూ ఉంటుంది. చంద్రప్రకాశ్ (టోవినో థామస్) ఓ విలేజ్ కి చెందిన యువకుడు. మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడు. హైదరాబాదులోని ఒక న్యూస్ ఛానల్ లో ఆయన జర్నలిస్టుగా పనిచేస్తూ ఉంటాడు. ఆ ఛానల్ లో ఆయన కీలకమైన వ్యక్తిగా అంతా భావిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ ఛానల్ యాజమాన్యం వేరే ఛానల్ కి చెందిన ప్రదీప్ (బాలచంద్రన్)ను ఎంప్లాయ్ గా తీసుకుంటుంది. 

తనస్థాయి హోదాను ప్రదీప్ కి ఇవ్వడం .. తనకంటే ఎక్కువ శాలరీ ఇవ్వడం చంద్ర ప్రకాశ్ కి తీవ్రమైన అసహనాన్ని .. అసంతృప్తిని కలిగిస్తుంది. దాంతో కొన్ని పెద్ద తలకాయలు కలిసి పెట్టే కొత్త న్యూస్ ఛానల్ లో ఆయన జాయిన్ అవుతాడు. ఆ న్యూస్ ఛానల్ కి 'నారదన్' అనే పేరు పెట్టడం దగ్గర నుంచి అన్ని ప్రోగ్రామ్స్ ను అతనే డిజైన్ చేస్తాడు. అనుకున్న సమయానికంటే ముందుగానే ఆ ఛానల్ సక్సెస్ అవుతుంది. దాంతో చంద్రప్రకాశ్ ఒక్కసారిగా ఎదిగిపోతాడు.          

చంద్ర ప్రకాశ్ గతంలో ఒక యువతిని ప్రేమిస్తాడు. అయితే ఆ తరువాత ఆమెకి దూరంగా ఉంటాడు. తనని కలవడానికి ఆమె ప్రయత్నించినా అందుకు అవకాశం ఇవ్వడు. డబ్బు - పేరు ఒక్కసారిగా వచ్చి పడటంతో చంద్ర ప్రకాశ్ తీరు మారిపోతుంది. అప్పటివరకూ తనతో కలిసి పనిచేసినవారిని సైతం ఆయన దూరం పెడతాడు. ఓ యువకుడి కారణంగా తనకి అవమానం జరిగిందనే ఉద్దేశంతో, అతనికి మాదక ద్రవ్యాలకు సంబంధించిన మాఫియాతో సంబంధం ఉందని అరెస్టు చేయిస్తాడు. ఆ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఒక జర్నలిస్ట్ తాను ఎదగడం కోసం ఎలాంటి దారుణాలకు పాల్పడతాడు? ఆయన చేసిన అక్రమాలన్నీ ఏకమై ఎలా చుట్టుముడతాయి? అనే ఈ కథను 'ఉన్ని ఆర్' తయారు చేసిన విధానం బాగుంది. దర్శకుడు ఈ కథను పెర్ఫెక్ట్ గా అందించడంలో .. ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు. కంటెంట్ ఎక్కడా ఫ్రేమ్ దాటకుండా నడుస్తుంది. ఎక్కడా ఎలాంటి అయోమయం లేకుండా ఆకట్టుకుంటుంది.

ఈ కథ ఒక వైపున న్యూస్ ఛానల్ లోను .. మరో వైపున కోర్టు హాల్ లోను జరుగుతుంది. సాధారణంగా కోర్టు రూమ్ డ్రామా అనగానే చాలామంది బోర్ ఫీలవుతారు. కానీ కోర్టు రూమ్ కి సంబంధించిన సన్నివేశాలే ఈ కథకి హైలైట్ గా నిలుస్తాయి. కోర్టులోని వాదనలు అనువదించినప్పుడు చాలావరకూ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో కోర్టు రూమ్ వాదనలు వింటుంటే తెలుగు సినిమా చూస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది.

రెండు న్యూస్ ఛానల్స్ మధ్య పోటీగా ఈ కథ నడుస్తూ ఉంటుంది. చివరివరకూ ఇదే ట్రాక్ పై ఈ కథ పరిగెడుతుందని ప్రేక్షకులు భావిస్తారు. కానీ కోర్టు కేసు దగ్గర నుంచి ఈ కథ అనూహ్యమైన మలుపు తీసుకుంటుంది. అక్కడి నుంచి మరింత పట్టుగా నడుస్తుంది. ఈ కంటెంట్ లో లవ్ .. రొమాన్స్ .. కామెడీకి ఏ మాత్రం చోటులేదని తెలిసి చూస్తేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేయగలుగుతారు. 

పనితనం: చాలా తక్కువ ప్రధానమైన పాత్రలతో దర్శకుడు కాస్త ఇంట్రెస్టింగ్ కథనే చెప్పాడు. న్యూస్ ఛానల్ నేపథ్యం .. కోర్టు రూమ్ నేపథ్యమనేవి బోర్ కొట్టే అంశాలే అయినా, ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో తనవంతు ప్రయత్నం చేశాడు. పురాణ కాలంలో సమాచారాన్ని చేరవేసిన మొదటి వ్యక్తి నారదుడే కనుక, తమ ఛానల్ పేరు 'నారదన్' అంటూ, హీరో పాత్ర చేతనే దర్శకుడు క్లారిటీ ఇప్పించాడు. 

చంద్రప్రకాశ్ పాత్రలో టోవినో థామస్ గొప్పగా చేశాడు. ఆవేశం .. అహంభావం .. నిర్లక్ష్యం కలిగిన ఆ పాత్రలో ఆయన జీవించాడు. డబ్బు .. స్థాయి పెరుగుతూ ఉండటం వలన సహజంగా వచ్చే మార్పును ఆయన ఆ పాత్ర ద్వారా ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. మిగతా ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. వినోదపరమైన అంశాలకు దూరంగా నడిచే ఈ కథ, ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చుతుంది. 

Movie Name: Naradan

Release Date: 2024-11-29
Cast: Tovino Thomas, Anna Ben, Sharafudheen, Indrans
Director: Aashiq Abu
Music: Yakzan Gary Pereira - Neha Nair
Banner: Bhavani Movies

Naradan Rating: 2.50 out of 5

Trailer

More Reviews