'కంగువా' - మూవీ రివ్యూ!

Kanguva

Kanguva Review

  • సూర్య కథానాయకుడిగా రూపొందిన 'కంగువా'
  • భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా 
  • 1070- 2024 మధ్యలో నడిచే కథాకథనాలు 
  • క్లారిటీతో చెప్పలేకపోయిన దర్శకుడు
  • మెప్పించే నిర్మాణ విలువలు  
  • లొకేషన్స్ .. ఫొటోగ్రఫీ హైలైట్

సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో 'కంగువా' రూపొందింది. టైటిల్ తోను .. ఫస్టు పోస్టర్ తోను అందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, ఆ తరువాత అందరిలో కుతూహలాన్ని పెంచుతూ వచ్చింది. స్టూడియో గ్రీన్ - యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. దిశా పటాని .. బాబీ డియోల్ .. యోగిబాబు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: ఈ కథ 1070 -  2024కి మధ్య నడుస్తుంది. విదేశాలలో ఓ 12 ఏళ్ల కుర్రాడి బ్రెయిన్ పై ఒక ప్రయోగం జరుగుతుంది. ఆ ప్రయోగం మధ్యలో ఉండగా ఆ కుర్రాడు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. దాంతో అందుకు సంబంధించిన విలన్ టీమ్ ఆ కుర్రాడి కోసం గాలిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆ కుర్రాడు 'గోవా'లో ఫ్రాన్సిస్ (సూర్య)కి తారసపడతాడు. అప్పటి నుంచి ఆ పిల్లాడికి .. తనకి మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉందని ఫ్రాన్సిస్ కి అనిపిస్తూ ఉంటుంది.

ఫ్రాన్సిస్ ను ఏంజెలీనా (దిశాపటాని) లవ్ చేస్తూ ఉంటుంది. ఒకే వృత్తిని ఎంచుకున్న కారణంగా వారిద్దరూ తరచూ గొడవపడుతూ ఉంటారు. గోవాలో తనకి తారసపడిన కుర్రాడు ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా ఫ్రాన్సిస్ కి అనిపిస్తుంది. ఇలా 2024లో నడుస్తున్న కథ, అక్కడి నుంచి 1070 కాలానికి వెళుతుంది. అది సముద్రతీరంలో దట్టమైన అడవి ప్రాంతం. అక్కడ ప్రణవాది కోన - సాగరకోన - కపాల కోన - హిమకోన - అరణ్య కోన అనే ఐదు ప్రాంతాలు ఉంటాయి. అక్కడ ఐదు తెగలకు చెందిన ప్రజలు నివసిస్తూ ఉంటారు. 

విదేశీయులు ఇస్తామన్న సొమ్ముకు ఆశపడి ప్రణవాది కోనకి హాని చేయడానికిగాను, కపాలకోనకి చెందిన రుధిర ( బాబీ డియోల్) సిద్ధపడతాడు. రుధిరతో పాటు అతని ముగ్గురు తనయులకి ప్రణవాది కోనపై ఉన్న కోపమే అందుకు కారణం. 'కంగువా' నాయకత్వం వహించే ఆ గూడాన్ని నాశనం చేయడానికి వాళ్లు  బయల్దేరతారు. తమ ప్రాంతం .. తమ భాష .. తమ రక్తం ఒకటేనని కంగువా చెబుతున్నా వాళ్లు వినిపించుకోరు. తన గూడెం ప్రజలను ఎదిరించి ఒక పిల్లవాడిని కాపాడుతున్న అతని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోతారు.  అప్పుడు 'కంగువా' ఏం చేస్తాడు? శత్రువులను ఎలా ఎదిరిస్తాడు? కంగువాకి .. ఫ్రాన్సిస్ కి ఉన్న సంబంధం ఏమిటి? అనేది కథ.

విశ్లేషణ: శివ - ఆదినారాయణ కలిసి ఈ కథను తయారు చేశారు. ఈ కథ 1070 - 2024కి మధ్య కాలంలో జరుగుతుంది. ఆ కాలంలో కథ .. ఈ కాలంలో కథ .. ఒకదాని తరువాత ఒకటిగా తెరపైకి వస్తుంటాయి. 1024 కథలో ఒక కుర్రాడిని కాపాడటానికి కంగువా పోరాటం చేస్తూ ఉంటాడు. అలాగే 2024లోను ఒక కుర్రాడిని రక్షించడానికి ఫ్రాన్సిస్ నానా కష్టాలు పడుతూ ఉంటాడు. ఆ కాలానికీ .. ఈ కాలానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయంలో దర్శకుడు ఆసక్తిని రేకెత్తించాడు.

ఇది ఆటవిక తెగల మధ్య జరిగే ఆధిపత్య పోరాటం. విదేశీయుల స్వార్థం .. స్థానికుల మధ్య ఉండే ద్వేషం ఈ కథలో అంతర్లీనంగా ఉంటాయి. విదేశీయులు ఎరగా వేసిన సొమ్ముకు ఆశపడిన ఒక తెగ నాయకుడు, ఆ పోరాటంలో తన ముగ్గురు కొడుకులను కోల్పోతాడు. అప్పటి నుంచి అది ప్రతీకార పోరాటంగా మారుతుంది. ఇక తన జాతిని కాపాడుకోవడం కోసం .. ఒక తల్లికిచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం రెండు కోణాల్లో కంగువా పోరాటం కొనసాగుతూ ఉంటుంది.

కథను రెండు వేరు వేరు కాలాల్లో ప్లాన్ చేసుకోవడం .. ఆ కాలానికీ  .. ఈ కాలానికి ముడిపెట్టి నడిపించడం వరకూ బాగానే ఉంది. అయితే ఈ రెండు కథలు చెప్పడంలోనే క్లారిటీ లోపించింది.
కొండ ప్రజలకు సంబంధించిన తెగలు .. పాత్రలు ఎక్కువైపోయాయి. కథ అర్థమయ్యేలా కొన్ని సన్నివేశాలను డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది. కానీ యాక్షన్ సన్నివేశాలకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ వెళ్లారు. అరుపులు .. కేకలతో కూడిన ఆ యాక్షన్ సీన్స్ ను భరించడం కాస్త కష్టమేనని చెప్పాలి.

కొండజాతి ప్రజల కాస్ట్యూమ్స్ హెవీ అయినట్టుగా అనిపిస్తాయి. ప్రధానమైన పాత్రలు .. పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. కానీ ఆ పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. ఇక ఆధునిక కాలానికి సంబంధించిన పాత్రలలో దిశా పటాని పాత్ర తేలిపోతుంది. హాట్ భామగా పేరున్న ఈ సుందరిని గ్లామర్ పరంగా ఎంతమాత్రం వాడుకోలేకపోయారు. అలాగే యోగిబాబు పాత్ర కూడా చప్పగానే అనిపిస్తుంది. 

పనితీరు: మాస్ యాక్షన్  సినిమాలను రూపొందించడంలో శివకి మంచి అనుభవం ఉంది. కానీ ఈ  సినిమా విషయానికి వచ్చేసరికి, ఆయనకి క్లారిటీ మిస్సయిందని అనిపిస్తుంది. కథ తక్కువై .. పలచనై .. పోరాటాలు ఎక్కువైపోయాయి. ఆ ఎక్కువలో హింస .. రక్తపాతం మరింత ఎక్కువైపోయాయి. కథాకథనాల సంగతి అలా ఉంచితే, దర్శకుడు ఎంచుకున్న లొకేషన్స్ మెప్పిస్తాయి. కథ బాగా చెప్పి ఉంటే లొకేషన్స్ అదనపు బలంగా నిలిచేవి. 

నిర్మాణ విలువలకు వంక బెట్టవలసిన పనిలేదు. ఈ సినిమాకి వెట్రి పళనిస్వామి ఫొటోగ్రఫీ ప్లస్ అయ్యిందని చెప్పాలి. అడవి .. సముద్రం .. వర్షం నేపథ్యంలోని సన్నివేశాలను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తుంది. సాహిత్యం వినిపించని హోరు .. సన్నివేశాలను మించిపోయిన హోరు కాస్త ఇబ్బంది పెడుతుంది. నిషాద్ యూసఫ్ ఎడిటింగ్ ఓకే. కథకి కాస్త ప్లేస్ ఇచ్చి .. అది అర్థమయేలా చెప్పడానికి ప్రయత్నిస్తే, ఎమోషన్స్ ను కనెక్ట్ చేసే విషయంలో కసరత్తు చేస్తే తప్పకుండా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదేమో అనిపిస్తుంది. అవి లోపించడం వలన ఇతర ప్రేక్షకులకు కాస్త అసంతృప్తిగా అనిపించినా, సూర్య ఫ్యాన్స్ కి నచ్చే అవకాశాలైతే ఉన్నాయి. 

Movie Name: Kanguva

Release Date: 2024-11-14
Cast: Suriya, Disha Patani , Bobby Deol, Natarajan Subramaniam, Yogi Babu,
Director: Shiva
Music: Devi Sri Prasad
Banner: Studio Green - UV Creations

Kanguva Rating: 2.75 out of 5

Trailer

More Reviews