'పెపే' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Pepe

Pepe Review

  • కన్నడలో రూపొందిన 'పెపే' 
  • ఆగస్టులో థియేటర్లకు వచ్చిన సినిమా 
  • విలేజ్ నేపథ్యంలో నడిచే కథాకథనాలు 
  • అక్కడక్కడా వివాద స్పదమైన అంశాలు
  • మొత్తంగా ఫరవాలేదనిపించే కంటెంట్ ఇది

కన్నడలో ఈ ఏడాది ద్వితీయార్థంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాలలో 'పెపే' ఒకటి. వినయ్ రాజ్ కుమార్ .. కాజల్ కుందేర్ .. మయూర్ పటేల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి శ్రీలేశ్ నాయర్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 30వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ నెలలోనే ఓటీటీలోకి వచ్చింది. రీసెంటుగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

అది నగరానికి కాస్త దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతం. అక్కడ ఉండే మలబారి ఆ ఊరు చెరువుపై పెత్తనం చేస్తూ ఉంటాడు. చెరువులో మట్టి తీయడానికి రాయప్ప తన మనుషులతో వస్తాడు. వాళ్లు కూలిపని చేసేంత వరకూ ఉండటానికి మలబారి తమ బస్తీకి దూరంగా కొంత ప్రదేశాన్ని ఇస్తాడు. ఆ ప్రదేశం పేరే 'బద్నాల్'. మలబారి తమకి న్యాయమైన కూలి డబ్బులు ఇవ్వకపోవడంతో, చెరువులోని మట్టిని తమ కోసం రాయప్ప మనుషులు త్రవ్వుతారు. చెరువులోని నీటిని వాడుకోవడం మొదలుపెడతారు. 

ఆ సంఘటనతో మలబారి కన్నెర్ర జేస్తాడు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య గొడవ, రెండు కుటుంబాల గొడవగా మారుతుంది. దాంతో ఒకరి కుటుంబంలోని వారిని ఒకరు తరతరాలుగా చంపుకుంటూ వెళుతుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ (పెపే) పెద్దవాడవుతాడు. తన తాత రాయప్పను .. తండ్రి ధర్మాను .. మేనమామ గుణను కోల్పోయిన అతను, ప్రతీకార జ్వాలాతో రగిలిపోతుంటాడు. తన తల్లి ఏ కుటుంబం నుంచి వచ్చిందో, అదే కుటుంబానికి చెందిన 'సింధూ'ని 'పెపే' ప్రేమిస్తూ ఉంటాడు. అయితే తన తల్లి పెళ్లికి అడ్డుపడిన కులమే ఇక్కడ కూడా అడ్డుపడుతూ ఉంటుంది.

'పెపే' తల్లి అతను ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఆ ఊరు చెరువును గురించి పట్టించుకోవద్దనీ, ఆ చెరువును కాపాడుకునే ప్రయత్నంలోనే తమ వాళ్లంతా చనిపోయారని ఆందోళన చెందుతూ ఉంటుంది. తన తండ్రిని చంపింది 'మల్పె' అయ్యుంటాడనే అనుమానం 'పెపే'కి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 'సింధూ' పట్ల 'మల్పె' అల్లుడు అసభ్యంగా ప్రవర్తించడంతో, అతనికి 'పెపే' తగిన విధంగా బుద్ధి చెబుతాడు. 

'మల్పె' కూతురు ప్రభ .. ఈ విషయాన్ని తన తమ్ముడు 'నార్తన్'కి చెబుతుంది. నార్తన్ ఆవేశంతో 'పెపే'ను అంతం చేయబోయి, అతని చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. దాంతో మల్పె తన పాత మిత్రుడు .. రాజకీయం - రౌడీయిజం తెలిసిన సదానంద్ ను కలుకుంటాడు. 'పెపే'ను అంతం చేయమని చెబుతాడు. సదానంద్ ను వలలో వేసుకున్న ప్రభ, అతణ్ణి 'పెపే' పైకి ఉసిగొల్పుతుంది. అపుడు సదానంద్ ఏం చేస్తాడు? ఎవరి వర్గంలో ఎవరు మిగులుతారు? అనేది కథ.

ఈ కథను దర్శకుడు శ్రీలేశ్ నాయర్ తయారు చేసుకున్నాడు. గ్రామీణ నేపథ్యం ఈ కథకి బలం. ఒక వైపున రాజకీయం .. మరో వైపున అధికార దాహం .. ఇంకో వైపున కులతత్వం .. ఇలా గ్రామాల్లో అన్ని మూలల్లో కనిపించే పరిస్థితులను కలుపుకుంటూ ఆయన ఈ కథను అల్లుకున్నాడు. సహజత్వానికి దగ్గరగా ఆ సన్నివేశాలను ఆవిష్కరించాడు. ప్రధానమైన పాత్రలను ఆయన మలిచిన తీరు, నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది.

చిన్నప్పటి నుంచి కళ్లముందు జరుగుతున్న సంఘటనలు .. పెరిగిన వాతావరణం పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. రాజకీయం ..రౌడీయిజం .. పల్లెటూరి పగ - ప్రతీకారాల సంగతి అటుంచితే, కుల సంబంధమైన అంశాలు కొన్ని వివాదాస్పదంగా అనిపిస్తాయి. పాత్రలు .. తరాలను ఒకేసారి ఏకధాటిగా వాయిస్ ఓవర్ లో లాగించేయడంతో అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. 

కథాకథనాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. నటీనటులంతా సహజత్వానికి దగ్గరగా తమ పాత్రలను తీసుకెళ్లగలిగారు. అభిషేక్ ఫొటోగ్రఫీ బాగుంది. గ్రామీణ నేపథ్యంలోని దృశ్యాలను ఆయన అందంగా ఆవిష్కరించిన విధానం మనసుకి పట్టుకుంటుంది. పూర్ణచంద్ర తేజస్వి అందించిన సంగీతం సందర్భానికి తగినట్టుగా కొనసాగింది. ఎడిటింగ్ కూడా నీట్ గానే అనిపిస్తుంది.

 ఒక గ్రామం .. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కుటుంబాలు .. ఆ కుటుంబాల మధ్య జరిగే పోరాటం ఈ కథలో కనిపిస్తాయి. ప్రేమ .. త్యాగం .. పగ .. ప్రతీకారం .. స్వార్థం అనేవి ఆయా వ్యక్తుల స్వభావాలుగా పలకరిస్తాయి. హీరో - హీరోయిన్స్ వైపు నుంచి లవ్ .. రొమాన్స్ లాంటివేమీ కనిపించవు. యాక్షన్ .. ఎమోషన్స్ మాత్రం ఉంటాయి. హఠాత్తుగా వచ్చే అభ్యంతరకరమైన సన్నివేశం ఉంది. అలాగే రక్తపాతం .. హింసకి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని వివాదస్పదమైన సన్నివేశాల సంగతి అలా ఉంచితే, ఒక విలేజ్ లోని అన్ని కోణాలను ఆవిష్కరించిన సినిమాగా ఇది కనిపిస్తుంది. 

Movie Name: Pepe

Release Date: 2024-10-11
Cast: Vinay Rajkumar, Mayur Patel, Naveen D Padil, Yash Shetty, Kaajal Kunder
Director: Shreelesh S Nair
Music: Poornachandra Tejaswi
Banner: Uday Cine Venture - Deepa Films

Pepe Rating: 2.50 out of 5

Trailer

More Reviews