తమిళంలో ఈ మధ్య కాలంలో డ్రామా జోనర్లో వచ్చిన సినిమాలలో 'మీయాళగన్' ఒకటి. కార్తీ - అరవింద్ స్వామి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.
సత్యం (అరవింద్ స్వామి) ఒక పల్లెటూరులో పుట్టిపెరుగుతాడు. తాతల కాలం నుంచి ఉన్న ఆ ఇల్లు అంటే అతనికి ఎంతో ఇష్టం. అలాగే పచ్చని ప్రకృతితో కళకళలాడుతూ కనిపించే ఆ పల్లెటూరు అంటే అతనికి ప్రాణం. అతని తండ్రి రామలింగం (జేపీ) స్కూల్ లో పాఠాలు చెబుతూ ఉంటాడు. ఆయన భార్య సీతమ్మ ఆదర్శవంతమైన ఇల్లాలు. రామలింగం తోడబుట్టినవారు చేసిన మోసం కారణంగా అతను ఆ ఇల్లు ఖాళీ చేసి ఊరు వదిలిపోవలసి వస్తుంది.
సత్యం టీనేజ్ లో ఉండగా ఈ సంఘటన జరుగుతుంది. ఆ తరువాత అతను తన తల్లిదండ్రులతో కలిసి సిటీకి వెళ్లిపోతాడు. అక్కడ అతను మంచి ప్రయోజకుడు అవుతాడు. హేమ (ప్రియదర్శిని)తో అతని వివాహం జరుగుతుంది. వారికి ఒక ఆడపిల్ల కలుగుతుంది. సత్యం తన సొంత ఊరు వదిలేసి పాతికేళ్లు అవుతున్నా, ఆ ఊరుపై అతనికి ఆ ప్రేమ అలాగే ఉండిపోతుంది. ఊరును చూడాలని ఉంటుంది .. కానీ తమని మోసం చేసిన బంధువులను కలవాలని ఉండదు.
అలాంటి పరిస్థితుల్లో సత్యం బాబాయ్ కూతురు 'మోనా' .. అతనికి కాల్ చేస్తుంది. తన పెళ్లికి రమ్మని చెప్పి బ్రతిమాలుతుంది. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి పట్ల ఉన్న ప్రేమ కారణంగా సత్యం ఆ ఊరు వెళతాడు. అక్కడి బంధువులు పలకరిస్తున్నా, అతను వాళ్లలో కలవలేక ఇబ్బంది పడుతుంటాడు. అప్పుడు ఓ యువకుడు (కార్తీ) వచ్చి సత్యాన్ని ఆప్యాయంగా పలకరిస్తాడు. దగ్గరుండి అతనికి ఏం కావాలనేది చూసుకుంటూ ఉంటాడు.
సత్యం కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను ఆ యువకుడు చెబుతుంటాడు. అతనిని సత్యం గుర్తుపట్టడు .. కానీ ఆ విషయం పైకి చెబితే ఫీలవుతాడని గుర్తుపట్టినట్టుగా నటిస్తూ ఉంటాడు. ఆ యువకుడి పేరు తెలుసుకోవడానికి సత్యం చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. ఆ రోజు రాత్రి బస్సు మిస్సయితే, ఆ యువకుడు సత్యాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్లి మరింత ప్రేమగా చూస్తాడు.
తన కుటుంబం పట్ల ఆ యువకుడికి ఉన్న ప్రేమ, తన తల్లిదండ్రుల పట్ల అతనికి గల గౌరవభావం సత్యాన్ని కదిలించి వేస్తుంది. అతనికి పుట్టిన బిడ్డకు తన పేరు పెట్టుకుంటానని ఆ యువకుడు అనడంతో సత్యం మరింత ఎమోషనల్ అవుతాడు. ఆ యువకుడు ఎవరు? తన గతమంతా గాలించినా ఆ యువకుడు గుర్తుకు రావడం లేదే అని సత్యం బాధపడతాడు. తనలాంటి వాడికి అతని ఆతిథ్యాన్ని అందుకనే అర్హత లేదని భావిస్తాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ తరువాత ఏం జరుగతుంది? అనేది కథ.
దర్శకుడు ప్రేమ్ కుమార్ రాసుకున్న కథనే ఇది. చాలాకాలం క్రితమే వదిలేసిన సొంతవూరు. మోసం చేసిన బంధువులు .. అయినా ఓ పెళ్లి కోసం సత్యం ఆ ఊరు వెళ్లవలసి వస్తుంది. తనకి ఏ మాత్రం గుర్తులేని ఓ వ్యక్తి అక్కడ తనపై ప్రేమానురాగాలు కురిపించడం. అతను ఎవరో తెలియక సత్యం అసహనానికి లోనుకావడం .. నిస్వార్థమైన అతని అభిమానం ముందు తాను చాలా చిన్నవాడినని తెలుసుకోవడమే ఈ కథ.
ఇది హీరో - హీరోయిన్ .. లవ్ .. డ్యూయెట్లు వగైరా ఉండే రెగ్యులర్ సినిమా కాదు. రెండు ప్రధానమైన పాత్రల చుట్టూ తిరిగే ఒక ప్రత్యేకమైన కథ ఇది. ఈ రెండు పాత్రల మధ్య సన్నివేశాల కంటే కూడా సంభాషణలు ఎక్కువ. గతాన్ని గురించి .. ప్రస్తుతాన్ని గురించి రెండు పాత్రలు అలా మాట్లాడుకుంటూనే ఉంటాయి. నాన్ స్టాప్ గా సాగే ఆ మాటలు ఎమోషన్స్ వైపు తీసుకుని వెళ్లడం అటుంచి, అసహనాన్ని కలిగిస్తాయి .. చిరాకు తెప్పిస్తాయి.
సత్యానికి ఆ యువకుడు సైకిల్ గురించి చెప్పగానే, దానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. సత్యానికి అతను తన ఎద్దును పరిచయం చేయగానే, దానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. రెండు పాత్రలు చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాయి. ప్రేక్షకులకు మాత్రం చీమకుట్టినట్టుగా కూడా అనిపించదు. అందుకు కారణం ఆ ఫ్లాష్ బ్యాక్ లలో ఉన్న విషయం అంతంత మాత్రమే కావడం.
ఒక చిన్నమాట పట్టుకుని పెద్ద గొడవ చేసినట్టు, చిన్న లైన్ పట్టుకుని దర్శకుడు పెద్ద కథ ఏదో చెప్పబోతున్నాడని ప్రేక్షకులు అనుకుంటారు. చివరిలో భయంకరమైన బ్లాస్ట్ ఏదో జరుగుతుందని భావిస్తారు. కానీ దర్శకుడు ఇక్కడ కూడా ఆడియన్స్ అంచనాలు తలక్రిందులు చేశాడు. తన కంటెంట్ ను గెస్ చేయలేరని నిరూపించాడు. మహేందిరన్ కెమెరా పనితనం .. గోవింద్ వసంత నేపథ్య సంగీతం .. గోవింద్ రాజ్ ఎడిటింగ్ ఫరవాలేదు. కథాకథనాల సంగతి అలా ఉంచితే. లొకేషన్స్ బావున్నాయనిపిస్తుంది.
సున్నితమైన భావోద్వేగాలతో సాగే కథలు చాలా వరకూ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. కానీ చెప్పదలచుకున్న విషయాన్ని చివరివరకూ నిదానంగా లాగినప్పుడు .. చివరిలో ఆడియన్స్ ఆశించే బలమైన .. ఆసక్తికరమైన ట్విస్టు లేనప్పుడు అసహనం కలుగుతుంది .. అసంతృప్తి మిగులుతుందని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.
'మీయాళగన్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
| Reviews
Meiyazhagan Review
- తమిళంలో రూపొందిన 'మీయాళగన్'
- ప్రధాన పాత్రల్లో నటించిన కార్తీ - అరవింద్ స్వామి
- సెప్టెంబర్ 27న థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ నెల 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
- బలహీనమైన కథాకథనాలు
- సంభాషణలతోనే సాగదీసిన దర్శకుడు
Movie Name: Meiyazhagan
Release Date: 2024-10-25
Cast: Karthi , Arvind Swamy, Saran Shakthi , Rajkiran , Sri Divya, Devadarshini
Director: C Prem Kumar
Music: Govind Vasantha
Banner: 2D Entertainment
Review By: Peddinti
Meiyazhagan Rating: 2.25 out of 5
Trailer