'1000 బేబీస్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

1000 Babies

Movie Name: 1000 Babies

Release Date: 2024-10-18
Cast: Neena Guptha, Rehaman, Adil Ibrahim, Ashwin Kumar, Sanju Shivaram
Director:Najeem Koya
Producer: Shaji Nadesan - Arya
Music: ShankarSharma
Banner: August Cinema
Rating: 2.50 out of 5
  • క్రైమ్ థ్రిల్లర్ గా '1000 బేబీస్'
  • ఆసక్తిని రేకెత్తించే కథాంశం 
  • బలహీనమైన స్క్రీన్ ప్లే 
  • కనిపించని ట్విస్టులు 
  • నత్తనడక నడిచే సన్నివేశాలు       



ఈ మధ్య కాలంలో స్ట్రీమింగ్ కి ముందు నుంచే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చిన వెబ్ సిరీస్ గా  '1000 బేబీస్' కనిపిస్తుంది. నజీమ్ కోయ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో నీనా గుప్తా .. రెహమాన్ (రఘు) ప్రధానమైన పాత్రలను పోషించారు. నిన్నటి నుంచి ఈ సిరిస్ 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 7 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

సారా (నీనా గుప్తా) మానసిక స్థితిని కోల్పోయినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమె కొడుకు 'బిబిన్' ఆమెను ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంట్లో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. తన గది గోడలపై ఆమె మార్కర్ పెన్ తో ఏవేవో అడ్రెస్ లు రాస్తూ ఉంటుంది. మార్కర్ పెన్ అందుబాటులో లేకపోతే ఆమె చాలా  చిరాకు చేస్తూ ఉంటుంది. తన ఇంటి ప్రాంగణంలో పసిపిల్లల ఊయలలు ఊగుతున్నట్టు .. పసిపిల్లలు ఏడుస్తున్నట్టు ఆమెకి అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఆమె తీవ్రమైన ఆందోళనకు లోనవుతూ ఉంటుంది. 

ఒక రోజున సారా తన కొడుకైన 'బిబిన్'కి ఒక చేదు నిజం చెబుతుంది. దాంతో ఆవేశంతో అతను ఆమెపై దాడి చేసి పారిపోతాడు. బలమైన గాయాలతో ఉన్న ఆమెను హాస్పిటల్లో చేరుస్తారు. ఆమె కోరిక మేరకు అడ్వకేట్ రాజన్ ను .. పోలీస్ ఆఫీసర్ నవాజ్ ను పిలిపిస్తారు. ఆ ఇద్దరికీ ఆమె రెండు సీల్డ్ కవర్లు ఇస్తుంది. ఒక కవర్ ను మేజిస్ట్రేట్ కి అందజేయమని రాజన్ తో చెబుతుంది. ఆమె చెప్పినట్టుగానే అతను మేజిస్ట్రేట్ కి ఆ కవర్ ను అందజేస్తాడు. ఆ సమయానికి సారా చనిపోతుంది. 

సారా రాసిన లెటర్ చదివిన మేజిస్ట్రేట్ షాక్ అవుతాడు. సీఐ నవాజ్ .. ఎస్పీ అనిల్ దాస్ తో కలిసి మేజిస్ట్రేట్ ను కలుస్తారు. ఆ కవర్లో సారా రాసిన విషయాలు నిజమేనని చెబుతారు. సారా రాసిన ఆ లెటర్లో ఏముందనేది ఎలాంటి పరిస్థితుల్లోను బయటికి రాకూడదని భావిస్తారు. అలా 12 ఏళ్లు గడిచిపోతాయి. ఓ రోజున సినీనటి 'యాన్సి' మర్డర్ జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ అజీ కురియన్ ఆ కేసును ఛేదిస్తూ వెళతాడు. అప్పుడు తెరపైకి 'బిబిన్'పేరు వస్తుంది. అప్పుడు అజీని మేజిస్ట్రేట్ పిలిపిస్తాడు. సారా కేసు విషయంలో జరిగింది ప్రస్తావిస్తాడు.  

తల్లీపిల్లలకి సంబంధించిన 'బీచ్ హాస్పిటల్' లో హెడ్ నర్సుగా సారా పనిచేస్తూ ఉండేది. వైవాహిక జీవితానికి ఆమె దూరమవుతుంది. అందుకు కారణం ఆమెకి సంతానం లేకపోవడమే. దాంతో ఆమెలో ఒక రకమైన శాడిజం పెరిగిపోతుంది. తన హాస్పిటల్లో ఆడ శిశువులను కన్నవారికి మగ శిశువులను .. మగశిశువులను కన్నవారికి ఆడశిశువులను పురిటిలోనే మార్చేస్తుంది. అలా ఆమె 1000 మంది పిల్లలను తారుమారు చేస్తుంది. ఆలా మార్పిడి చేసిన ఇద్దరి పేరెంట్స్ అడ్రెస్ లను ఆమె డైరీలో రాసుకుంటుంది. ఆ వివరాలని తన గది గోడలపై కూడా రాస్తుంది. 

సారా కొడుకుగా ఉన్న 'బిబిన్' కూడా అసలైన తల్లికి తెలియకుండా ఈమె దగ్గర పెరిగినవాడే. తనని తల్లికి తనని దూరం చేసిందనే కోపంతోనే సారా మరణానికి 'బిబిన్' కారణమవుతాడు. ఆమె రాసిన డైరీలు పట్టుకుని పారిపోతాడు. ఉన్మాదిగా మారిన అతని వలన, ఆ అడ్రెస్ లలో ఉన్న వేయిమంది ప్రాణాలు ప్రమాదంలో పడనున్నాయి. అందువలన బిబిన్ ను పట్టుకోవాలని అజీతో చెబుతాడు మేజిస్ట్రేట్. అప్పుడు అజీ ఏం చేస్తాడు? ఈ ఆపరేషన్ లో అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా ఎదుర్కొంటాడు? అనేది కథ. 

'1000 బేబీస్' .. టైటిల్ తోనే ఉత్కంఠను రేకెత్తించిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. నీనా గుప్తా సీనియర్ నటి. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలలో రెహమాన్ కి మంచి గుర్తింపు ఉంది. అందువలన ఈ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చని చాలా మంది అనుకుంటారు. ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని భావిస్తారు. ప్రతి ఎపిసోడ్ చాలా థ్రిల్ చేయవచ్చని ఆశపడతారు. అలాంటివారి ఆశలపై నీళ్లు చల్లిన సిరీస్ ఇది. ఈ కథను ఇలా చెప్పడానికా ఇన్ని రోజులు ఇంత హడావిడి చేసింది అనిపిస్తుంది. 

జీవితంలో తనకి జరిగిన అన్యాయం వలన ఒక వ్యక్తి ఉన్మాదిగా మారిపోయి, తనకి లభించిన ఒక లిస్టు ప్రకారం హత్యలు చేస్తూ వెళుతుంటాడు. హత్యలు జరిగే తీరు ఎంతటి ఉత్కంఠ భరితంగా ఉంటుందో .. ఇన్వెస్టిగేషన్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా సాగాలి. కానీ ఈ రెండు విషయాలలోను ఈ  సిరీస్ చురుకుదనమనేది లేకుండా మందకోడిగా అలా సాగుతూ ఉంటుంది. 'బిబిన్'ను లేపేయాలి అని పైఅధికారి చెబుతుంటే, 'హంతకుడిని పట్టుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏమిటి?' అని స్పెషల్ ఆఫీసర్ అజీ అడుగుతూ ఉంటాడు. డబ్బింగ్ లో పొరపాటు అనుకోవాలా? అనేది అర్థం కాదు.

ఇక ఈ సిరీస్ లో సూత్రధారి 'బిబిన్' .. ఆయా పాత్రలు ఆ పేరును వివిన్ .. విబిన్ .. విపిన్ ఇలా పలుకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టడమే ఒక పరీక్షలా అనిపిస్తుంది. హంతకుడు అంత తెలివైనవాడు .. ఇంత తెలివైనవాడు .. అసాధ్యుడు అంటూ ప్రేక్షకులను భయపెట్టేసే పనిలో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అవతల చూస్తేనేమో అంత విషయం ఉండదు. చివరిలో హీరో ఒక మాట అంటాడు .. 'అసలు కథ ఇప్పుడే మొదలైంది' అని. కథ ఉన్న దగ్గర నుంచే మొదలుపెడితే పోయేదిగా' అనుకోవడం ప్రేక్షకుల వంతు అవుతుంది.

ఫయాజ్ సిద్ధిక్ ఫొటోగ్రఫీ .. శంకర్ శర్మ నేపథ్య సంగీతం .. జాన్ కుట్టి ఎడిటింగ్ ఫరవాలేదు. దర్శకుడు ఎంచుకున్న లైన్ కొత్తగానే ఉంది. కానీ స్క్రీన్ ప్లే వీక్ గా అనిపిస్తుంది. ప్రేక్షకులు ఆశించే ట్విస్టులు లేకపోవడం పెద్ద మైనస్. హంతకుడి పన్నాగాలు .. పోలీస్ ఆఫీసర్స్ వ్యూహాలు .. ఈ మధ్యలో వచ్చే ఫ్లాష్ బ్యాకులు చప్పగా సాగుతాయి. ఈ అంశాలపై కసరత్తు జరిగి ఉంటే బెటర్ అనిపించుకునేది.

Trailer

More Reviews