గోపీచంద్ హీరోగా ఒక సినిమా తరువాత ఒక సినిమాను చేసుకుంటూ వస్తున్నాడు. కథలో కొత్తదనం ఉండేలా చూసుకుంటూనే, తన మార్క్ యాక్షన్ మిస్సవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'విశ్వం'. చాలా గ్యాప్ తరువాత శ్రీను వైట్ల చేసిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఓ తీవ్రవాద నాయకుడు (జిషూ సేన్ గుప్తా) మారుపేరుతో ఇండియాలో విధ్వంసం సృష్టించడానికి వ్యూహ రచన చేస్తూ ఉంటాడు. ఒకానొక కారణంగా అతను బాచిరాజు (సునీల్) తో కలిసి సెంట్రల్ మినిస్టర్ సీతారామరాజు (సుమన్) ను హత్య చేస్తాడు. తన తోటి పిల్లలతో కలిసి స్కూల్ తరఫున విహారయాత్రకి వెళ్లిన దర్శన, ఆ సెంట్రల్ మినిస్టర్ హత్య చూస్తుంది. అప్పటి నుంచి దర్శన కోసం ఆ తీవ్రవాది మనుషులు వెదుకుతూ ఉంటారు.
దర్శన తల్లిలేని పిల్ల .. ఉద్యోగం నిమిత్తం ఆమె తండ్రి వేరే ఊళ్లో ఉంటాడు. ఆ పాప తన తాతయ్య ( బెనర్జీ) దగ్గర పెరుగుతూ ఉంటుంది. దర్శనపై ఎటాక్ చేయడానికి తీవ్రవాదులు ప్రయత్నించినప్పుడు, వాళ్లను గోపీ (గోపీచంద్) అడ్డుకుంటాడు. ఆ గండం నుంచి అతను ఆ పాపను కాపాడతాడు. దర్శన తండ్రి కార్తీక్ వచ్చేవరకూ తాను ఆ పాపను రక్షిస్తూ ఉంటానని ఆ పాప తాతయ్యకి మాట ఇస్తాడు.
గోపీకి మోసం చేసేవారంటే చిరాకు. మోసం అంటే తనకు ద్వేషమని తానే చెబుతూ ఉంటాడు. మోసగాళ్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకపోవడం అతన్ని అలవాటు. ఇక అతణ్ణి ఏమన్నా ఊరుకుంటాడు గానీ, అతని తండ్రిని ఉద్దేశించి ఏమైనా అంటే ఇక అతణ్ణి కంట్రోల్ చేయడం కష్టమే. అలాంటి ఆయన హైదరాబాద్ లో అడుగుపెడతాడు. ఇక్కడ తనవాళ్లంటూ ఎవరూ లేకపోయినా, ఆయన ఇక్కడ అడుగుపెట్టడం ఆశ్చర్యం.
హైదరాబాదులో ఉండటం కోసం గోపీ ఒక అపార్టుమెంటులో అడుగుపెడతాడు. అక్కడ పనిచేసే జాల్ రెడ్డి (పృథ్వీ)కి అన్నయ్య కొడుకునని చెప్పి పరిచయం చేసుకుంటాడు. తమ స్థలాన్ని ఆక్రమించుకుని అపార్టుమెంటు కట్టారని అక్కడి వారిని టెన్షన్ పెడతాడు. మొత్తానికి ఎలాగో అలా ఆ అపార్టుమెంటు పెంట్ హౌస్ లో చోటు దక్కేలా చూసుకుంటాడు. అదే అపార్టుమెంటులో ఉంటున్న శ్యామ్ (నరేశ్) కస్తూరి (పవిత్ర) దంపతులను కూడా గోపీ ధోరణి కంగారు పెడుతుంది. 'ఇటలీ'లో ఉంటున్న తమ కూతురు సమైరా (కావ్యా థాపర్)కూడా అతనికి పరిచయమేనని తెలుసుకుని మరింత కంగారు పడతారు. అతని బారి నుంచి తమ కూతురుని కాపాడుకోవాలని నిర్ణయించుకుంటారు.
దర్శన హత్యా సంఘటన చూసిన దగ్గర నుంచి ఆమె తాతయ్య స్కూల్ మాన్పిస్తాడు. జరిగిన సంఘటన గురించి ఆయన ఓ పోలీస్ ఆఫీసర్ దృష్టికి తీసుకుని వెళతాడు. ఆ తరువాత ఆ పాపతో అతను 'గోవా' వెళతాడు. ఈ విషయానికి సంబంధించిన సమాచారాన్ని ఆ పోలీస్ ఆఫీసర్ తీవ్రవాదికి అందిస్తాడు. దాంతో అతను తన ముఠాను అక్కడికి పంపిస్తాడు. అక్కడ ఏం జరుగుతుంది? దర్శనను గోపీ కాపాడుకోగలుగుతాడా? గోపీ గతం ఏమిటి? అనేవి ఆసక్తికరమైన అంశాలు.
ఇది శ్రీను వైట్ల కథ .. సాధారణంగా శ్రీను వైట్ల కథ అనగానే, కావాల్సినంత వినోదం ఉంటుంది. యాక్షన్ - కామెడీ ఒకదానికొకటి పోటీ పడుతుంటాయి. అలాగే ఈ రెండు అంశాలు కుటుంబ నేపథ్యాన్ని కేంద్రంగా చేసుకుని తిరుగుతూ ఉంటాయి. ఈ సినిమా విషయంలోను శ్రీను వైట్ల అదే పద్ధతిని ఫాలో అవుతూ వెళ్లాడు. కానీ మునుపటి మాదిరిగా మేజిక్ చేయలేకపోయాడు. యాక్షన్ లో హింస ఎక్కువగా కనిపిస్తే, కామెడీలో ఆశించిన స్థాయి పస కనిపించలేదు.
యాక్షన్ హీరోగా గోపీచంద్ కి మంచి పేరు ఉంది. ఆయనవైపు నుంచి యాక్షన్ కవర్ అవుతుంది. అందువలన కామెడీపై శ్రీను వైట్ల కాస్త ఎక్కువ శ్రద్ధనే పెట్టాడు. వెన్నెల కిశోర్ .. పృథ్వీ .. వీటీవీ గణేశ్ .. శ్రీనివాస్ రెడ్డి .. అజయ్ ఘోష్ మొదలైన పాత్రలను ఒకదాని తరువాత ఒకటిగా తెరపైకి దింపాడు. కానీ ఆ పాత్రలు చేసిన నవ్వుల సందడి చాలా తక్కువ. ట్రైన్ ఎపిసోడ్ కూడా తేలిపోయింది. ఆ ఎపిసోడ్ ను ఎంత హైలైట్ చేసినా అది కనెక్ట్ కాలేకపోయింది.
ప్రతి నాయకుడిగా జిషు సేన్ గుప్తా ఓకే. కానీ సుమన్ పాత్రను కనీసం రిజిస్టర్ కూడా చేయకుండా చంపేయడం .. సునీల్ ఉద్దేశం ఏమిటనేది అర్థమయ్యేలా చెప్పకపోవడం .. 'కిక్' శ్యామ్ పాత్రను నామమాత్రం చేయడం అసంతృప్తిని కలిగిస్తుంది. గోపీచంద్ ఫ్లాష్ బ్యాక్ .. 'కిక్' శ్యామ్ ఫ్లాష్ బ్యాక్ ఆసక్తికరంగా లేకపోవడం .. సాగదీసినట్టుగా అనిపించడం అసహనాన్ని కలిగిస్తాయి. కథను భారీగా చూపించారుగానీ, ఆసక్తికరంగా చెప్పలేకపోయారనిపిస్తుంది.
గుహన్ కెమెరా పనితనానికి ఎక్కువ మార్కులు పడతాయి. గోపీచంద్ ను మరింత హ్యాండ్సమ్ .. కావ్య థాపర్ ను గ్లామరస్ గా చూపించాడు. పాటల చిత్రీకరణలోను ప్రత్యేకత కనిపించింది. చైతన్ భరద్వాజ్ అందించిన బాణీలలో 'మల్లారెడ్డి' అంటూ సాగే పాట ముందువరుసలో నిలుస్తుంది. నేపథ్య సంగీతం బాగానే ఉంది. అమర్ రెడ్డి ఎడిటింగ్ ఫరవాలేదు. మొత్తంగా చూసుకుంటే, శ్రీను వైట్ల మార్క్ కి కాస్త దూరంగానే ఈ సినిమా కనిపిస్తుందని చెప్పాలి.
'విశ్వం' - మూవీ రివ్యూ!
| Reviews
Vishwam Review
- 'విశ్వం' గా వచ్చిన గోపీచంద్
- చాలా గ్యాప్ తరువాత శ్రీను వైట్ల చేసిన సినిమా
- యాక్షన్ లో ఎక్కువైపోయిన హింస
- కామెడీ విషయంలో తగ్గిన కసరత్తు
- శ్రీను వైట్ల మార్క్ కి దగ్గరలో లేని కంటెంట్
Movie Name: Vishwam
Release Date: 2024-10-11
Cast: Gopichand, Kavya Thapar, Jisshu Sengupta, Naresh, Vennela Kishore, Sunil, VTV Ganesh, Prudhvi Raj
Director: Srinu Vaitla
Music: Chaithan Bharadwaj
Banner: People Media Factory
Review By: Peddinti
Vishwam Rating: 2.50 out of 5
Trailer