ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై చిన్న సినిమాల సందడి గట్టిగానే కనిపిస్తోంది. అలా ఈ వారం ఓటీటీకి వచ్చిన సినిమాల జాబితాలో 'పైలం పిలగా' కనిపిస్తోంది. రామకృష్ణ - శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకి ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించాడు. సాయితేజ .. పావని జంటగా నటించిన ఈ సినిమా, 'ఈటీవీ విన్'లో నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
అది 'కోతులగుట్ట ' అనే చిన్న గ్రామం. అక్కడ శివ (సాయితేజ) అనే యువకుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉంటాడు. తల్లి .. తండ్రి .. నాయనమ్మ .. ఇది అతని కుటుంబం. ఏదైనా పని చూసుకోమని అతనిపై తండ్రి చిటపటలాడుతూ ఉంటాడు. శివకి మాత్రం 'దుబాయ్' వెళ్లి బాగా సంపాదించుకుని రావాలనే ఒక కోరిక బలంగా ఉంటుంది. అదే ఊరికి చెందిన 'అంజి' దుబాయ్ కి వెళ్లి వచ్చి గొప్పలు చెబుతూ ఉండటం కూడా అందుకు ఒక కారణం.
అదే విలేజ్ కి చెందిన దేవి (పావని)ని శివ ప్రేమిస్తూ ఉంటాడు. తనని పెళ్లి చేసుకునేవాడు తన కళ్లముందే ఉండాలనేది ఆమె అభిప్రాయం. ఉన్న ఊళ్లోనే ఏదైనా పని చూసుకోమని ఆమె శివకి చెబుతూ ఉంటుంది. కానీ శివ మాత్రం 'దుబాయ్' కి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. అయితే అందుకు సంబంధించిన పనులు పూర్తి కావాలంటే రెండు లక్షలు అవసరమవుతాయి. ఆ డబ్బు ఎక్కడా పుట్టకపోవడంతో శివ ఆలోచనలో పడతాడు.
తన పుట్టింటివారు తనకి ఇచ్చిన రెండు ఎకరాల పొలం అమ్ముకోమని శివతో నాయనమ్మ చెబుతుంది. దాంతో ఆ పొలం కాగితాలు పట్టుకుని రంగంలోకి దిగిన శివకి, 'కోతుల గుట్ట'గా పేరున్న ఆ కొండనే తన నాయనమ్మకు పుట్టింటివారు ఇచ్చిన ఆస్తి అనే విషయం అర్థమవుతుంది. ఆ రాళ్ల గుట్టను ఎవరు కొంటారు? అందువలన దానికి ఒక నాలుగు లక్షలు వచ్చినా చాలనుకుంటాడు. దానిని అమ్మనున్నట్టు చాటింపు వేయిస్తాడు.
అయితే ఆ రాళ్లగుట్టను తనకి అమ్మేయమని ఆ ఊరి ప్రెసిడెంట్ శివ వెనక పడుతూ ఉంటాడు. తాను 10 లక్షలు ఇస్తానని ఒక వ్యాపారి వస్తాడు. ఇక అప్పటి నుంచి శివ ఇంటికి చాలామంది క్యూ కడతారు. రెండు కోట్ల వరకూ ఇస్తామని పోటీపడుతూ ఉంటారు. ఆ గుట్ట ఖరీదైన మార్బుల్స్ కి సంబంధించినదనీ, దాని విలువ 50 కోట్లకి పైగా ఉంటుందనే విషయం శివకి తెలుస్తుంది. దాంతో సంతోషంతో అతను ఎగిరిగంతేస్తాడు.
'కోతులగుట్ట'ను టచ్ చేయాలంటే ఆ గ్రామస్తులు అందుకు ఒప్పుకోవలసి ఉంటుంది. ఇక ఆ గుట్టకు సంబంధించి అనేక డిపార్టుమెంట్ల అనుమతిని తీసుకోవలసి ఉంటుంది. ఆ అనుమతుల కోసం శివ ఎలాంటి కష్టాలు పడవలసి వస్తుంది? ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేది కథ.
ఈ కథ గ్రామీణ నేపథ్యలో సాగుతుంది. ప్రధానమైన ఓ పది పాత్రల మధ్య నడుస్తుంది. చిన్న బడ్జెట్ లో దర్శకుడు అనుకున్న కథ ఇది. తన ఆస్తిని తన అవసరానికి తగినట్టుగా మార్చుకోవడానికి హీరో ఎన్ని అవస్థలు పడ్డాడనేది ఈ కథలో ప్రధానమైన అంశం. దర్శకుడు ఎంచుకున్న లైన్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అయితే దానిని ప్రేక్షక జన రంజకంగా మలచడంలో ఆయన పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.
చక్కని గ్రామీణ నేపథ్యం ఉంది .. అందమైన లొకేషన్స్ ఉన్నాయి. అయితే అందుకు తగిన లవ్ .. సాంగ్స్ కోసం ఉపయోగించుకోలేకపోయారు. ఇక కామెడీకి కూడా మంచి అవకాశం ఉన్న కథ ఇది. ఆ దిశగానూ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా హీరో కీ .. హీరోయిన్ కి ఏ మాత్రం మ్యాచ్ కాలేదు. ఇక సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లవలసిన నేపథ్య సంగీతం నీరసంగా సాగుతుంది. హీరో చాలా ఇబ్బందులు పడుతుంటాడు .. కానీ ఆ ఎమోషన్స్ ను ఎక్కడా కనెక్ట్ చేయలేకపోయారు.
హీరో .. హీరోయిన్స్ ఇద్దరూ కూడా నటనపై కాస్త దృష్టి పెట్టాల్సిందే. సందీప్ బద్దుల ఫొటోగ్రఫీ .. యాశ్వంత్ నాగ్ సంగీతం .. రవితేజ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఈ కథలో పల్లెటూరును కూడా ప్రధానమైన పాత్రగా భావించవలసిందే. కొన్ని సన్నివేశాలలో పల్లెటూరు స్వభావాన్ని బాగానే వాడుకున్నారు. కానీ ఆడియన్స్ ఆశించే వినోదం వైపు నుంచి .. లవ్ .. డ్యూయెట్స్ వైపు నుంచి పట్టించుకోకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. ఓ సాదా సీదా సినిమాగానే అనిపిస్తుంది.
'పైలం పిలగా' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
| Reviews
Pailam Pilaga Review
- సెప్టెంబర్ 20న థియేటర్లకు వచ్చిన సినిమా
- నిన్నటి నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథాకథనాలు
- సరైన జోడీగా అనిపించని హీరో హీరోయిన్లు
- కనెక్ట్ కాని ఎమోషన్స్
- సాదాసీదాగా అనిపించే కంటెంట్
Movie Name: Pailam Pilaga
Release Date: 2024-10-10
Cast: Sai Teja, Pavani Karanam, Mirchi Kiran, Dubbing janaki, Chitram Srinu
Director: Anand Gurram
Music: Yashwanth Nag
Banner: Happy Horse Films
Review By: Peddinti
Pailam Pilaga Rating: 2.00 out of 5
Trailer