రజనీకాంత్ కథానాయకుడిగా జ్ఞానవేల్ రూపొందించిన సినిమానే 'వేట్టయన్'. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. రానా .. ఫహాద్ ఫాజిల్ .. రితికా సింగ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
అతియన్ (రజనీకాంత్) ఓ పోలీస్ ఆఫీసర్. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ఆయనకి పేరు. అటు ప్రభుత్వానికి అవసరమైన .. ఇటు ప్రజలు కోరుకునే ఆధారాలను సిద్ధం చేసుకుని మరీ ఆయన ఎన్ కౌంటర్లు కొనసాగుతూ ఉంటాయి. తన ఎన్ కౌంటర్ల వలన తండ్రిని కోల్పోయిన పిల్లలకు తనవంతు సాయం చేస్తూ ఉంటాడు. ఈ విషయంలో భార్య తార (మంజు వారియర్) అతనికి సహకరిస్తూ ఉంటుంది.
ఇక అతియన్ డీల్ చేసే కేసులలో ఆయనకి కుడిభుజంగా ప్యాట్రి (ఫహాద్ ఫాజిల్) వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక మరో పోలీస్ ఆఫీసర్ రూప (రితిక సింగ్) కూడా అతియన్ తో కలిసి పనిచేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా, 'కన్యాకుమారి'లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో శరణ్య (దుషారా విజయన్) టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. లోకల్ రౌడీ అయిన కుమార్ అక్కడి క్లాస్ రూమ్స్ లో 'గంజాయి' దాచిపెడతాడు. ఈ విషయాన్ని ఆమె అతియన్ దృష్టికి తీసుకుని వెళుతుంది. కుమార్ తో పాటు అతని గ్యాంగ్ పట్టుబడటానికి కారకురాలు అవుతుంది.
ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే, తాను పనిచేస్తున్న స్కూల్లో శరణ్య దారుణంగా హత్య చేయబడుతుంది. హంతకులను వెంటనే ఎన్ కౌంటర్ చేయాలంటూ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంటుంది. దాంతో పై అధికారులు ఈ కేసును అతియన్ కి అప్పగిస్తారు. శరణ్య హత్య కేసులో దోషి 'గుణ' అనే యువకుడని పోలీస్ ఆఫీసర్ హరీశ్ ( కన్నడ కిశోర్) అతియన్ కి చెబుతాడు. దాంతో పక్కాగా ఎన్ కౌంటర్ ప్లాన్ చేసిన అతియన్, గుణను లేపేస్తాడు.
గుణ ఎన్ కౌంటర్ విషయంలో అతియన్ ను సీనియర్ ఆఫీసర్ సత్యదేవ్ (అమితాబ్) నిలదీస్తాడు. అతియన్ ఎన్ కౌంటర్ చేసిన 'గుణ' ఒక నేరస్థుడు కాదనీ, తెలివైన విద్యార్థి అని చెబుతాడు. ఆ మాట వినగానే అతియన్ ఉలిక్కి పడతాడు. తాను చేసింది ఎన్ కౌంటర్ కాదనీ .. హత్య అని తెలుసుకుని బాధపడతాడు. గుణ నిర్దోషి అని ఈ లోకానికి చెబుతానని అతని తల్లికి మాట ఇస్తాడు. ఆ తరువాత అసలు నేరస్థుడిని పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు. అప్పుడు అతియన్ కి ఎదురైన సవాళ్లు ఎలాంటివి? వాటిని ఆయన ఎలా ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ.
జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఆయనే కథను రెడీ చేసుకున్నారు. జ్ఞానవేల్ కి కథపై మంచి పట్టుంది .. పాత్రలను ఆయన డిజైన్ చేసిన తీరు కారణంగా, ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఫస్టాఫ్ ఏ మాత్రం బోర్ అనిపించకుండా చాలా పట్టుగా నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ గా నిలుస్తుంది. సెకండాఫ్ పై అమాంతంగా అంచనాలు పెంచుతుంది. ఇక సెకండాఫ్ లో కథ నడిచే దూరం పెరుగుతుందిగానీ, కుతూహలం మాత్రం అలాగే ఉంటుంది.
దర్శకుడు ఏ పాత్రను ఎక్కడ ఎత్తుకోవాలో .. ఏ పాత్రకు ఎక్కడ ఎలాంటి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలో అక్కడ ఆ పనిని పూర్తి చేశాడు. అందువల్లనే ఈ కథ ఒక పర్ఫెక్ట్ కంటెంట్ గా మార్కులు కొట్టేస్తుంది. 'గురిపెడితే ఎర పడాల్సిందే' అనే ఊతపదంతో రజనీ చేసిన మేజిక్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఫహాద్ ఫాజిల్ .. రానా .. రితికా సింగ్ .. దుషారా విజయన్ .. మంజు వారియర్ .. ఇలా ప్రతి పాత్రకి ఒక ప్రయోజనం కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ - క్లైమాక్స్ సన్నివేశాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి.
రజనీ ఎన్ కౌంటర్లు చేసే సీన్స్, రజని - గుణ సీన్స్, రజనీ - రానా సీన్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఇక తనకి అప్పగించిన కేసుకు సంబంధించి రజనీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ముందుకు వెళ్లే తీరు ఆడియన్స్ ను అలా కూర్చోబెడుతుంది. మొదటి నుంచి చివరివరకూ పెర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఈ కథ ముందుకు వెళుతుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం సందర్భానికి తగినట్టుగా ఉంది. కథీర్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ వర్క్ చాలా నీట్ గా అనిపిస్తుంది.
లవ్ .. రొమాన్స్ .. కామెడీ వంటి అంశాలు ఈ కథలో కనిపించవు. అవి లేకపోయినా ఈ కథలో ఎలాంటి వెలితి అనిపించదు. రజనీ కాంత్ .. ఫహాద్ ఫాజిల్ .. దుషారా విజయన్ నటనకి ఎక్కువ మార్కులు పడతాయి. అమితాబ్ వలన ఆ పాత్రకి నిండుదనం వస్తే, నటరాజ్ పాత్రలో డీసెంటుగా కనిపిస్తూ రానా చూపించిన విలనిజం మెప్పిస్తుంది.
గ్రామాలలో పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలలో అందుబాటులో ఉన్న సాంకేతిక విద్య చాలా తక్కువ. అలాంటి పిల్లలకు కార్పొరేట్ విద్యాసంస్థలలో చదువుకునే పిల్లలతో సమానంగా పరీక్షలు పెట్టడం కరెక్టు కాదు. చాలామందికి అందుబాటులో లేని ఆన్ లైన్ విద్యావిధానం వలన, గ్రామీణ పిల్లలు మానసిక పరమైన ఒత్తిడికి లోనవుతున్నారు. చదువనేది పేద పిల్లల భవిష్యత్తు కావాలి .. డబ్బున్న వాళ్ల వ్యాపారం కాకూడదు అనే సందేశాన్ని కలిగిన కథ ఇది. మాస్ ఆడియన్స్ . యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగిన కంటెంట్ ఇది.
'వేట్టయన్' - మూవీ రివ్యూ!
| Reviews
Vettaiyan Review
- రజనీకాంత్ హీరోగా రూపొందిన 'వేట్టయన్'
- యాక్షన్ డ్రామా జోనర్లో నిర్మితమైన సినిమా
- మరోసారి రజనీ చేసిన మాయా జాలం
- ఆకట్టుకునే కథాకథనాలు
- ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలు
- రజనీకి హిట్ పడినట్టే
Movie Name: Vettaiyan
Release Date: 2024-10-10
Cast: Rajinikanth, Amitabh Bachchan , Fahadh Faasil, Rana Daggubati , Manju Warrier, Ritika Singh
Director: T J Gnanavel
Music: Anirudh Ravichander
Banner: Lyca Productions
Review By: Peddinti
Vettaiyan Rating: 3.25 out of 5
Trailer