'అలనాటి రామచంద్రుడు' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Alanati Ramachandrudu

Movie Name: Alanati Ramachandrudu

Release Date: 2024-09-27
Cast: Krishna Vamsi, Mokksha, Sudha, Venkatesh Kakamanu
Director:Chilukuri Akash Reddy
Producer: Hymavathi Jadapolu
Music: Sashank Tirupati
Banner: Hyniva Creations
Rating: 2.00 out of 5
  • ఆగస్టు 2న రిలీజైన సినిమా 
  • సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ 
  • ఫీల్ లోపించిన ప్రేమకథ 
  • పేలని కామెడీ
  • నిదానంగా సాగే కంటెంట్   

తెలుగు తెరపై ప్రేమకథాంశాల సందడి కాస్త ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. లవ్ స్టోరీస్ కి  యూత్ నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తూ ఉంటుంది. అలాంటి ఒక ప్రేమకథగా ఇటీవల ప్రేక్షకులను పలకరించిన సినిమాలలో 'అలనాటి రామచంద్రుడు' ఒకటిగా కనిపిస్తుంది. ఆగస్టు 2వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆకాశ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ అమలాపురంలోను .. హైదరాబాద్ లోను జరుగుతుంది. సిద్ధూ (కృష్ణవంశీ) చిన్నప్పటి నుంచి నలుగురిలో కలవలేడు. తన మనసులోని మాటను చెప్పలేడు. అతను కాలేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టినా ఆ స్వభావం మాత్రం అలాగే ఉంటుంది. అదే కాలేజ్ లో ధరణి (మోక్ష)   చేరుతుంది. ధరణి చిన్నప్పటి నుంచి అతనికి తెలుసు. అయినా అతని స్వభావం కారణంగానే ఆమెకి సన్నిహితంగా వెళ్లలేకపోతుంటాడు. 

కాలేజ్ లో అడుగుపెట్టిన తరువాత మోక్షను సిద్ధూ ప్రేమిస్తూ ఉంటాడు. ఆ ప్రేమ విషయాన్ని బయటికి చెప్పకుండా మౌనంగా ఆరాధిస్తూ ఉంటాడు. మోక్షకు అతని ప్రేమ సంగతి చెప్పమని స్నేహితులు ఒత్తిడి చేస్తున్నప్పటికీ అతను పట్టించుకోడు. చివరికి ఒకరోజున అతను తన మనసులోని మాటను ఆమెకి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలోనే ఆమె విక్రమ్ ను ప్రేమిస్తున్న విషయం సిద్ధూకి తెలుస్తుంది.

మోక్ష తండ్రి (బ్రహ్మాజీ) ఒక ఆర్మీ ఆఫీసర్. ఓ యుద్ధంలో అతను చనిపోతాడు. తండ్రితో కలిసి 'మనాలి' వెళ్లిన రోజు మోక్షకు ఒక తీపి జ్ఞాపకం. అందువలన ఆమె అక్కడికి విక్రమ్ ను తీసుకుని వెళ్లాలని అనుకుంటుంది. విక్రమ్ ప్రేమలో నిజాయితీ లేదనే విషయం ముందుగానే గ్రహించిన సిద్ధూ మౌనంగా ఉండిపోతాడు. ఈ లోగా విక్రమ్ నిజస్వరూపం గురించి మోక్షనే తెలుసుకుంటుంది. విక్రమ్ పట్ల విరిగిపోయిన మనసుతో 'మనాలి' బయల్దేరుతుంది. 

'మనాలి'లో జరిగిన ఒక ప్రమాదం వలన మోక్షం షార్ట్ టైమ్ మెమరీ లాస్ కు గురవుతుంది. అప్పుడు సిద్ధూ ఏం చేస్తాడు? గతంలో జరిగిన విషయాలు మరిచిపోయిన మోక్ష ఏం చేస్తుంది? ఆమెకి గతాన్ని గుర్తుచేయడానికి సిద్ధూ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా? మోక్ష ఎవరికి  దక్కుతుంది? అనేది కథ.

ప్రేమకథల్లో ఆత్మ ఉండాలి .. ఫీల్ పండాలి. ప్రేమికులు విరహాన్ని పొందుతారు .. వియోగాన్ని భరిస్తారు. గడిపిన క్షణాలను మధురమైన జ్ఞాపకాలుగా మార్చుకుంటారు. బాధ కలిగిన సందర్భాలు గాయాలుగా మారినప్పుడు, మధురమైన అనుభూతులను గుర్తుచేసుకుంటూ ఆ గాయాలను మాయం చేసుకుంటారు. తెరపై వారి ఉద్వేగాలను పంచుకుంటూనే ఆడియన్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఫీల్ లేని కథల నుంచి వెంటనే పక్కకి తప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఫీల్ ను కనెక్ట్ చేయలేకపోయిన ప్రేమకథ ఇది.

ప్రేమికుడు తన ప్రేమను వెంటనే లవర్ కి చెప్పేయాలి. అతను చేసే ఆలస్యం ప్రేక్షకులకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అసహనాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ కథ విషయంలో జరిగింది ఇదే. ప్రేమికుడు తన ప్రేమను గురించి ప్రియురాలికి చెప్పాలనుకునే సరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. హీరో మౌనం .. నిదానం .. నిరీక్షణ వలన అతనికే కాదు, ప్రేక్షకులకు కూడా ఏమీ ఒరగదు. అందువలన కథ ముందుకు జరగదు.

ఇక ప్రేమ సంగతి అలా ఉంచితే, కాలేజ్ స్టూడెంట్స్ చేసే అల్లరి మరో ఎత్తు. కాలేజ్ స్టూడెంట్స్ వరుసబెట్టి మాట్లాడుతుంటారు. ఎవరి పాత్ర నుంచి కామెడీని రాబట్టలేకపోయారు. ఆడియన్స్ రెస్పాన్స్ తో పని లేకుండా క్యాంపస్ సీన్లు పరిగెడుతూనే ఉంటాయి. తెరపై వాళ్లు అంతగా నవ్వుతున్నారు .. మనకెందుకు నవ్వు రావడం లేదబ్బా అనేడౌట్ గట్టిగానే వస్తుంది.  

హీరో .. హీరోయిన్ కి తన ప్రేమను గురించి చెప్పడు. హీరోయిన్ అతని గురించి పట్టించుకోదు. ఆ తరువాత అయినా ఇద్దరూ కలవకపోతారా .. వాళ్ల ప్రేమ ఒక గాడిలో పడకపోతుందా అనుకుంటే, ఆమె గతం మరిచిపోతుంది. అందువలన చివరివరకూ ఆమె ప్రేమ కోసం హీరో .. వాళ్ల మధ్య రొమాన్స్ కోసం ఆడియన్స్ అలా ఎదురుచూస్తూనే కూర్చోవలసి వస్తుంది. చివర్లో వాళ్లిద్దరూ కలుసుకుంటారా అంటే ఎందుకు కలుసుకోరు? శుభం కార్డుకు ముందు కలుసుకునే ప్రేమికుల వలన ఆడియన్స్ కి దక్కేదేముంటుంది? వాళ్లు వచ్చింది ఆశీర్వదించడానికి కాదే అనిపిస్తుంది. 

ఈ సినిమాలో ఎక్కువ మార్కులు ఇవ్వవలసింది ఏదైనా ఉంటే అది ప్రేమ్ సాగర్ కెమెరా పనితనానికే. మనాలి లోని లొకేషన్స్ ను చిత్రీకరించిన తీరు మనసులను పట్టుకుంటుంది. ఒక ప్రేమకథకు అవసరమైన అందమైన దృశ్యాలను అందించింది. ప్రేమకథల్లో పాటలు ప్రధానమైన  పాత్రను పోషిస్తాయి. అలాంటి లక్షణాలు ఉన్న పాటలు ఇక్కడ కనిపించవు. శ్రీకర్ ఎడిటింగ్ ఓకే. నిదానంగా సాగే కథాకథనాలు .. ఫీల్ లేని సన్నివేశాలు ..మనసును పట్టుకోని పాటలతో ఈ సినిమా అలా సాదాసీదాగా సాగిపోతూనే ఉంటుంది అంతే! 

Trailer

More Reviews