'35 - చిన్నకథ కాదు' (ఆహా) మూవీ రివ్యూ!

35 Chinna Katha Kadu

Movie Name: 35 Chinna Katha Kadu

Release Date: 2024-10-02
Cast: Niveda Thomas, Vishwadev, Priyadarshi, Arundev, Bhagyaraj, Gauthami
Director:Nanda kishore Emani
Producer: Srujan Yarabolu - Siddharth
Music: Vivek Sagar
Banner: Suresh Productions
Rating: 2.50 out of 5
  • సెప్టెంబర్ 6న వచ్చిన '35 - చిన్నకథ కాదు'
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ 
  • మంచి సందేశం ఉన్న కథ 
  • వినోదం పాళ్లు తగ్గిన సినిమా 

మధ్య తరగతి కుటుంబాలు .. పిల్లల చదువులు .. ఇంటి పరిస్థితులు .. స్కూల్ వాతావరణం .. ఇలా వాస్తవానికి దగ్గరగా ఉండే అంశాలతో ఆ మధ్య '90s' - మిడిల్ క్లాస్ బయోపిక్' సినిమా వచ్చింది. ఆ సినిమాకి ఓటీటీ వైపు నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అదే తరహాలో రూపొందిన మరో  సినిమానే '35 - చిన్నకథ కాదు'. నంద కిశోర్ ఈమని దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 6వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

ప్రసాద్ (విశ్వదేవ్) సరస్వతి (నివేదా థామస్) భార్యాభర్తలు. తిరుపతిలో నివసిస్తూ ఉంటారు. వారి సంతానమే అరుణ్ (అరుణ్ దేవ్) వరుణ్. ఇద్దరూ కూడా ఒక ప్రైవేట్ స్కూల్ లో చదువుతూ ఉంటారు. ప్రసాద్ బస్సు కండక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. సరస్వతి పదో తరగతి తరువాత చదువుకోలేక పోతుంది. ఇంటిపట్టునే ఉంటూ, భర్త తెచ్చిన జీతం డబ్బుతో పొదుపుగా కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. 

అరుణ్ కి మ్యాథ్స్ లో 'సున్నా'కి సంబంధించిన అనేక సందేహాలు ఉంటాయి. అతని సందేహాలను  టీచర్స్ కూడా తీర్చే ప్రయత్నం చేయకపోవడంతో, అతను మ్యాథ్స్ లో వెనకబడిపోతూ వస్తాడు. దాంతో మ్యాథ్స్ లో అతనికి 'సున్నా'నే వస్తూ ఉంటుంది. ఈ విషయంలో లెక్కల మాస్టారు చాణక్య (ప్రియదర్శన్)తో పాటు మిగతా పిల్లలు అతణ్ణి హేళన  చేస్తూ ఉంటారు. అరుణ్ కారణంగా మిగతా పిల్లలు చెడిపోతారనే చాణక్య మాట, ఆ పిల్లాడి మనసును గాయపరుస్తుంది.         

అదే క్లాస్ లో పవన్ అనే కుర్రాడు మ్యాథ్స్ లో ఫస్టు మార్కు తెచ్చుకుంటూ ఉంటాడు. చాణక్య సార్ అతణ్ణి మెచ్చుకుంటూ, అరుణ్ ను అవమానపరుస్తూ వస్తుంటాడు. దాంతో అతని పట్ల అరుణ్ కోపం పెంచుకుంటాడు. అతను చేసిన ఒక పని కారణంగా చాణక్య సార్ పడిపోతాడు. అందుకు కారణమైన అరుణ్ ను స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తారు. అతని ధోరణి పట్ల తల్లిదండ్రులు అసహనాన్ని వ్యక్తం చేస్తారు. అతను చేసింది తప్పని చెబుతారు. 

అరుణ్ కి మ్యాథ్స్ వంటబట్టని కారణంగా, వేదపాఠశాలలో వేయాలని తండ్రి నిర్ణయించుకుంటాడు. మరొక అవకాశం ఇచ్చి చూద్దామని తల్లి బ్రతిమాలుతుంది. అరుణ్ తిరిగి స్కూల్ కి రావాలని ఫ్రెండ్స్ అంతా భావిస్తారు. స్కూల్ కి రాగానే చాలదనీ, మ్యాథ్స్ లో 35 మార్కులైనా సంపాదించుకోవడానికి ప్రయత్నించమని చాణక్య సార్ అంటాడు. అప్పుడు అరుణ్ ఏం చేస్తాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ. 

'35' మార్కులకు సంబంధించిన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది గనుక ఈ టైటిల్ ను సెట్ చేయడం బాగుంది. మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటారు. పిల్లలు చదువులో కాస్త వెనకబడిపోయినట్టుగా అనిపిస్తే టెన్షన్ పడిపోతూ ఉంటారు. అలాంటిది ప్రతిసారి మ్యాథ్స్ లో 'జీరో' తెచ్చుకునే ఓ పిల్లాడి విషయంలో ఆ పేరెంట్స్ ఎంతలా ఆందోళన చెందారు? ఆ గండం నుంచి ఎలా గట్టెక్కారు? అనేదే కథ. 

స్కూల్ .. ఇల్లు .. ఫ్రెండ్స్ .. పేరెంట్స్ .. టీచర్స్ పిల్లల చదువును ప్రభావితం చేస్తుంటారు. వీరిలో ఎవరో ఒకరి కారణంగా పిల్లాడి చదువు దారితప్పుతున్నప్పుడు ముందుగా ఆ విషయాన్ని గ్రహించేది తల్లి. అలా ఆ తల్లి తన బిడ్డ చదువును ఎలా దార్లో పెట్టింది? అందుకు కోసం గతంలో ఆగిపోయిన తన చదువును ఎలా కొనసాగించింది? అనే అంశాలను దర్శకుడు టచ్ చేసిన తీరు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంది.

అయితే దర్శకుడు మొదటి నుంచి చివరివరకూ ఈ కథను చాలా సీరియస్ గా నడిపించాడు. కథ చిక్కబడటానికి చాలా సమయం పడుతుంది. ఇక ఉన్న కథంతా ఒకే ఫ్యామిలీ చుట్టూ తిప్పడం కూడా కాస్త అసహనాన్ని కలిగిస్తుంది. '90s' సినిమా మాదిరిగా ఈ సినిమాలో ఎక్కడా కామెడీ టచ్ కనిపించదు. వినోదపరమైన అంశాలు లేకపోవడం వలన, చాలా వరకూ కథ సాదాసీదాగానే సాగిపోతూ ఉంటుంది. 

చివరి 30 నిమిషాల కంటెంట్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. మిగతా కథ అంతా ఒక ఎత్తు .. చివరి 30 నిమిషాలు ఒక ఎత్తు అని చెప్పచ్చు. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. నివేదా థామస్ తన పాత్రను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లింది. మాస్టర్ అరుణ్ దేవ్ నటన కూడా ఆకట్టుకుంటుంది. భాగ్యరాజ్ .. గౌతమి పాత్రలకు మరికొంత ప్రాధాన్యత అవసరం అనిపిస్తుంది. 

వివేక్ సాగర్ నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. నికేత్ బొమ్మిరెడ్డి కెమెరా పనితనం .. ప్రసన్న ఎడిటింగ్ ఓకే. ప్రశాంత్ విఘ్నేశ్ - నందకిశోర్ సంభాషణలు బాగున్నాయి. "పెరగలేకపోతున్నప్పుడు కొంచెం తగ్గించాలి .. అది కొమ్మయినా .. కొడుకైనా " .. " తప్పును సరిదిద్దాలి .. సరిపెట్టకూడదు" .. ''మనిషి మాటకి విలువ, వినడం వలన రాదు, పాటించడం వలన వస్తుంది" అనే డైలాగ్స్ పట్టుకుంటాయి. ఈ కథలో మంచి సందేశం ఉంది .. ఆ సందేశానికి వినోదం కూడా తోడై ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది.  

Trailer

More Reviews