మలయాళంలో ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఒక సినిమా, యాక్షన్ డ్రామా నేపథ్యంలో మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా పేరే 'అంచక్కల్లకోక్కన్'. ఉల్లాస్ చెంబన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, లుక్మన్ అవరన్ .. చెంబన్ వినోద్ దాస్ .. మణికందన్ ఆచారి .. ప్రధానమైన పాత్రలను పోషించారు. మార్చిలో విడుదలైన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'ఆహా'లోస్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది చూద్దాం.
అది 'కాళహస్తి' అనే గ్రామం .. అక్కడి ఎస్టేట్ కి 'చాప్రా'నే యజమాని. ఆ గ్రామానికి కూడా ఆయనే పెద్ద. ఓ రోజు రాత్రివేళ ఆయన తన సన్నిహితులతో తోట బంగ్లాలో సమావేశమవుతాడు. ఆ సమయంలోనే ఆయనపై దాడి జరుగుతుంది. ఏం జరుగుతుందో అనేది సన్నిహితులు తెలుసుకునేలోగా 'చాప్రా'ను చంపేస్తారు. ఊళ్లో వాళ్లంతా ఆ విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉండగా, కొత్తగా అక్కడి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా జాయినింగ్ లెటర్ ఇవ్వడానికి వాసుదేవన్ (లుక్మన్ అవరన్) వస్తాడు.
ఆ పోలీస్ స్టేషన్ కి ఎస్.ఐ.గా సుదర్శనన్ (మురుగన్) ఉంటాడు. హెడ్ కానిస్టేబుల్ గా నాద వరంబన్ (చెంబన్ వినోద్ దాస్) చాలా కాలంగా అక్కడే పనిచేస్తూ ఉంటాడు. కొత్తగా డ్యూటీలో చేరిన వాసుదేవన్ ను వెంటబెట్టుకుని, నాద వరంబన్ కేసు విచారణ కొనసాగిస్తూ ఉంటాడు. చాప్రా కొడుకులు ఇద్దరూ సొంత ఊరికి చేరుకుంటారు. తమ తండ్రి మరణానికి కారకులైనవారిని కనిపెట్టి చంపడం కోసం తిరుగుతుంటారు. చనిపోయిన రోజు రాత్రి చాప్రాతో ఉన్న పద్మిని .. పున్నారి .. మాలగా, ఈ కేసు తమకి చుట్టుకుంటుందేమోనని భయపడుతూ ఉంటారు.
చాప్రాను హత్య చేసినదెవరో తెలుసుకోవడానికి ఒక వైపున పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటే, మరో వైపున చాప్రా కొడుకులు హంతకులను అంతం చేయాలనే కసితో వెదుకుతూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలోనే తానే చాప్రాను హత్య చేశానంటూ శంకర్ ( మణికందన్ ఆచారి) పోలీసులకు లొంగిపోతాడు. పోలీసులు అతనిని సెల్లో వేస్తారు. ఈ విషయం తెలిసి చాప్రా కొడుకులు శంకర్ ను చంపడానికి పోలీస్ స్టేషన్ కి బయల్దేరతారు.
శంకర్ కు కాపలాగా వాసుదేవన్ ను ఉంచి, మిగతా వాళ్లంతా వేరే పనిపై బయటికి వెళతారు. చాప్రాను ఎందుకు చంపావని శంకర్ ను వాసుదేవన్ అడుగుతాడు. తాను చాప్రాను హత్య చేయలేదనీ, తాను ఆ నేరాన్ని తనపై వేసుకోవడానికి వేరే కారణం ఉందని శంకర్ చెబుతాడు. ఆ కారణం ఏమిటి? అతని గతం ఎలాంటిది? అది తెలుసుకున్న వాసుదేవన్ ఏం చేస్తాడు? చాప్రా హత్యకి కారకులు ఎవరు? అనేది మిగతా కథ.
ఈ కథ చాలా సింపుల్ లైన్ తో నడుస్తుంది. అడపాదడపా కొన్ని పాత్రలు వచ్చి వెళుతూ ఉంటాయి. ప్రధానమైన కథ మాత్రం మూడు పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఫస్టాఫ్ లోని కథ అంతా హత్యకేసు చుట్టూ తిరుగుతుంది. ఆ హత్యను తానే చేశానంటూ ఎవరైతే లొంగిపోతారో, అతని ఫ్లాష్ బ్యాక్ సెకండాఫ్ గా ఉంటుంది. జరిగిన హత్యతో సంబంధం లేని ఆ ఫ్లాష్ బ్యాక్, ఆడియన్స్ కి కొత్తగా అనిపిస్తుంది.
కథ .. అది పరిగెత్తే పరిధి చిన్నదే. పాత్రల సంఖ్య కూడా చాలా తక్కువ. అయినా అక్కడికక్కడే అనేక మలుపులు తిరుగుతూ కథ ఆకట్టుకుంటుంది. భయాన్ని జయించాలంటే మనం దానిని భయపెట్టవలసిందే. అమాయకుల ప్రాణాలు కాపాడటం కోసం అమాయకత్వాన్ని పక్కన పెట్టవలసిందే అనే ఒక సందేశం ఈ కథలో మనకు అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. పాత్రలను డిజైన్ చేసిన విధానం కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది.
ముఖ్యంగా చాప్రా ఇద్దరు కొడుకుల పాత్రలను డిజైన్ చేసిన తీరు డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రెండు పాత్రలో ఒక పాత్ర చాలా తక్కువగా మాట్లాడుతుంది . మరో పాత్ర అసలు మాట్లాడదు. కానీ ఇద్దరూ కలిసి చేసే హింస ఒక రేంజ్ లో ఉంటుంది. సైకోల మాదిరిగా ప్రవర్తించే ఈ పాత్రలు కాస్త టెన్షన్ పెడతాయి. ఇద్దరూ కలిసి హోటల్లో వేరేవారితో కలబడే సీన్ మాత్రం, అవసరాన్ని దాటి వెళ్లినట్టుగా అనిపిస్తుంది.
దర్శకుడు ఈ కథని ఎంచుకోవడం ఒక విశేషమైతే, అందుకు తగిన లొకేషన్స్ లో ఆ కథను ఆసక్తికరంగా నడిపించడం మరో విశేషం. ఆర్మో ఫొటోగ్రఫీ ఆ లొకేషన్స్ ను మరింత అందంగా తెరపైకి తీసుకువచ్చింది. ఆయన కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ అని చెప్పాలి. మణికందన్ అయ్యప్ప నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది. రోహిత్ ఎడిటింగ్ ఫరవాలేదు.
కథ .. స్క్రీన్ ప్లే .. టేకింగ్ .. పాత్రలను మలచిన విధానం .. లొకేషన్స్ .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఈ సినిమాకి బలాన్ని చేకూర్చాయి. "దుష్టుడైన బలవంతుడిని నువ్వు ఎదిరించలేకపోయినప్పుడు, ఎదిరించాలనుకున్నవారికి సాయం చేయి" అనే ఒక లైన్ ను ఈ కథ టచ్ చేస్తుంది. వినోదపరమైన అంశాలేవీ కనిపించకుండా సీరియస్ గా సాగే కంటెంట్ ఇది. అందుకు సిద్ధమై చూసినవారికి నచ్చుతుంది.
'చాప్రా మర్డర్ కేస్' (ఆహా) మూవీ రివ్యూ!
| Reviews
Chapra Murder Case Review
- మలయాళంలో రూపొందిన 'అంచక్కల్లకోక్కన్'
- తెలుగు టైటిల్ గా 'చాప్రా మర్డర్ కేస్'
- ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్
- ఇంట్రెస్టింగ్ గా సాగే కథ - స్క్రీన్ ప్లే
- లొకేషన్స్ - ఫొటోగ్రఫీ హైలైట్
Movie Name: Chapra Murder Case
Release Date: 2024-09-26
Cast: Lukman Avaran,Chemban Vinod Jose, Manikandan Achari, Megha Thomas
Director: Ullas Chemban
Music: Manikandan Ayyappa
Banner: Chembosky Motion Piceures
Review By: Peddinti
Chapra Murder Case Rating: 3.00 out of 5
Trailer