'ముంజ్యా' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!

Munjya

Munjya Review

  • హిందీలో హిట్ కొట్టిన 'ముంజ్యా'
  • ఆగస్టు 24 నుంచి హిందీలో స్ట్రీమింగ్ 
  • రీసెంటుగా తెలుగులో అందుబాటులోకి 
  • ప్రధానమైన బలంగా కథాకథనాలు 
  • ప్రత్యేక ఆకర్షణగా ఫొటోగ్రఫీ,బీజీఎమ్, వీఎఫెక్స్

సీరియస్ గా భయపెడుతూ సాగే పూర్తి హారర్ సినిమాలు కొన్ని, కాస్త కామెడీ టచ్ తో భయపెడుతూనే నవ్వించే థ్రిల్లర్లు మరికొన్ని. రెండో కేటగిరీలోకి వచ్చే సినిమాగా 'ముంజ్యా' కనిపిస్తుంది. హిందీలో నిర్మితమైన సినిమా ఇది .. స్టార్స్ లేని కథ ఇది. అయినా ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అలాంటి ఈ సినిమా, రీసెంటుగా ఓటీటీలో తెలుగులో అందుబాటులోకి వచ్చింది. 'హాట్ స్టార్'లో అడుగుపెట్టిన ఈ సినిమా కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.

అది 1952వ సంవత్సరం .. 'కొంకణ్'లోని సముద్రతీర ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం. అక్కడి ఆచారాలు .. కట్టుబాట్లు వేరు. అక్కడ 'గోట్యా' అనే ఓ పన్నెండేళ్ల కుర్రాడు, మున్నీ అనే యువతిని ప్రేమిస్తాడు. ఆమె అతనికంటే ఏడేళ్లు పెద్ద. ఈ వయసులోనే ప్రేమ ఏమిటంటూ అతని తల్లి చితక్కొడుతుంది. చిన్నప్పటి నుంచి మానసికంగా కాస్త తేడా ఉన్న ఆ కుర్రాడు, తన పెళ్లి మున్నీతో జరగాలంటే మనిషిని 'బలి' ఇవ్వాలని భావిస్తాడు. 

ఓ రాత్రివేళ .. సముద్రతీరంలో ఉన్న ఒక అడవిలోకి చెల్లెలిని తీసుకుని వెళతాడు. అక్కడ మరిచెట్టు మొదట్లో ఒక క్షుద్రదేవత మూర్తి ఉంటుంది. అక్కడ తన చెల్లెలినే బలి ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఆ ప్రయత్నంలో అతనే చనిపోతాడు. ఆ గ్రామంలో ఉన్న మాంత్రికులు, ఆ చెట్టులోనే అతని ప్రేతాత్మను బంధిస్తారు. ఆ ప్రేతాత్మకు విడుదల లభిస్తే ఊరంతా ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తారు.     
    
కాలచక్రంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. అది 'పూణె'లో మధ్యతరగతి కుటుంబీకులు నివసించే ప్రాంతం. అక్కడ 'బిట్టూ' తన తల్లి .. బామ్మతో కలిసి నివసిస్తూ ఉంటాడు. తన తండ్రి గురించిన టాపిక్ వచ్చినప్పుడల్లా తన తల్లి .. బామ్మా ఎందుకు దాటవేస్తున్నారనే విషయం అతనికి అర్థం కాదు. ఓ అడవిలో .. ఒక చెట్టుపై భయంకరమైన ఆకారం తనని పిలుస్తున్నట్టుగా అనిపించి తరచూ అతను కంగారు పడుతుంటాడు. ఓ రోజున అతను తన బాబాయ్ కూతురు నిశ్చితార్థానికి తన కుటుంబంతో కలిసి సొంతఊరు వెళతాడు. 

తనకి తరచు కళ్లలో కదలాడే ప్రదేశాన్నీ .. పెద్ద మర్రిచెట్టును అతను ఆ ఊళ్లో చూసి షాక్ అవుతాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్లినప్పుడే తన తండ్రి చనిపోయాడని తెలిసి బాధపడతాడు. ఆ బాధలోనే అతను ఆ చెట్టు దగ్గరికి పరిగెడతాడు. అతని వెనకే బామ్మ కూడా బయల్దేరుతుంది. గతంలో ఆ చెట్టులో బంధించబడిన 'గోట్యా' ప్రేతాత్మ బయటికి రావడానికి బిట్టూ కారకుడవుతాడు. ఆ ప్రేతాత్మ బారి నుంచి బిట్టూను కాపాడటానికి వచ్చిన బామ్మను ఆ ప్రేతాత్మ చంపేస్తుంది.

తనకి మున్నీని ఇచ్చి పెళ్లి చేయమనీ, ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోవలసిన బాధ్యత కూడా బిట్టూదేనని ఆ ప్రేతాత్మ చెబుతుంది. అప్పటి నుంచి ఆ ప్రేతాత్మ బిట్టూను అనుసరిస్తూనే ఉంటుంది. బిట్టూ తన స్నేహితుడితో కలిసి మున్నీ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాన్ని ప్రారంభిస్తాడు. ఆ సందర్భంలోనే బిట్టూ మనసు పడిన 'బేలా'ను ఆ ప్రేతాత్మ చూస్తుంది. మున్నీ విషయం పక్కనపెట్టి, 'బేలా'తో తన పెళ్లి జరిపించమని ఆ ప్రేతాత్మ పట్టుపడుతుంది. అప్పుడు బిట్టూ ఏం చేస్తాడు? అతను తీసుకునే నిర్ణయం ఎలాంటిది? ఆ నిర్ణయం వలన అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వాటి నుంచి అతను ఎలా బయటపడగలుగుతాడు? అనేది కథ.

సాధారణంగా ప్రేతాత్మలు .. ఆవహించడాలు .. అల్లకల్లోల చేయడాలు వంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. అలా కాకుండా పాతకాలంలో మనం విన్న జానపద కథలను పోలిన కథ ఇది. తనకి పెళ్లి చేయమంటూ ఒక పిల్ల దెయ్యం చేసే అల్లరియే ఈ కథలో ప్రధానం. ఆ దెయ్యాన్ని వదిలించుకోవడం కోసం కథానాయకుడు పడే కష్టాలే వినోదాన్ని పంచుతూ ఉంటాయి. పరిమితమైన పాత్రల మధ్యలో నడిచే కథ కావడం వలన కన్ఫ్యూజన్ ఉండదు.

కథాకథనాలతో పాటు దెయ్యం వైపు నుంచి చేయించిన వీఎఫ్ఎక్స్, కథకి మరింత బలాన్ని తీసుకొచ్చాయి. యోగేశ్ చందేకర్ తయారు చేసిన కథ, ఆయన నిరేన్ భట్ తో కలిసి చేసిన స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఆదిత్య సర్పోత్దర్ టేకింగ్ ఆకట్టుకుంటుంది. ఆయన డిజైన్ చేసుకున్న సన్నివేశాలను చూస్తుంటే, కథల పుస్తకం తిరగేస్తున్నట్టుగా అనిపిస్తుంది. జస్టిన్ వర్గీస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా హెల్ప్ అయింది. సౌరభ్ గోస్వామి ఫొటోగ్రఫీ హైలైట్ అని చెప్పచ్చు. మోనిషా ఎడిటింగ్ ఓకే.

కథ .. స్క్రీన్ ప్లే .. పాత్రలను మలచిన విధానం .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. వీఎఫ్ ఎక్స్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. నైట్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన సన్నివేశాలు .. వీఎఫ్ ఎక్స్ కి సంబంధించిన సన్నివేశాలను ఆవిష్కరించిన తీరు గొప్పగా అనిపిస్తుంది. పిల్ల దెయ్యం పాత్రను డిజైన్ చేసిన తీరు .. దానిని నడిపించిన తీరు .. కామెడీ టచ్ వలన ఇది ఫ్యామిలీ అందరూ చూడగలిగే కంటెంట్ గా మారింది. 

Movie Name: Munjya

Release Date: 2024-09-21
Cast: Abhay Varma, Sharvani, Sathya Raj, Mona Singh
Director: Adithya Sarpotdar
Music: Justin Varghese
Banner: Maddock Films

Munjya Rating: 3.00 out of 5

Trailer

More Reviews