'గ్యారా గ్యారా' (11:11) 'జీ 5' వెబ్ సిరీస్ రివ్యూ!

Gyaarah Gyaarah

Gyaarah Gyaarah Review

  • ఆగస్టు 9న హిందీలో వచ్చిన 'గ్యారా గ్యారా'
  • 8 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్ 
  • ఈ నెల 20 నుంచి తెలుగులో అందుబాటులోకి 
  • టైమ్ ట్రావెల్ టచ్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్
  • అక్కడక్కడా నిదానించిన కథనం
  • మొత్తంగా ఆకట్టుకునే సిరీస్   

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ప్రతివారం క్రైమ్ థ్రిల్లర్ జోనర్ నుంచి వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. అలా వచ్చిన వెబ్ సిరీస్ లలో 'గ్యారా గ్యారా' ప్రత్యేకతను సంతరించుకుంది. రాఘవ్ జుయల్ .. ధైర్య కార్వా .. కృతికా కామ్రా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, జీ 5 వేదికపైకి ఆగస్టు 9వ తేదీనే వచ్చింది. అప్పటి నుంచి హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, ఈ నెల 20వ తేదీ నుంచి తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. 

ఈ కథ 1990 .. 2000 .. 2016 మధ్య నడుస్తుంది. ముందుగా 2016లో ఈ కథ మొదలవుతుంది.  'డెహ్రాడూన్' ప్రాంతంలోని ఒక పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా యుగ్ ఆర్య పోస్టింగ్ తీసుకుంటాడు. అక్కడ డీఎస్పీగా వామికా రావత్ ఉంటుంది. ఆ సమయంలోనే ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకురావడానికి సన్నాహాలు చేస్తూ ఉంటుంది. 15 సంవత్సరాలుగా పరిష్కారం లేకుండా పడున్న క్రిమినల్ కేసులను ఇక పక్కన పెట్టేయమనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుంటాయి.

తన ఎనిమిదేళ్ల కూతురు 'అదితి' చనిపోయి 15 ఏళ్లు పూర్తవడంతో, ఇక ఆ కేసు తేలకుండానే పోతున్నందుకు ఆ పాప తల్లి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటుంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చేలోగా హంతకులు ఎవరనేది తెలిస్తే బాగుంటుందని ఆమె భావిస్తూ ఉంటుంది. ఆమె ఆవేదన యుగ్ ఆర్యను ఆలోచింపజేస్తుంది. అదితిని ఎవరు హత్య చేశారనేది ఎలా తెలుసుకోవడమని అతను ఆలోచన చేస్తూ ఉండగా, రాత్రి 11:11 గంటలకు స్టేషన్ లోని స్టోర్ రూమ్ లోని ఒక పాత 'వాకీ టాకీ' మోగుతుంది. 

 ఆ వాకీ టాకీ లో యుగ్ తో పోలీస్ ఆఫీసర్ శౌర్య అద్వాల్ (ధైర్య కార్వా) మాట్లాడతాడు. గతంలో అదితి కేసును ఇన్వెస్టిగేషన్ చేసింది ఆయనే. అదితి కేసుకు సంబంధించి అతనిచ్చిన సూచనల మేరకు యుగ్ ముందడుగు వేస్తాడు. 15 ఏళ్ల క్రితానికి సంబంధించిన వివరాలు ఆయనకి ఎలా తెలిశాయా అని సీనియర్ ఆఫీసర్లు ఆశ్చర్యపోతుంటారు. ఇక అదే సమయంలో యుగ్ ఆశ్చర్యపోయే సంఘటన కూడా జరుగుతుంది. 

అదితి కేసుకు సంబంధించిన వివరాలను తనకి చెప్పిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఆయన ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నాడు? అనే విషయాన్ని యుగ్ తెలుసుకోవాలని అనుకుంటాడు. ఆ ప్రయత్నం వల్లనే అతను శౌర్య గురించి తెలుసుకుంటాడు. 2001లో పోలీస్ ఆఫీసర్ గా శౌర్య పనిచేసినట్టు తెలుసుకుంటాడు. శౌర్య నుంచి కాల్ వచ్చిన 'వాకీ టాకీ' గతంలో అతను ఉపయోగించిందని తెలుసుకుని షాక్ అవుతాడు. 

15 ఏళ్ల క్రితం నాటి వాకీ టాకీ అది. కొంతకాలంగా అది పనిచేయడమే లేదు. అసలు దాంట్లో బ్యాటరీనే లేదు. అలాంటి వాకీ టాకీ ఎలా పనిచేస్తుంది? 2001 నుంచి 2016కి కాల్ ఎలా వచ్చింది? అనే ఆలోచన అతనిని సతమతం చేస్తూ ఉంటుంది. ఆ తరువాత కూడా రాత్రి 11:11 గంటలకు  శౌర్య నుంచి యుగ్ వాకీ టాకీ కి కాల్ వస్తుంటుంది. ఇప్పటివరకూ పెండింగ్ లో ఉన్న అప్పటి కేసులను గురించి యుగ్ తెలుసుకుని, అప్పట్లో శౌర్య వదిలేసిన కేసులను పరిష్కరించే దిశగా ఇప్పుడు యుగ్ ముందుకు వెళుతుంటాడు. 

అసలు శౌర్య ఎవరు? తాను పోలీస్ ఆఫీసర్ గా ఉన్న 2001లో ఏం జరుగుతుంది? 1990లతో ముడిపడిన అతని గతం ఏమిటి? అప్పటి కేసులకి సంబంధించి అసలైన దోషుల గురించి శౌర్య ఎలా యుగ్ కి చెప్పగలుగుతున్నాడు? శౌర్య సహాయంతో యుగ్ ఆ కేసులను ఎలా పరిష్కరిస్తాడు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.

ఈ కథ 1990 .. 2000 .. 2016 .. ఇలా మూడు కాలాలను టచ్ చేస్తూ సాగుతూ ఉంటుంది. అందువలన దర్శకుడు ఏ కాలంలో ఏం జరుగుతుందనే క్లారిటీ ఎప్పటికప్పుడు ఇస్తూ రావడం వలన, చాలా వరకూ కన్ఫ్యూజన్ ఉండదు. కానీ కొంతమంది అయోమయానికి లోనయ్యే అవకాశమైతే ఉంది. రెండు కాలాలకు చెందిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వాకీ టాకీలో మాట్లాడుకోవడం .. ఒకే వాకీ టాకీ అందుకు వారధిగా ఉండటం ఇక్కడ ఆసక్తిని రేకెత్తించే అంశం. 

ఈ రకంగా క్రైమ్ థిల్లర్ జోనర్ కి .. టైమ్ ట్రావెల్ టచ్ ఇవ్వడం కొత్తగా అనిపిస్తుంది. ఈ తరహా కథలకు స్క్రీన్ ప్లే వేయడం చాలా కష్టం. ఈ విషయంలో దర్శకుడిని అభినందించవచ్చు. కొన్ని సన్నివేశాలను కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే అవి ఇతర సన్నివేశాలతో ముడిపడి ఉన్నవే కావడం వలన కాస్త ఓపిక చేసుకుని చూడవలసిందే. కొన్ని విషయాల్లో క్లారిటీ .. లాజిక్ గురించిన ఆలోచన చేయనీయకుండా మిగతా కథ మనలను ముందుకు తీసుకుని వెళుతుంది. 

ధర్మా ప్రొడక్షన్స్ - శిఖ్యా ఎంటర్టైన్మెంట్ వారు కలిసి నిర్మించిన సిరీస్ ఇది. నిర్మాణ విలువల విషయంలో వంకబెట్టవలసిన పనిలేదు. నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ బాగున్నాయి. అనవసరమైన సన్నివేశాలు లేవుగానీ .. చెప్పదలచుకున్న విషయాన్ని కాస్త నిదానంగా చెప్పారు. ఆర్టిస్టులంతా చాలా సహజంగా చేశారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ కంటెంట్లను ఇష్టపడేవారికి ఈ సిరీస్ నచ్చుతుంది.    

Movie Name: Gyaarah Gyaarah

Release Date: 2024-09-20
Cast: Kritika Kamra, Raghav Juyal, Dhairya Karwa,Krithka Kamra, Gautami Kapoor,
Director: Umesh Bist
Music: -
Banner: companies Sikhya Entertainment - Dharma Productions

Gyaarah Gyaarah Rating: 3.00 out of 5

Trailer

More Reviews