యథార్థ సంఘటనల ఆధారంగా 'సెక్టార్ 36' సినిమా రూపొందింది. విక్రాంత్ మెస్సే ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను 'నెట్ ఫ్లిక్స్' ద్వారా నేరుగా రిలీజ్ చేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
ప్రేమ్ సింగ్ ( విక్రాంత్ మెస్సే) 'సెక్టార్ 36' ప్రాంతంలో నివసించే బల్బీర్ సింగ్ బస్సీ (ఆకాశ్ ఖురాన) అనే శ్రీమంతుడి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. బస్సీ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉండటంతో, అతని నీడలో ప్రేమ్ సింగ్ కి ఎలాంటి కష్టం లేకుండా నడిచిపోతూ ఉంటుంది. అక్కడికి సమీపంలోనే మురికివాడ ఉంటుంది. ఆ వాడకి చెందిన పిల్లలను ప్రేమ్ కిడ్నాప్ చేసి చంపేస్తూ ఉంటాడు. వాళ్ల శవాలను ముక్కలుగా కోసేసి మురికి కాలవలో కలిపేస్తూ ఉంటాడు.
ఈ మధ్యలో ఆర్గాన్స్ అక్రమ రవాణా కూడా జరుగుతూ ఉంటుంది. దాంతో ఆ వైపు నుంచి ప్రేమ్ కి డబ్బు ముడుతూ ఉంటుంది. పిల్లల మిస్సింగ్ కేసులు 'షహాదరా' పోలీస్ స్టేషన్ లో నమోదవుతూ ఉంటాయి. కానీ సబ్ ఇన్ స్పెక్టర్ కాళీచరణ్ పాండే పెద్దగా పట్టించుకోడు. ఒక రోజున అతని కూతురునే కిడ్నాప్ చేయడానికి ప్రేమ్ ప్లాన్ చేస్తాడు. కానీ చివరి నిమిషంలో విఫలమవుతుంది. ఆ సంఘటనతో పిల్లలు కనిపించకుండా పోతే కన్నవాళ్లు ఎంతగా బాధపడతారనేది అతనికి అర్థమవుతుంది.
అప్పటి నుంచి పాండే సీరియస్ గా తీసుకుంటాడు. కేవలం మురికివాడలోని పిల్లలే అదృశ్యమవుతూ ఉండటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే చుంకీ ఘోష్ అనే యువతి కూడా అదృశ్యమవుతుంది. చివరిగా ఆమె బస్సీ ఇంటికీ వెళ్లిందనీ, ఆ తరువాత నుంచి కనిపించలేదని అతని పరిశోధనలో తేలుతుంది. మొదటిసారిగా అతనికి ప్రేమ్ పై అనుమానం కలుగుతుంది. ఈ విషయాన్ని ఆయన తన పైఅధికారి 'జవహర్' దగ్గర ప్రస్తావిస్తాడు.
పాండేను 'జవహర్' మందలిస్తాడు. బాగా డబ్బున్నవాళ్ల పిల్లలు ఇద్దరు కనిపించడం లేదనీ, ఆ కేసుపై దృష్టిపెట్టమని అంటాడు. బస్సీ ని అనుమానించడం మానుకోమనీ, లేదంటే సస్పెన్షన్ తప్పదని హెచ్చరిస్తాడు. మరో సీనియర్ అధికారి సైకియా దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళతాడు పాండే. అతని సమక్షంలోనే ప్రేమ్ ను స్టేషన్ కి రప్పించి విచారణ జరుపుతాడు. 22 నుంచి 24 మంది వరకూ తానే చంపినట్టుగా అతను ధైర్యంగా ఒప్పుకుంటాడు. తనకేమీ భయం లేదనీ, బస్సీ విడిపిస్తాడని అంటాడు.
అయితే పాండే పడిన కష్టం తాలూకు క్రెడిట్ సైకియా ఖాతాలోకి వెళుతుంది. సైకియాకి ప్రమోషన్ దక్కితే, పాండే డిస్మిస్ అవుతాడు. అయినా ఆ కేసును పూర్తి స్థాయిలో ఛేదించాలానే ఉద్దేశంతో పాండే ముందడుగు వేస్తాడు. ఫలితంగా ఆయనకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? చిన్నపిల్లలనే ప్రేమ్ ఎందుకు టార్గెట్ చేస్తాడు? ఆ మధ్యలో అతను ఒక వేశ్యను ఎందుకు హత్య చేస్తాడు? అనేది మిగతా కథ.
2006లో నోయిడాలో జరిగిన 'నిఠారీ' వరుస హత్యల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. మొదటి నుంచి చివరివరకూ ఈ క్రైమ్ థ్రిల్లర్ ఉత్కంఠను పెంచుతుంది. మురికివాడలలోని పిల్లలు కనిపించకపోతే వాళ్లను గురించి ఎవరూ అడిగరని భావించే పోలీసులు, ఆ పిల్లల హత్య విషయాలను పోలీసులు పెద్దగా పట్టించుకోరని భావించే హంతకులు .. ఈ ఇద్దరి మధ్య నిజాయితీ పరులైన పోలీస్ అధికారులు ఎంతగా స్ట్రగుల్ అవుతారనేది దర్శకుడు చూపించిన తీరు బాగుంది.
బలమైనవారి అండదండలతో నేరస్థులు చెలరేగిపోతుంటే, అవినీతి అధికారులను దాటుకుని ఆ కేసులను ముందుకు తీసుకుని వెళ్లలేక సస్పెన్షన్ .. డిస్మిస్ లెటర్స్ తీసుకుని వెనుదిరిగే నిజాయితీపరులు మరికొందరు. ఈ విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన విధానం బాగుంది. అయితే అత్యంత దారుణంగా హత్యలు చేయడం చూపించారు. ఆ హింస .. ఆ రక్తపాతం చూసి తట్టుకోవడం చాలా కష్టం. ఈ లోకం తీరు ఇలాగే ఉంటుందని నిరూపించే ట్విస్ట్ ఆడియన్స్ ను ఆలోచింపజేస్తుంది.
ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. రాజేశ్ వెంకటేశ్ స్క్రీన్ ప్లే .. ఆదిత్య నింబాల్కర్ టేకింగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కేతన్ శోధ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలలో నుంచి జారిపోకుండా చేస్తుంది. శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. అనవసరమైన సన్నివేశాలు .. సాగతీత సన్నివేశాలు ఎక్కడా కనిపించవు.
ఈ సమాజానికి క్రూర స్వభావం కలిగిన సైకోల వలన ఎంతటి ప్రమాదమో, అలాంటివారి ఆటకట్టించడానికి అడ్డుపడే అవినీతి అధికారులు కూడా అంతే ప్రమాదమనే ఒక సందేశం ఈ కథ ద్వారా అందుతుంది. అక్కడక్కడా అభ్యంతరకరమైన డైలాగ్స్ వినబడతాయి. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలకు అలవాటు పడినవాళ్లు ఈ సినిమాను చూడగలరు. హింసతో కూడిన సన్నివేశాలకు భయపడేవారు, చూడకపోవడమే మంచిది.
'సెక్టార్ 36' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
| Reviews
Sector 36 Review
- హిందీలో రూపొందిన 'సెక్టార్ 36'
- నేరుగా ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్
- యథార్థ సంఘటనలకు దృశ్య రూపం
- భయపెట్టే హింస - రక్తపాతం
Movie Name: Sector 36
Release Date: 2024-09-13
Cast: Vikrant Massey, Deepak Dobriyal, Akash Khurana, Darshan Jariwala, Baharul Islam
Director: Aditya Nimbalkar
Music: Ketan Sodha
Banner: Maddock Films - Jio Studios
Review By: Peddinti
Sector 36 Rating: 3.00 out of 5
Trailer