మలయాళ సినిమాలకు ఓటీటీ వైపు నుంచి మంచి క్రేజ్ ఉంది. థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ ట్రాక్ పై సందడి చేస్తుండగా, అందుకు భిన్నంగా ఒక కామెడీ డ్రామా 'జీ 5' వేదికపై వచ్చింది. ఆ సినిమా పేరే 'నునాక్కుజి'. బాసిల్ జోసెఫ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఆగస్టు 15వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. అక్కడ పాతిక కోట్ల వరకూ రాబట్టిన ఈ సినిమా, ఈ నెల 13వ తేదీ నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఎలా ఉందనేది చూద్దాం.
ఏబీ జకారియా (బాసిల్ జోసెఫ్) శ్రీమంతుల కుటుంబానికి చెందిన యువకుడు. చావుబతుకుల్లో ఉన్న తండ్రి చివరికోరికను తీర్చడం కోసం రిమీ (నిఖిలా విమల్)ను పెళ్లి చేసుకుంటాడు. తండ్రి మరణించడంతో, ఇష్టం లేకపోయినా కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. ఆ భార్యాభర్తలకు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఏబీ ల్యాప్ టాప్ లో ఉంటుంది. భార్య ఎంతగా చెప్పిన అతను డిలీట్ చేయడు. ఒక రోజున హఠాత్తుగా ఏబీ జకారియా ఆఫీసుపై రైడ్ చేసిన ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్స్ అతని ల్యాప్ టాప్ ను తీసుకెళ్లిపోతారు.
ఈ విషయం తెలియగానే అతనిపై రిమీ మండిపడుతుంది. వెంటనే ఆ ల్యాప్ టాప్ తీసుకుని రాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. దాంతో ఎలాగైనా ఆ ల్యాప్ టాప్ ను తీసుకురావాలనే ఉద్దేశంతో ఏబీ బయల్దేరతాడు. కాకపోతే అప్పటికే ఆ ల్యాప్ టాప్ మారిపోయి, సినిమా డైరెక్షన్ ఛాన్సుల కోసం తిరిగే ఒక యువకుడి చేతికి వెళుతుంది. ఇక రంజిత్ ( అజూ వర్గీస్) రష్మిత ( గ్రేస్ ఆంటోని) భార్యాభర్తలు. రష్మిత నుంచి రంజిత్ విడాకులు తీసుకోవాలనుకుంటాడు. అతనికి విడాకులు రావడం కోసం, రష్మిత గురించి కోర్టులో తప్పుడు సాక్ష్యం చెబుతాడు డాక్టర్ జయదేవన్ (సైజూ కురుప్)
డెంటిస్ట్ అయిన జయదేవన్ కి హీరో సుందర్ నాథ్ (మనోజ్ కె జయన్) భార్య మాయ (స్వస్తిక)తో అక్రమ సంబంధం ఉంటుంది. కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పిన అతనిపై కోపంతో క్లినిక్ కి వెళుతుంది రష్మిత. ఆమెను దూరం నుంచే చూసిన జయదేవన్, 'మాయ'ను ఒక రూమ్ లో దాచేస్తాడు. రష్మిత చేసిన దాడి వలన అతను ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న రష్మిత కంగారు పడిపోతుంది. ఆ భయంతోనే అక్కడి నుంచి తన ఇంటికి చేరుకుంటుంది.
తన వలన జయదేవన్ చనిపోవడం వలన, ఆ భయంతో రష్మిత ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. మద్యంలో పురుగుల మందు కలుపుకుంటుంది. ఏబీ నుంచి ల్యాప్ ట్యాప్ తీసుకున్న ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ భామకృష్ణన్ ( సిద్ధిఖీ) కూడా అదే అపార్టుమెంటులో ఉంటూ ఉంటాడు. అతని ఫ్లాట్ లోని ల్యాప్ టాప్ కొట్టేయడానికి వచ్చిన ఏబీని దొంగగా భావించి సెక్యూరిటీ వాళ్లు వెంటపడతారు. అతను పారిపోతూ రష్మిత ఫ్లాట్ లోకి దూరతాడు.
పురుగుల మందు కలుపుకున్న రష్మిత, బయట అలికిడి కావడంతో వెళుతుంది. ఆ సమయంలో ఆ గదిలోకి వచ్చిన ఏబీ, టేబుల్ పై ఉన్నది కేవలం మద్యం మాత్రమే అనుకుని తాగేస్తాడు. తన భార్యను జయదేవన్ తో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కోసం హీరో సుందర్ నాథ్ అతని క్లినిక్ కి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? పురుగుల మందు తాగేసిన ఏబీ పరిస్థితి ఏమిటి? ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ తీసుకెళ్లిన ల్యాప్ టాప్ ఎలా చేతులు మారుతుంది? అనేది మిగతా కథ.
కొత్తగా పెళ్లైన జంట .. విడిపోవాలని అనుకుంటున్న మరో జంట .. అక్రమం సంబంధం పెట్టుకున్న ఇంకొక జంట. ఈ మూడు జంటలతో ముడిపడి ఈ కథ నడుస్తుంది. ఇక ఈ జంట సమస్యలతో ఒక పోలీస్ ఆఫీసర్ .. ఒక ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ లింకై ఉంటారు. కథ ఒక దగ్గరి నుంచి మరొక దగ్గరికి పరిగెడుతూ చేసే వినోదాల విన్యాసాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.
మలయాళంలో కృష్ణకుమార్ రాసిన కథ ఇది. తెలుగు అనువాదం కూడా బాగా సెట్ అయింది. జీతూ జోసెఫ్ ఖర్చు లేకుండా అద్భుతమైన కథనాన్ని నడిపించడంలో సిద్ధహస్తుడు. అదే పద్ధతి మనకి ఈ సినిమా విషయంలోను కనిపిస్తుంది. ప్రధానమైన పాత్రలన్నీ .. ఒకదాని వెనుక ఒకటి పరిగెడుతూ ఉంటాయి. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు సరదాగా సాగిపోతూ హాయిగా నవ్విస్తూ ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ కి సంబంధించిన సన్నివేశాలు మరిన్ని నవ్వులు కురిపిస్తూ ఉంటాయి.
ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా ఆల్రెడీ మంచి క్రేజ్ ఉన్నవారే. ఎవరి పాత్రలో వారు అలా ఒదిగిపోయారు. ముఖ్యంగా బాసిల్ జోసెఫ్ నటన హైలైట్ గా నిలుస్తుంది. ఈ మధ్యనే తను కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్నాడు. సతీశ్ కురుప్ ఫొటోగ్రఫీ .. విష్ణు శ్యామ్ నేపథ్య సంగీతం కథను మరింత ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకుని వెళ్లాయి. వినాయక్ ఎడిటింగ్ కూడా బాగుంది.
ఒక తప్పును కవర్ చేసుకోవడానికి మరెన్నో తప్పులు చేయవలసి వస్తుంది అనే అంశాన్ని హాస్యభరితంగా అందించిన కంటెంట్ ఇది. మొదటి నుంచి చివరివరకూ ఎక్కడా బోర్ అనిపించకుండా కథ పరిగెడుతుంది. దర్శకుడు ఈ పాత్రలన్నీంటిని కలిపిన విధానం .. అక్కడి నుంచి కలిసి పరిగెత్తించే తీరు తలచుకుని మరీ నవ్వుకునేలా చేస్తుంది. ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడదగిన సినిమా ఇది.
'నునాక్కుజి' (జీ 5) మూవీ రివ్యూ!
| Reviews
Nunakkuzhi Review
- మలయాళంలో హిట్ కొట్టిన 'నునాక్కుజి'
- ఈ నెల 13 నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్
- వినోదమే ప్రధానంగా సాగే సినిమా
- హాయిగా నవ్వించే కథాకథనాలు
- ఫ్యామిలీతో సరదాగా చూడదగిన కంటెంట్
Movie Name: Nunakkuzhi
Release Date: 2024-09-13
Cast: Basil Joseph, Grace Antony, Nikhila Vimal, Siddhique, Aju Varghese, Manoj K Jayan
Director: Jeethu Joseph
Music: Vishnu Shyam
Banner: Yoodlee Films
Review By: Peddinti
Nunakkuzhi Rating: 3.00 out of 5
Trailer