'అంధకారం' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

Andhakaaram

Andhakaaram Review

  • అర్జున్ దాస్ ప్రధాన పాత్రగా 'అంధకారం'
  • సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • చివరివరకూ సస్పెన్స్ ను కొనసాగించిన దర్శకుడు
  • కీలకమైన చివరి 40 నిమిషాలు

తమిళంలో అర్జున్ దాస్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రధానమైన పాత్రగా రూపొందిన సినిమానే 'అంధగారం'. విఘ్నరాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2020లో అక్కడి థియేటర్లకు వచ్చింది. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఆ తరువాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. అయితే రీసెంటుగా 'అంధకారం' టైటిల్ తో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

వినోద్ (అర్జున్ దాస్) ఒక రూమ్ లో అద్దెకి ఉంటూ ఉంటాడు. మానసికంగా దెబ్బతిన్న తన స్నేహితుడు ప్రదీప్ ను మామూలు మనిషిని చేయడానికి అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ విషయంలో ఆయన పూజ ( పూజా రామచంద్రన్) సహాయం తీసుకుంటాడు. సామాజిక సేవలో ముందుండే పూజ, అంధుడైన సూర్య ( వినోద్ కిషన్) అనే యువకుడికి కూడా సహాయ సహకారాలను అందిస్తూ ఉంటుంది. 

సూర్య ఒక ప్రభుత్వ లైబ్రరీలో క్లర్క్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి చూపు లేకపోయినా ఏ పుస్తకం ఎక్కడ ఉంటుందో తెలుసు. ఒక వైపున చదువుకుంటూనే .. మరో వైపున ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అలాంటి అతనికి కిడ్నీలు దెబ్బతింటాయి. డయాలసిస్ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు  అవసరమవుతుంది. గతంలో అతని తండ్రి క్షుద్ర పూజలు చేసేవాడు. ఆ విద్యకి సంబంధించి అతను ఒక పుస్తకం కూడా రాస్తాడు. తండ్రి ఇచ్చిన పెద్ద ఇల్లు తప్ప ఇప్పుడు సూర్యకి మరో ఆధారం లేదు. 

ఒక బంగ్లాలో ప్రేతాత్మ ఉందనీ, దానిని బంధిస్తే లక్ష రూపాయలు ఇస్తానని ఒక వ్యక్తి సూర్యతో చెబుతాడు. ఆ డబ్బు కోసం సూర్య తండ్రి రాసిన పుస్తకాన్ని చదువుతాడు. ఆ బంగ్లాలోని ప్రేతాత్మను ఒక సీసాలో బంధిస్తాడు. అదే సమయంలో కొంతమంది రౌడీలు సూర్యని చంపి .. అతని ఇంటి పత్రాలపై వేలిముద్ర తీసుకుంటారు. ఆ సమయంలోనే అతను బంధించిన సీసాలోని ప్రేతాత్మ తప్పించుకుంటుంది. ఇక తరచూ తనకి ఎవరో కాల్ చేసి, చంపుతానని బెదిరిస్తున్నారని పూజతో వినోద్ చెబుతాడు. తన గదిలో నమ్మశక్యం కాని సంఘటనలు జరుగుతున్నాయని అంటాడు.

వినోద్ చెబుతున్న మాటలను సన్నిహితులు లైట్ తీసుకుంటారు. మానసిక వైద్య నిపుణులను కలవమని అతనికి సలహా ఇస్తారు. అప్పుడే అతను డాక్టర్ ఇంద్రన్ (కుమార్ నటరాజన్) పేరు వింటాడు. ఒక మానసిక రోగి చేసిన దాడి కారణంగా గాయపడిన ఆయన, 8 నెలల తరువాత కోమాలో నుంచి బయటికి వచ్చాడని ఇంద్రన్ గురించి వినోద్ కి పూజనే చెబుతుంది. అయితే అతను కొన్ని కారణాల వలన ఇంద్రన్ ను కలవలేకపోతాడు.  

 వినోద్ సమస్య గురించి ఆలోచన చేస్తున్న పూజకి, సూర్య హత్య గురించి తెలిసి షాక్ అవుతుంది. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టని సూర్యను ఎవరు హత్య చేశారు? అనేది ఆమెకి అర్థం కాదు. సూర్య తండ్రి ఒక క్షుద్ర మాంత్రీకుడనీ, సూర్య కూడా ఆత్మలతో మాట్లాడేవాడిని తెలిసి ఆమె నివ్వెరపోతుంది. తన తండ్రి ఆత్మతో సూర్య మాట్లాడిన టేప్ ఆమె చేతికి చిక్కడంతో ఆమె ఆ విషయాన్ని నమ్ముతుంది. 

 సూర్యను ఎవరు చంపారు? వినోద్ ను చంపుతామని బెదిరిస్తున్నది ఎవరు? డాక్టర్ ఇంద్రన్ పై వినోద్ కి ఎందుకు అనుమానం వచ్చింది?  అనే విషయాలను పూజ తెలుసుకోవాలనుకుంటుంది. అందుకోసం వినోద్ తో కలిసి రంగంలోకి దిగుతుంది. అప్పుడామెకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? సీసాలో నుంచి తప్పించుకున్న ప్రేతాత్మ ఎవరిది? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది.

ఒక వైపున వినోద్ .. ఒకవైపున సూర్య ..  మరో వైపున డాక్టర్ ఇంద్రన్ వైపు నుంచి ఈ కథ  నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాకి ప్రధానమైన బలం స్క్రీన్ ప్లే. కాకపోతే అది సామాన్య ప్రేక్షకులకు అంత తేలికగా అర్థం కాదు. ఇటు వినోద్ .. అటు సూర్య పాత్రలను సమాంతరంగా చూపిస్తూ దర్శకుడు ఈ కథను నడిపిస్తూ ఉంటాడు. సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. కానీ అసలు ఏం జరుగుతోంది అనే అయోమయం ప్రేక్షకులను వెంటాడుతూ ఉంటుంది. చివరి 40 నిమిషాలకి చేరుకున్న తరువాత విషయమేమిటనేది అర్థమవుతుంది. ఆ 40 నిమిషాల్లో క్లారిటీ వచ్చిన తరువాత .. 'ఓహో అదా విషయం' అనిపిస్తుంది. 

ఎడ్విన్ ఫొటోగ్రఫీ .. ప్రదీప్ కుమార్ నేపథ్య సంగీతం .. సత్యరాజ్ నటరాజన్ ఎడిటింగ్ కథకి మరింత బలాన్ని చేకూర్చాయి. అర్జున్ దాస్ .. వినోద్ కిషన్ నటన హైలైట్. చివరి 40 నిమిషాల వరకూ .. అంటే దర్శకుడు తనంతట తాను రివీల్ చేసేవరకూ ఏం జరుగుతుందనేది ఆడియన్స్ గెస్ చేయలేరు. అలా స్క్రీన్ ప్లే వేసుకోవడం నిజంగా దర్శకుడి గొప్పతనమే. ఆయన చేసిన మేజిక్ అర్థమైన తరువాతనే ఈ కంటెంట్ కి మంచి మార్కులు ఇచ్చుకుంటాము. ఈ తరహా జోనర్ ను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. 

Movie Name: Andhakaaram

Release Date: 2024-09-12
Cast: Arjun Das, Vinoth Kishan, Pooja Ramachandran, Kumar Natarajan
Director: Vignarajan
Music: Pradeep Kumar
Banner: A for Apple

Andhakaaram Rating: 2.75 out of 5

Trailer

More Reviews