ఓ మాదిరి బడ్జెట్ లో ప్రేమకథలను అందించడంలో 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్ ముందుంటుంది. అలా ఈ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాగా 'ఆయ్' కనిపిస్తుంది. నార్నె నితిన్ - నయన్ సారిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాతో, అంజి కె మణిపుత్ర దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆగస్టు 15వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ 'అమలాపురం' నేపథ్యంలో నడుస్తుంది. కార్తీక్ (నార్నె నితిన్) హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఫస్టు లాక్ డౌన్ తరువాత కాలం .. సెకండ్ లాక్ డౌన్ పై సందేహాలు ఉన్న సమయంలో సాఫ్ట్ వేర్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ కి అవకాశం ఇస్తాయి. ఆ సమయంలో కార్తీక్ 'అమలాపురం' వచ్చేస్తాడు. దాంతో అతని చిన్ననాటి స్నేహితులైన సుబ్బు (రాజ్ కుమార్ కసిరెడ్డి) .. హరి (అంకిత్ కొయ్య) ఫుల్ ఖుషీ అవుతారు. ముగ్గురూ కలిసి ఊరంతా సరదాగా తిరిగేస్తూ ఉంటారు.
కార్తీక్ తండ్రి బూరయ్య (వినోద్ కుమార్) అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. అతని మంచితనం కారణంగా అయిన అప్పులకు వడ్డీలు కట్టలేక కార్తీక్ చిరాకు పడుతూ ఉంటాడు. తండ్రి ధోరణి పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. అదే ఊళ్లో దుర్గా ( మైమ్ గోపీ) చిన్నపాటి బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. అతనంటే ఆ ఊళ్లో వాళ్లందరికీ భయమే. ఆయన ఒక్కగానొక్క కూతురే పల్లవి( నయన్ సారిక).
పల్లవికి సోషల్ మీడియా పిచ్చి ఎక్కువ. అలాగే 'ఫంక్'తో కూడిన తన హెయిర్ స్టైల్ అంటే ఆమెకి ఇష్టం .. తన అంతటి అందగత్తె ఆ చుట్టుపక్కల లేదనే నమ్మకం. అలాంటి ఆమెపై కార్తీక్ మనసు పారేసుకుంటాడు. ప్రేమంటూ ఆమె వెంటపడటం మొదలుపెడతాడు. చాలా కాలం నుంచి ఆమెకి లైన్ వేయడానికి ట్రై చేస్తూ వచ్చిన సుబ్బుకి ఈ విషయం తెలిసి చాలా ఫీలవుతాడు. చివరికి ఈ ప్రేమ విషయంలో కార్తీక్ కి సాయం చేయాలనే నిర్ణయించుకుంటాడు.
తన ప్రేమ విషయాన్ని పల్లవితో కార్తీక్ చెబుతాడు. తన తండ్రికి 'కులం' పట్టింపు ఎక్కువనీ, ఎలాంటి పరిస్థితుల్లోను ఆయన తమ పెళ్లికి ఒప్పుకోడని పల్లవి తేల్చి చెబుతుంది. ఆల్రెడీ ఆయన ఒక సంబంధం మాట్లాడాడనీ, మరుసటి రోజు తన నిశ్చితార్థం జరగనుందని చెబుతుంది. తండ్రి నిర్ణయానికి తాను ఎదురుమాట్లాడే పరిస్థితి లేదని అంటుంది. అప్పుడు కార్తీక్ ఏం చేస్తాడు? వాళ్ల ప్రేమ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది కథ.
'అమలాపురం'లో నడిచే ఓ ప్రేమకథ ఇది. హీరో .. హీరోయిన్ ను చూడటం .. ఆమె వెంటపడటం .. ప్రేమ విషయంలో ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తూ ఉండటం .. ఆమెకి మరొకరితో పెళ్లి జరగనుందని తెలిసి టెన్షన్ పడటం .. ఇవన్నీ చాలా ప్రేమకథల్లో కనిపిస్తూనే ఉంటాయి. అసలు ఇలాంటి అంశాలు లేకుండా ప్రేమకథలే ఉండవు. అలాంటి లక్షణాలతో వచ్చిన సినిమానే ఇది. మారిందల్లా తెరపై కనిపించే ఆర్టిస్టులు .. లొకేషన్స్ .. ఈ రెండింటినీ కలిపి చూపించే విధానం.
కథ .. కథనాలలో కొత్తదనమేదీ కనిపించదు. అలా అని చెప్పి ఈ సినిమా పెద్దగా బోర్ అనిపించదు. అందుకు కారణం లొకేషన్స్. అందమైన .. ఆహ్లాదకరమైన లొకేషన్స్ ఈ కథకు ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పాలి. హీరో వైపు నుంచి హీరోయిజాన్ని చూపించే ఛాన్స్ ఉంది .. హీరోయిన్ ను మరింత గ్లామరస్ గాను చూపించవచ్చు. అలాగే మైమ్ గోపీ విలనిజాన్ని కూడా ఒక రేంజ్ లో ఆవిష్కరించవచ్చు. కానీ అలాంటి ప్రయత్నం జరగలేదు.
ఇక హీరో ఫ్రెండ్స్ చేసే పనులే ఈ కథలో నుంచి కామెడీని లాగే సాధనాలు. అలాంటి ప్రయత్నాలు అంతగా వర్కౌట్ కాకపోవడం కనిపిస్తుంది. ఈ ట్రాకులో వచ్చే సీన్స్ లో పస లేకపోగా, సాగదీస్తున్నటుగా అనిపిస్తుంది. ఇక ఎక్కడో ఏదో ట్విస్ట్ ఉంది కదా అని, వినోద కుమార్ అంతటి పర్సనాలిటీని అనారోగ్యం పేరుతో 'పడక కుర్చీ'కి పరిమితం చేయడం ఇబ్బందిని కలిగిస్తుంది. ఆ వైపు నుంచి ఎమోషన్స్ కూడా అంతగా కనెక్ట్ కాలేదు.
ఈ సినిమాకి ప్రధానమైన బలం సమీర్ కల్యాణి కెమెరా పనితనమనే చెప్పాలి. విలేజ్ నేపథ్యంలోని అందాలను కథకు జోడిస్తూ, దృశ్య పరమైన అనుభూతిని ఆవిష్కరించారు. ఆ తరువాత స్థానాన్ని సంగీతానికి ఇవ్వొచ్చు. రామ్ మిర్యాల - అజయ్ అరసాడ పనితీరు ఆకట్టుకుంటుంది. 'రంగనాయకి' .. 'సుఫియానా' అనే బాణీలు బాగున్నాయి. కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ విషయానికి వస్తే, వీటీవీ గణేశ్ సీన్స్ తో పాటు, కామెడీ ట్రాక్ వైపు కొంత ట్రిమ్ చేయవచ్చు. కథ రొటీన్ గా అనిపించినా .. ఆహ్లాదకరమైన లొకేషన్స్ వైపు నుంచి మంచి మార్కులు తెచ్చుకునే సినిమా ఇది.
'ఆయ్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
| Reviews
Aay Review
- నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న 'ఆయ్'
- రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే కథ
- రొటీన్ గా అనిపించే ప్రేమకథ
- హైలైట్ గా అనిపించే లొకేషన్స్
Movie Name: Aay
Release Date: 2024-09-12
Cast: Narne Nithin, Nayan Sarika, Rajkumar Kasireddy, Ankith Koyya, Mime Gopi, Vinod Kumar
Director: Anji K Maniputhra
Music: Ram Miriyala - Ajaya Arasada
Banner: GA2 Pictures
Review By: Peddinti
Aay Rating: 2.50 out of 5
Trailer