'సత్య' (ఆహా) మూవీ రివ్యూ!

Sathya

Movie Name: Sathya

Release Date: 2024-09-07
Cast: Hamaresh, Prarthana , Aadukalam Murugadoss ,Amit Bhargav , Rahul
Director:Vaali Mohan Das
Producer: Babu Reddy
Music: Sundaramurthy KS
Banner: Gopuram Studios
Rating: 2.75 out of 5
  • క్రితం ఏడాది తమిళంలో రూపొందిన 'రంగోలి' 
  • 'సత్య' టైటిల్ తో ఆహాలోకి స్ట్రీమింగ్ 
  • ఆకట్టుకునే టీనేజ్ లవ్ స్టోరీ - ఫ్యామిలీ ఎమోషన్స్ 
  • సహజత్వానికి దగ్గరగా నడిచే కథాకథనాలు  

క్రితం ఏడాది తమిళంలో రూపొందిన టీనేజ్ లవ్ స్టోరీస్ లో 'రంగోలి' ఒకటి. తమిళంలో యూత్ ను ఆకట్టుకున్న ఈ సినిమా, 'సత్య' టైటిల్ తో 'ఆహా'లో ఈ నెల 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హమరేష్ - ప్రార్ధన ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

సత్య (హమరేశ్) ఒక పేద కుటుంబానికి చెందిన యువకుడు. తండ్రి గాంధీ (ఆడుకాలం మురుగదాస్) తల్లి కళ (సాయిశ్రీ) అక్క హేమ .. ఇదీ అతని కుటుంబం. ఒక బస్తీలో ఈ కుటుంబం నివసిస్తూ ఉంటుంది. గాంధీ ఇస్త్రీ పని చేస్తూ ఉంటాడు. కూతురు హేమ అతనికి పనిలో సహకరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లనే ఆమె పదో తరగతిలో చదువు మానేస్తుంది. ఈ ముగ్గురుకి కూడా సత్యను మంచి స్కూల్లో చదివించాలని ఉంటుంది. 

సత్య అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటాడు. అతని ప్రాణస్నేహితుడు అబ్దుల్. ఆడుతూ .. పాడుతూ .. అల్లరి చేస్తూ కాలం గడిపేస్తూ ఉంటాడు. అతను ఇంటర్ కి రాగానే అప్పు చేసి మరీ అతణ్ణి ఇంగ్లిష్ మీడియం కాలేజ్ లో చేరుస్తారు. అక్కడి వాతావరణం అంతా సత్యకి కొత్త కొత్తగా అనిపిస్తుంది. అతని లోక్లాస్ నుంచి వచ్చాడని చెప్పి గౌతమ్ టీమ్ ఆటపట్టిస్తూ ఉంటుంది. 

అదే కాలేజ్ లో .. అదే క్లాస్ చదువుతున్న పార్వతి (ప్రార్ధన)ను గౌతమ్ లవ్ చేస్తూ ఉంటాడు. ఆమె సత్యను ఇష్టపడుతూ ఉండటం గౌతమ్ కి కోపం తెప్పిస్తుంది. దాంతో తరచూ గౌతమ్ కి .. సత్యకి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. సత్య కాలేజ్ ఫీజుకి అవసరమైన డబ్బు కోసం అతని తల్లిదండ్రులు .. అక్క కూడా అదనపు పని గంటలు పని చేస్తూ ఉంటారు. ఈ విషయంలో తమ ఆరోగ్యాన్ని కూడా వాళ్లు పట్టించుకోరు. 

అప్పటివరకూ తెలుగు మీడియంలో చదువుతూ వచ్చిన సత్యకి, ఇంగ్లిష్ మీడియం చదువు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో గౌతమ్ బ్యాచ్ అతణ్ణి అదే పనిగా అవమాన పరుస్తూ ఉంటారు. మరో వైపున తన చదువు కోసం తల్లదండ్రులు పడుతున్న అవస్థలను చూసి సత్య బాధపడతాడు. ఈ అయోమయ స్థితిలో .. తానంటే ఇష్టపడుతున్న పార్వతిపై సైతం అతను చీకాకు పడతాడు. ఈ సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం ఉందని భావించిన అతను ఒక నిర్ణయానికి వస్తాడు. అదేమిటనేది కథ. 
            
వాలి మోహన్ దాస్ ఈ సినిమాకి రచయిత .. దర్శకుడు. మురికివాడల్లో నివసించేవారు కూడా, తమ పిల్లలకు మంచి స్కూళ్లలో .. కాలేజ్ లో చదువు చెప్పించడానికి ఆసక్తిని చూపుతుంటారు. అప్పటివరకూ తమ పరిధిలో చదువుతూ వచ్చిన పిల్లలు ఒక్కసారిగా కార్పొరేట్ కాలేజ్ లలో ఇమడతారా లేదా అనేది మాత్రం ఆలోచన చేయరు. అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లలు ఎంత స్ట్రగుల్ ను ఫేస్ చేస్తారు? అనేది దర్శకుడు ఎంచుకున్న ప్రధానమైన కథాంశం.

దర్శకుడు తాను అనుకున్న ప్రధానమైన కథాంశం ఏదైతే ఉందో, ఆ కథను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు. తల్లిదండ్రులు .. పిల్లల మధ్య సంఘర్షణను వాస్తవానికి దగ్గరగా ఆవిష్కరించగలిగాడు. అలాగే ఈ చిన్న కథకు ఆయన లవ్ స్టోరీని జోడించిన తీరు కూడా  ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కి, ఫీల్ తో కూడిన ఒక టీనేజ్ లవ్ స్టోరీని జోడించిన తీరు మనసును పట్టుకుంటుంది. 

టీనేజ్ లవ్ స్టోరీ వైపు నుంచి ఒకటి రెండు పాటలు పడితే చాలా బాగుండేది. కానీ లవ్ ట్రాక్ పై పెద్దగా దృష్టి పెట్టకపోవడం యూత్ కి కాస్త అసంతృప్తిని కలిగిస్తుంది. హమరేశ్ - ప్రార్ధన తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఎక్కడా కూడా వాళ్లు నటిస్తున్నట్టుగా అనిపించదు. క్లాస్ రూమ్ లో ఒక మూలాన కూర్చుని వాళ్లను మనం గమనిస్తున్నట్టుగానే ఉంటుంది. 

మరుదనాయగం ఫొటోగ్రఫీ, సుందరమూర్తి నేపథ్య సంగీతం .. సత్యనారాయణ ఎడిటింగ్ కథకి తగినట్టుగానే అనిపిస్తాయి. ఎవరికీ ఎలాంటి మేకప్ లేకుండా, సహజత్వానికి దగ్గరగా మలచిన ఈ కథ, ఫ్యామిలీ ఆడియన్స్ కి .. యూత్ కి తప్పకుండా నచ్చుతుంది.
 
 వనంలో కంటే పిట్టపిల్ల ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుంది. చేపపిల్ల బావిలో కంటే చెరువులో స్వేచ్ఛగా తిరుగుతుంది. వాటిని అందంగా చూడటం కోసం బంధించకూడదు. ఎవరికి అలవాటుపడిన వాతావరణంలో వారు ఎదగడంలోనే అసలైన ఆనందం ఉంటుంది .. సరిహద్దులు లేని సంతోషం ఉంటుంది అనే సందేశం మనకి ఈ కథలో కనిపిస్తుంది.  

Trailer

More Reviews