తమిళంలో 'కిడా' పేరుతో ఒక సినిమా రూపొందింది. స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ సినిమాకి 'రా. వెంకట్' దర్శకత్వం వహించాడు. 2023 నవంబర్ 11వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ఆగస్టు 29వ తేదీ నుంచి 'ఈటీవీ విన్' లో 'దీపావళి' పేరుతో అందుబాటులోకి వచ్చింది. తీసన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
అది అడవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఒక మారుమూల గ్రామం. అక్కడ చెల్లయ్య - చిన్నమ్మ అనే వృద్ధ దంపతులు నివసిస్తూ ఉంటారు. కొండవాలున ఒక గుడిసె వేసుకుని వారు ఉంటారు. వారి ఒక్కగానొక్క మనవడు గణేశ్ ( దీపన్). తల్లిదండ్రులను ఒక ప్రమాదంలో కోల్పోయిన గణేశ్ ను ఆ దంపతులు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక వాళ్లు పెంచుకునే మేక పేరు 'కర్రోడు'.. అదంటే గణేశ్ కి ప్రాణం.
అడవికి ఆనుకుని ఉన్న ఐదు సెంట్ల భూమి .. ఓ పూరిపాక .. ఓ మేక .. ఇదే చెల్లయ్య ఆస్తి .. పాస్తి. ఏదైనా కష్టం చేసుకుని బ్రతుకుదామని అనుకంటే సహకరించని వయసు .. శరీరం. దీపావళి పండుగ మరో మూడు రోజులు ఉందనగానే, తనకి కొత్త బట్టలు కొనిపెట్టమని తాతయ్యను గణేశ్ వేధిస్తూ ఉంటాడు. దాంతో మనవడికి చెప్పకుండా మేకను అమ్మేసి అతనికి కొత్త బట్టలు తీసుకోవాలని చెల్లయ్య భావిస్తాడు. కాకపోతే ఆ మేక అంటే మనవడికి ప్రాణం .. అందుకే ఆలోచిస్తూ ఉంటాడు.
ఇక అదే గ్రామంలో వేల్ సామి (కాళీ వెంకట్) ఓ మటన్ షాపులో పనిచేస్తూ ఉంటాడు. రోజూ తాగేసి ఆలస్యంగా షాపుకు వెళుతూ ఉంటాడు. దాంతో ఆ ఓనర్ వారసుడు వేల్ సామిని నిలదీస్తాడు. ఆ క్షణమే పనిలో నుంచి తీసేస్తాడు. దాంతో దీపావళి రోజునే తన సొంత షాపును ఓపెన్ చేస్తానని అతని దగ్గర వేల్ సామి సవాల్ విసురుతాడు. అందుకు అవసరమైన మేక కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు.
వేల్ సామి కొడుకు ఆటో నడుపుతూ ఉంటాడు. అతను తన మేనత్త కూతురు జ్యోతిని ప్రేమిస్తాడు. అయితే రెండు కుటుంబాల మధ్య మాటలు లేకపోవడం వలన, తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవచ్చని ఇద్దరూ భావిస్తారు. అందువలన దీపావళి పండుగ ముందురోజు ఎవరి హడావిడిలో వారు ఉంటారు గనుక ఊరొదిలి వెళ్లి పోవాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో చిల్లర దొంగతనాలు చేసే ఒక గ్యాంగ్ రంగంలోకి దిగుతుంది.
ఇట్లా దీపావళి పండుగ కేంద్రంగా చేసుకుని మేకను అమ్మేయాలని ఒకరు .. కొనాలని ఒకరు నిర్ణయించుకుంటారు. అదే రోజున ఊరికి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న జంట. ఆ సమయంలోనే ఊళ్లో వాళ్ల మేకలను కాజేయాలని భావించిన గ్యాంగ్. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది? ఆ తాత ముచ్చట తీరుతుందా? ఆ మనవాడి కోరిక నెరవేరుతుందా? ఆ జంట ప్రేమ ఫలిస్తుందా? వేల్ సామికి ప్రయత్నం ఫలిస్తుందా? అనేదే కథ.
దీపావళికి మనవడికి కొత్తబట్టలు కొనడం కోసం, మేకను అమ్మేయాలని అనుకున్న ఒక తాత. ఒక మేకను కొని దీపావళి రోజు నుంచి మటన్ షాపు ఓపెన్ చేయాలనుకున్న ఒక పౌరుషవంతుడు. తమ ప్రేమను పెద్దల అంగీకరించరు గనుక, ఊరొదిలి వెళ్లిపోవడానికి దీపావళి రోజునే ముహూర్తంగా ఎంచుకున్న ఒక ప్రేమ జంట. తాము దొంగతనాలు చేయడానికి దీపావళికి మించిన ఛాన్స్ ఉండదని భావించిన ఒక చిల్లర గ్యాంగ్. ఈ నాలుగు వైపుల నుంచి తిరిగే కథ ఇది.
నిజానికి ఇది చాలా చిన్న సినిమా. ఎలాంటి స్టార్స్ కనిపించని సినిమా. పోస్టర్స్ పై ఒక చిన్నపిల్లాడు .. ఒక వృద్ధుడు .. ఒక మేకను హైలైట్ చేశారు. ఆ పోస్టర్స్ ను బట్టి ఈ సినిమాను చూడటానికి ఉత్సాహాన్ని కనబరిచేవారు తక్కువే ఉంటారు. ఈ సినిమానేం చూస్తాములే అనుకునేవారు ఉంటారు. కానీ ఒకసారి కథలోకి అడుగుపెట్టాక వెనక్కి తిరిగి వెళ్లలేరు. అంతగా ఈ కథ .. పాత్రలు హత్తుకుపోతాయి.
దీపావళి పండుగపైనే కొన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఆ జీవితాలలో వెలుగులు నిండవలసింది దీపావళి పండుగతోనే. ఆ పండుగను కేంద్రంగా చేసుకుని ప్రధానమైన పాత్రలను అల్లుకున్న తీరు చాలా సహజంగా అనిపిస్తుంది. ఇది మన ఊరి కథ .. మన మధ్య జరుగుతున్న కథ అనిపిస్తుంది. అంతటి సహజత్వాన్ని టచ్ చేస్తూ ఈ కథ పరిగెడుతుంది. పల్లె స్వచ్ఛత ఈ కథకు చక్కని పరిమళం తీసుకొచ్చింది.
దర్శకుడు ప్రధానమైన పాత్రలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించాడు. సున్నితమైన భావోద్వేగాలను చక్కగా ఆవిష్కరించాడు. జయప్రకాశ్ కెమెరా పనితనం గొప్పగా ఉంది. పల్లె అందాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూ, కథకి ఆహ్లాదాన్ని జోడించాడు. తీసన్ నేపథ్య సంగీతం కథకు అవసరమైన ఫీల్ ను అందించింది. ఆనంద్ జెరాల్డ్ ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా అనవసరమైన సీన్ కనిపించదు.
గ్రామీణ వాతావరణం .. అక్కడి మట్టి మనుషులు .. వారి స్వభావాలు .. బంధాలు .. ప్రేమలు .. మూగ జీవాలతో వారికి గల సాన్నిహిత్యం .. వాటిలోని స్వచ్ఛతను అందంగా ఆవిష్కరించిన కథ ఇది. ఒకరికి ఒకరు సాయం చేసుకున్నప్పుడు .. సహకరించుకున్నప్పుడే అందరి జీవితాలు ఆనందంగా సాగుతాయి. కల్మషాలు లేకుండా కలిసి జీవించడమే నిజమైన పండుగ అనే సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమాను, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
'దీపావళి' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
| Reviews
Deepavali Review
- తమిళంలో రూపొందిన 'కిడా' సినిమా
- తెలుగులో వచ్చిన 'దీపావళి'
- విలేజ్ నేపథ్యంలో సాగే కంటెంట్
- ఎమోషన్స్ తో కూడిన కథాకథనాలు
- సహజత్వానికి పెద్దపీట వేసిన దర్శకుడు
- ఫ్యామిలీతో చూడవలసిన సినిమా
Movie Name: Deepavali
Release Date: 2024-08-29
Cast: Deepan, Kali Venkat, Poo Raman
Director: Ra Venkat
Music: Theesan
Banner: Sravanthi Movies
Review By: Peddinti
Deepavali Rating: 3.00 out of 5
Trailer