'బడ్డీ' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

Buddy

Buddy Review

  • ఈ నెల 2న థియేటర్లకు వచ్చిన 'బడ్డీ'
  • ఈ రోజు నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
  • ఆకట్టుకోలేకపోయిన కథాకథనాలు 
  • వినోదానికి దూరంగా కనిపించే కంటెంట్  

అల్లు శిరీష్ కొంత గ్యాప్ తరువాత చేసిన సినిమా 'బడ్డీ'. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రీ భరద్వాజ్ - ప్రిషా రాజేశ్ సింగ్ కథానాయికలుగా నటించగా, ప్రతినాయకుడిగా అజ్మల్ అమీర్ కనిపిస్తాడు. ఈ నెల 2వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఈ రోజు నుంచే 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

ఆదిత్య (అల్లు శిరీశ్) వైజాగ్ లో పెలైట్ గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో పల్లవి (గాయత్రి) కూడా పనిచేస్తూ ఉంటుంది. వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే ఒకానొక సందర్భంలో పల్లవి వలన ఆదిత్య జాబ్ పోతుంది. అందుకు ఆమె చాలా ఫీల్ అవుతుంది. అందుకు అతనిని కలిసి సారీ చెప్పడానికి బయల్దేరిన ఆమె మిస్సవుతుంది. 

 విదేశాలకు చెందిన ఒక శ్రీమంతుడి కొడుక్కి గుండె మార్పిడి చేయవలసి ఉంటుంది. డాక్టర్ ముసుగులో అవయవాలతో వ్యాపారం చేసే అర్జున్ కుమార్ (అజ్మల్) పేరు తెరపైకి వస్తుంది. ఆ శ్రీమంతుడి కొడుకు ప్రాణాలు నిలబెట్టడానికి అర్జున్ పెద్దమొత్తంలో డిమాండ్ చేస్తాడు. అతణ్ణి బ్రతికించడం కోసమే అతను పల్లవిని కిడ్నాప్ చేయిస్తాడు. అలా పల్లవి బాడీ హాంకాంగ్ లోని అతని ల్యాబ్ కి చేరుతుంది. అప్పటికే ఆమె కోమాలోకి వెళుతుంది. 

అయితే పల్లవి బాడీని విశాఖ నుంచి తరలిస్తున్న సమయంలోనే ఆమె ఆత్మ ఒక 'టెడ్డీ బేర్'లోకి ప్రవేశిస్తుంది. తన బాడీ ఎక్కడ ఉందనేది కనుక్కోవాలి .. తిరిగి తాను ఆదిత్య అక్కున చేరిపోవాలని ఆమె ఆశపడుతుంది. టెడ్డీ బేర్ గా అతి కష్టం మీద ఆదిత్య దగ్గరికి చేరుకుంటుంది. తాను పల్లవిని అనే విషయాన్ని దాచి, మిగతా సమస్య చెబుతుంది. దాంతో ఆ టెడ్డీ బేర్ కి సాయపడాలని ఆదిత్య నిర్ణయించుకుంటాడు. 

అదే సమయంలో వైజాగ్ లోని ఒక హాస్పిటల్ వారు, శవాలను బంధువులకు అప్పగించే తీరు విషయంలో ఆదిత్యకి అనుమానం వస్తుంది. ఏదో ఒక కారణం చెప్పి .. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవాలను బందువులకు అప్పగిస్తూ ఉంటారు. దాంతో పేషంట్లను ఎక్కడికో తరలిస్తున్నారనీ, వారి బంధువులకు వేరే వారి శవాలను అప్పగిస్తున్నారనే సంగతిని పసిగడతాడు. ఈ తతంగానికి .. హాంకాంగ్ కి ఏదో సంబంధం ఉందనే విషయం అతనికి అర్థమవుతుంది.  

టెడ్డీ బేర్ తో కలిసి ఆదిత్య హాంకాంగ్ వెళతాడు. ఈ విషయంలో అతనికి ఎయిర్ హోస్టెస్ సారా హెల్ప్ చేస్తుంది. హాంగ్ కాంగ్ లో అడుగుపెట్టిన వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? పల్లవి తిరిగి తన బాడీలోకి ప్రవేశిస్తుందా? అనేవి మిగతా అంశాలు. 

ఇది 'బడ్డీ' అనే పేరుగల ఒక టెడ్డీ బేర్ చుట్టూ తిరిగే కథ. ఈ కథను సామ్ ఆంటోన్ రాసుకున్నాడు. ఈ పోస్టర్స్ చూసినా .. ట్రైలర్ వంటివి చూసినా ఇది చిన్నపిల్లలు సరదాగా చూసే కంటెంట్ కావొచ్చు అనే ఒక సందేహం చాలామందికి కలుగుతుంది. ఇది కేవలం పిల్లల కోసమే తీయకపోయినప్పటికీ, నిజంగానే వాళ్లకు నచ్చే కంటెంట్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే టెడ్డీ బేర్ మాట్లాడటం .. పాటలు పాడటం .. డాన్సులు చేయడాన్ని వాళ్లు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. 

ఇక హీరోకి గానీ .. హీరోయిన్ కి గాని పేరెంట్స్ .. ఫ్యామిలీస్ ఉండవు. వాళిద్దరూ లవ్ లో పడటానికి బలమైన కారణం ఉండదు. టెడ్డీ బేర్ లోకి వచ్చిన హీరోయిన్ ఆత్మ, తాను ఎవరన్నది హీరోకి చెప్పదు. అందుకు కూడా పెద్ద కారణమేమి చెప్పలేకపోయారు. ఒక మనిషి చనిపోకుండానే ఆత్మ బయటికి వస్తుందా? అనే లాజిక్ ను పక్కన పెడితే, టెడ్డీ బేర్ పోర్షన్ వరకూ బాగానే లాగారు. క్లైమాక్స్ లో ఫైట్లు కూడా చేయించారు. 

ఒక కథలో హీరో - హీరోయిన్ మధ్య లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్లు ఉండాలనే సగటు ప్రేక్షకుడు కోరుకుంటాడు. కానీ కథ ఆరంభం నుంచి చివరి వరకూ హీరోయిన్ ను కోమాలో ఉంచితే ప్రేక్షకులకు ఎలా అనిపిస్తుందనేది ఈ సినిమా చూసినవారికి చెప్పవలసిన పనిలేదు. అలా లవ్ .. రొమాన్స్ .. పాటలపై ఆడియన్స్ పెట్టుకున్న ఆశలన్నీ ఆ కోమాలోనే కొట్టుకుపోతాయి. 

ఇక గ్లామర్ డోస్ తగ్గుతుందేమోనని ప్రిషా రాజేశ్ సింగ్ ను .. కామెడీ  డోస్ తగ్గుతుందేమోనని కో పెలైట్ గా అలీని దింపారు. కానీ ప్రేక్షకులను ఉత్సాహపరచడం ఆ పాత్రల వలన కూడా కాలేదు. అజ్మల్ విలనిజం తెలుగు ప్రేక్షకులకు ఇంతకుముందు అలవాటే. ఆ పాత్ర కూడా అంతగా ప్రభావం చూపించలేకపోయింది.  విలన్ రోల్స్ తో భయపెట్టిన ముఖేశ్ రుషితో కామెడీ చేయించడానికి ప్రయత్నించడం ఎందుకన్నది అర్థం కాదు. హిప్ హాప్ తమిళ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కృష్ణన్ వసంత్ ఫొటోగ్రఫీ .. రూబెన్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఆడియన్స్ ఆశించే వినోదాన్ని ఏ వైపు నుంచీ ఇవ్వలేకపోయిన సినిమా ఇది.  

Movie Name: Buddy

Release Date: 2024-08-30
Cast: Allu Sirish, Gayatri Bhardwaj, Prisha Rajesh Singh, Ajmal Ameer, Ali
Director: Sam Anton
Music: Hiphop Tamizha
Banner: Studio Green

Buddy Rating: 2.00 out of 5

Trailer

More Reviews