'ప్రభుత్వ జూనియర్ కళాశాల' సినిమా, ఈ ఏడాది జూన్ 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. దాదాపు నూతన నటీనటులతో నిర్మితమైన ఈ సినిమాకి శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించాడు. పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన, థియేటర్లకు ఈ సినిమా వచ్చి వెళ్లిన సంగతి కూడా తెలియదు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
రాయలసీమ ప్రాంతంలోని 'పుంగనూరు'కి సమీప గ్రామంలో వాసు (ప్రణవ్ సింగం పల్లి) నివసిస్తూ ఉంటాడు. తల్లి .. తండ్రి .. పూరిపాక .. రెండు గేదెలు .. ఇదీ అతని జీవితం. తండ్రి తాగుబోతు .. బాధ్యతలేనివాడు. తల్లి శివమ్మ (మల్లిక) పాలు అమ్మగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. వాసూను చదివిస్తూ ఉంటుంది. అతను ఆ పక్కనే ఉన్న 'పుంగనూరు'లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ ఉంటాడు.
వాసు స్నేహితులు లక్ష్మి .. రాకేశ్. ఎక్కడికి వెళ్లినా ముగ్గురు కలిసే వెళుతుంటారు. అదే కాలేజ్ లో కుమారి (షాజ్ఞ) చదువుతూ ఉంటుంది. వాసు బుద్ధిమంతుడు .. చదువులో టాపర్. అలాంటివాడు కుమారిని చూడగానే మనసు పారేసుకుంటాడు. ఆమెతో అతని పరిచయం ప్రేమగా మారుతుంది. తరచూ ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమె ప్రేమలో పడటం వలన, ఇంటిని గురించి వాసు పట్టించుకోడు.
కుమారి వేరే కుర్రాళ్లతో మాట్లాడటం .. కలిసి తిరగడం తాము చూశామని కొంతమంది చెప్పినా వాసు నమ్మడు. ఆ తరువాత ఒకటి రెండు మార్లు వాసు చూస్తాడు. ఆ విషయంపై వాసు మాట్లాడితే, తనని అనుమానిస్తున్నావంటూ ఆమె గొడవచేస్తుంది. దాంతో ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఆమెను గురించే ఆలోచన చేస్తూ, తల్లిని నిర్లక్ష్యం చేస్తాడు. కొడుకు బాధపడతాడని భావించి ఆమె కూడా తన అనారోగ్యాన్ని రహస్యంగా ఉంచుతుంది.
అనారోగ్యం బారిన పడిన శివమ్మకి ఆపరేషన్ అవసరమని డాక్టర్లు చెబుతారు. అందుకు అవసరమైన పాతిక వేలు అప్పుచేసి .. ఆ డబ్బును తెచ్చి ఇంట్లో పెడుతుంది. కుమారిని ఎక్కించుకుని రోజూ కాలేజ్ కి వెళ్లొచ్చనే ఉద్దేశంతో వాసు సెకండ్ హ్యాండ్ బైక్ కొంటాడు. అందుకోసం తల్లి దాచిన డబ్బును కాజేస్తాడు. ఫలితంగా ఏం జరుగుతుంది? వాసు జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? వారి ప్రేమకు ముగింపు ఏమిటి? అనేది కథ.
గ్రామీణ నేపథ్యంలో జీవితాలు .. కాలేజ్ చదువు కోసం టౌన్ కి వెళ్లొచ్చే స్టూడెంట్స్ .. ఆ దారి మధ్యలో జరిగే పరిచయాలు .. అవి ప్రేమగా మారే తీరు .. అలకలు .. బుజ్జగింపులు .. విషాదాలు .. ఇలా ఈ అంశాలతో కూడిన కథలు గతంలో చాలానే వచ్చాయి. వాటిలో సహజత్వానికి దగ్గరగా మలచబడిన కొన్ని కథలు మాత్రమే ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి .. అలరించాయి. అలాంటి ఒక కథగా వచ్చిన సినిమానే ఇది.
అది గవర్నమెంట్ జానియర్ కాలేజ్. చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చి చదువుకునే టీనేజ్ పిల్లలు. స్నేహితులతో కలిసి చేసే సందడి .. హడావిడితోనే ఈ కథ కూడా మొదలవుతుంది. శ్రీనాథ్ ఈ కథను చెప్పడం కోసం కొత్తవాళ్లనే ఎక్కువగా తీసుకున్నాడు .. కథను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లాడు. అందువలన తెలిసిన కథనే అయినా, పాత్రల చిత్రణ కారణంగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. కొత్త పిల్లలే అయినా బాగా చేశారు.
సినిమాను థియేటర్లోనో .. టీవీలోనో చూస్తున్నట్టుగా కాకుండా, మన ఇంటి కిటికీలో నుంచి చూస్తున్నట్టుగా ఉంటుంది. తన బడ్జెట్ లో దర్శకుడు ఈ మాత్రం అవుట్ పుట్ తీసుకు రావడం విశేషమే. కార్తీక్ బాణీలలో విజయ్ ఏసుదాసు పాడిన పాట బాగుంది. కమ్రాన్ అందించిన నేపథ్య సంగీతం కథకు తగినట్టుగా ఉంది. గ్రామీణ నేపథ్యంలోని లొకేషన్స్ ను నిఖిల్ సురేంద్రన్ తన కెమెరాలో నుంచి చూపించిన విధానం బాగుంది. కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ వర్క్ బాగానే ఉంది.
తక్కువ బడ్జెట్ లో .. ఎక్కువగా కొత్త ఆర్టిస్టులతో .. గ్రామీణ నేపథ్యంలో ఈ ప్రేమకథ తెరకెక్కింది. దర్శకుడు తాను ఎంచుకున్న కథా నేపథ్యానికి న్యాయం చేశాడు. ఎక్కడా ఎలాంటి సినిమాటిక్ దృశ్యాలు లేకుండా .. వాస్తవానికి దగ్గరగా తీసుకుని వెళుతూ యూత్ కి కనెక్ట్ చేశాడు. ఏదో ఊహించుకోకుండా టీవీల ముందు కూర్చునే యూత్ కి ఎమోషనల్ గా ఈ కథ కనెక్ట్ అవుతుంది. ఆకర్షణలో పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దనే సందేశం కూడా ఈ కథలో కనిపిస్తుంది.
'ప్రభుత్వ జూనియర్ కళాశాల' (ఆహా) మూవీ రివ్యూ!
| Reviews
Prabhuthva Junior Kalashala Review
- మరో ప్రేమకథా చిత్రంగా 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'
- కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరో హీరోయిన్లు
- సహజత్వానికి దగ్గరగా నడిచే కథ - పాత్రలు
- వినోదానికి సందేశాన్ని జోడించిన దర్శకుడు
Movie Name: Prabhuthva Junior Kalashala
Release Date: 2024-08-26
Cast: Pranav Singampali, Shagna, Ram Patas, Teja Goud, Mallika
Director: Srinath Pulakuram
Music: Karthik- Kamran
Banner: Black Ant Pictures
Review By: Peddinti
Prabhuthva Junior Kalashala Rating: 2.75 out of 5
Trailer