ఈ మధ్య కాలంలో కామెడీ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన సినిమాలలో 'OMG' (ఓ మంచి ఘోస్ట్) ఒకటి. వెన్నెల కిశోర్ - నందిత శ్వేత ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, శంకర్ కె మార్తాండ్ దర్శకత్వం వహించాడు. జూన్ 21వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి ఈ వారం అడుగుపెట్టింది. ఈ సినిమా ఎంతవరకూ భయపెడుతుందో .. ఎంతవరకూ నవ్విస్తుందో ఇప్పుడు చూద్దాం.
ఈ కథ 1970లో మొదలవుతుంది. ఒక జంట ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి, ఒక పాడుబడిన బంగ్లాకి తీసుకుని వస్తారు. తమకి లక్ష రూపాయలు ఇవ్వమని ఆ అమ్మాయి తండ్రిని బెదిరిస్తారు. అతను ఆ డబ్బు తీసుకుని వచ్చేలోగా, ఆ బంగ్లాలోని దెయ్యం ఆ ఇద్దరినీ చంపేస్తుంది. ఆ తరువాత ఈ కథ 2023లోకి అడుగుపెడుతుంది.
చైతన్య .. పావురం .. సీత .. లక్ష్మణ్ అనుకోకుండా పోలీస్ స్టేషన్ లో కలుసుకుంటారు. ఆ సమయంలోనే వాళ్లకి పరిచయం కలుగుతుంది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో సమస్య తలెత్తుతుంది. తామంతా కూడా డబ్బులేక అవస్థలు పడుతున్నామనే విషయాన్ని ఒప్పుకుంటారు. డబ్బు సంపాదిస్తే తప్ప, తమ చుట్టూ ఉన్న సమస్యల నుంచి బయటపడటం కష్టమని భావిస్తారు. అందుకోసం ఏం చేయాలా అనే ఆలోచనలో పడతారు.
తన మేనమామ వలన తనకి జరిగిన అన్యాయాన్ని గురించి చైతన్య ప్రస్తావిస్తాడు. అతను రాజకీయ నాయకుడనీ, అతని కూతురు కీర్తి (నందిత శ్వేత)ను కిడ్నాప్ చేద్దామని సలహా ఇస్తాడు. ఒకవేళ నేరం బయటపడితే తాను చూసుకుంటానని మిగతా వాళ్లకి మాట ఇస్తాడు. అందుకు మిగతావారు అంగీకరిస్తారు. ఒక పథకం ప్రకారం కీర్తిని కిడ్నాప్ చేస్తారు. 1970ల నాటి పాత బంగ్లాకు ఆమెను తీసుకొచ్చి అక్కడ బంధిస్తారు. తమకి 4 కోట్లు ఇస్తే ఆమెను వదిలిపెడతామని సదాశివరావుకు కాల్ చేస్తారు.
కీర్తిని ఒక దెయ్యం ఆవహించడం వలన కొన్ని రోజులుగా సదాశివరావు కుటుంబ సభ్యులు భూత వైద్యుడితో పూజలు చేయిస్తూ ఉంటారు. ఆ రోజున ఆ ప్రేతాత్మను బంధించకపోతే కీర్తికి ప్రమాదం జరుగుతుందని వాళ్లంతా ఆందోళన చెందుతుంటారు. ఆ విషయం కిడ్నాపర్లకు తెలియదు. కీర్తిలో ప్రేతాత్మ ఉండటం చూసిన ఆ బంగ్లాలోని దెయ్యం మరింత ఆగ్రహావేశాలకు లోనవుతుంది.
ఇక 'పిశాచపురం' నుంచి తమని వెతుక్కుంటూ బంగ్లాకి వచ్చిన వ్యక్తిని చూసి ఎందరో భయపడతారు. తన పేరు 'ఆత్మ' (వెన్నెల కిశోర్) అని అతను చెప్పడంతో మరింత భయపడి పోతారు. కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి దెయ్యమై వచ్చాడనే నిర్ధారణకి వస్తారు. కీర్తిని ఆవహించిన దెయ్యాన్ని బంధించడం కోసం భూతవైద్యుడు కట్టిన తాయత్తు ఊడిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? కీర్తిని ఆవహించిన ప్రేతాత్మ ఎవరు? ఆ బంగ్లాలో ప్రేతాత్మగా తిరుగుతున్నది ఎవరు? అనే అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి.
హారర్ కామెడీ జోనర్ లోని సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ తో .. పరిమితమైన పాత్రలతో రూపొందుతూ ఉంటాయి. అలాగే ఈ సినిమా కూడా ఒక బంగ్లా కేంద్రంగా నడుస్తుంది. ఆల్రెడీ ఒక ప్రేతాత్మ ఉంటున్న బంగ్లాకి, మరో ప్రేతాత్మ ఆవహించిన ఒక యువతి రావడమనేది ఈ కథలోని కొత్త పాయింట్. తాను క్షుద్రశక్తులను నేర్చుకున్నానననీ, ప్రేతాత్మలను వదిలించడం తెలుసుగానీ వాటిని బంధించడం తెలియదనే షకలక శంకర్ పాత్ర కామెడీ వైపు నుంచి కొంత వర్కౌట్ చేశారు.
ఇది సింపుల్ కంటెంట్ తో కూడిన సినిమా. కొత్త పాయింట్ ఉన్నప్పటికీ దానిని ఉత్కంఠభరితంగా ఆవిష్కరించడంలో విఫలమయ్యారు. వెన్నెల కిశోర్ పాత్రను ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తుంది. ఆండ్రు బాబు కెమెరా పనితనం .. వర్మ ఎడిటింగ్ ఓకే.
గతంలో చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన కొన్ని హారర్ కామెడీ సినిమాలు ఒక వైపున నవ్విస్తూ .. మరో వైపున భయపెడుతూ వెళ్లాయి. కానీ ఈ సినిమా విషయంలో అలాంటిదేం జరగలేదు. ఈ తరహా సినిమాలకి సౌండ్ ఎఫెక్ట్స్ .. కెమెరా వర్క్ చాలా కీలకం. ఈ కంటెంట్ విషయంలో అవి లోపించడం వలన ఈ సినిమా ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.
OMG - (ఆహా) మూవీ రివ్యూ!
| Reviews
OMG Review
- హారర్ కామెడీగా వచ్చిన 'OMG'
- ఆకట్టుకోలేకపోయిన కథాకథనాలు
- మెప్పించలేకపోయిన సన్నివేశాలు
- బలహీనంగా అనిపించే కంటెంట్
Movie Name: OMG
Release Date: 2024-08-16
Cast: Vennela Kishore, Nanditha Swetha, Shakalaka Shankar, Nagineedu
Director: Shankar K Marthand
Music: Anup Rubens
Banner: Market Networks
Review By: Peddinti
OMG Rating: 2.00 out of 5
Trailer