రవితేజ - హరీశ్ శంకర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రవితేజను ఎలా చూపించాలనేది హరీశ్ శంకర్ కి బాగా తెలుసు. అలాగే వాళ్లిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆడియన్స్ కి ఒక అవగాహన ఉంది. అందువలన అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూనే 'మిస్టర్ బచ్చన్' మూవీ ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా పరిచయమైన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ 1980లలో నడుస్తుందని అనుకోవాలి. బచ్చన్ (రవితేజ) ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతను చాలా సిన్సియర్. అవతల వ్యక్తి ఎలాంటి హోదాలో ఉన్నా తన పని తాను చేసుకుపోతుంటాడు. అలా ముక్కుసూటిగా వెళ్లడం వలన అతనీపై సస్పెన్షన్ వేటు పడుతుంది. దాంతో అతను తన సొంత ఊరైన 'కోటిపల్లి' వెళతాడు. గతంలో తనకి గుర్తింపు తీసుకొచ్చిన ఆర్కెస్ట్రాలో సింగర్ గా చేరిపోతాడు.
ఆ ఊరిపై ముత్యం జగ్గయ్య (జగపతిబాబు) పెత్తనం చేస్తూ ఉంటాడు. అతని లంకంత ఇంటివైపు చూడటానికి కూడా అందరూ భయపడుతూ ఉంటారు. అటు రాజకీయంలోను .. ఇటు రౌడీయిజంలోను అతను రాటుదేలిన వ్యక్తి. ముఖ్యమంత్రి వరకూ అతని ప్రభావం కొనసాగుతూ ఉంటుంది. అతని దుర్మార్గాలను పెద్ద తమ్ముడు సాంబ ఆచరణలో పెడుతూ ఉంటాడు. అలా అతను పెద్దమొత్తంలో డబ్బు కూడగడతాడు.
జగ్గయ్య దగ్గర అన్నిరకాల వ్యవహారాలను చూసుకునే ఉద్యోగి (సచిన్ ఖేడేకర్) కూతురే జిక్కీ (భాగ్యశ్రీ బోర్సే). ఆయనకి పాత పాటలంటే ఇష్టం .. అందువలన తన కూతురికి జిక్కీ అనే పేరు పెట్టుకుంటాడు. తొలి చూపులోనే బచ్చన్ ఆమె ప్రేమలో పడిపోతాడు. అప్పటి నుంచి ఆమె వెంటపడతాడు. ఇదే సమయంలో ఆ ఊళ్లోని దొరబాబు (సత్య) కూడా జిక్కీ కోసం ఆమె ఫ్యామిలీకి చేరువ కావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తనకి బచ్చన్ అడ్డుపడుతూ ఉండటాన్ని తట్టుకోలేకపోతుంటాడు.
బచ్చన్ తో తన కూతురు జిక్కీ ప్రేమలో పడిందనే విషయం ఆమె తండ్రికి తెలుస్తుంది. దాంతో అతను జిక్కీకి వేరొకరితో సంబంధాన్ని ఖాయం చేసే పనిలో ఉంటాడు. అందుకు బచ్చన్ అడ్డుపడతాడు. అదే సమయంలో అతనిపై సస్పెన్షన్ ఎత్తేస్తున్నట్టు కాల్ రావడంతో, అతనితో జికీ పెళ్లి జరిపించడానికి తండ్రి ఒప్పుకుంటాడు. దాంతో జిక్కీ హ్యాపీగా ఫీలవుతుంది.
తన పెళ్లి మరో నాలుగు రోజుల్లో ఉందనగా, బచ్చన్ డ్యూటీలో చేరతాడు. ఆ వెంటనే ముత్యం జగ్గయ్య ఇంటిపై తన టీమ్ తో రైడ్ చేస్తాడు. అప్పటికే తన తమ్ముడిపై చేయిచేసుకున్న వ్యక్తి కోసం జగ్గయ్య తన అనుచరులతో వెతికిస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా బచ్చన్ అక్కడ దిగుతాడు. అప్పుడు జగ్గయ్య ఏం చేస్తాడు? బచ్చన్ కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? జిక్కీతో అతని వివాహం అవుతుందా? అనేది మిగతా కథ.
ముత్యం జగ్గయ్య అన్ని రకాలుగా బలవంతుడు. అలాంటివాడితో పెట్టుకుంటే హీరో ఏమైపోతాడోనని ఆడియన్స్ టెన్షన్ లో ఉండగా ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఇక అక్కడి నుంచి అంచెలంచెలుగా కథ క్లైమాక్స్ దిశగా పరిగెడుతుంది. హరీశ్ శంకర్ కి ఒక కథలో ఏయే అంశాలను సర్దుతూ వెళ్లాలనేది బాగా తెలుసు. అయితే ఈ కథ విషయానికి వచ్చేసరికి, అటు రవితేజ -ఇటు హరీశ్ మార్క్ కి తగిన స్థాయిలో లేదనిపిస్తుంది.
రవితేజ .. భాగ్యశ్రీ బోర్సే .. జగపతిబాబు .. కమెడియన్ సత్య పాత్రలను హరీశ్ మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక మిగిలిన పాత్రలలో కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ వాళ్ల పాత్రలకి తగిన ప్రాధాన్యత కనిపించదు. ఇక ఘంటసాల .. కిశోర్ కుమార్ .. కుమార్ సాను పాటలను చొప్పించిన తీరు కొత్త అనుభూతిని ఇస్తుంది. అన్నపూర్ణమ్మ .. చమ్మక్ చంద్ర .. రోహిణి పాత్రలు అనవసరమైనవిగా అనిపిస్తాయి.
రవితేజ - భాగ్యశ్రీ మధ్య రొమాన్స్ ను హరీశ్ డిజైన్ చేసిన తీరు బాగుంది. అలాగే యాక్షన్ దృశ్యాలు కూడా అలరిస్తాయి. సత్య కామెడీ సీన్స్ మంచి వినోదాన్ని అందిస్తాయి. అయితే యాక్షన్ స్థాయిలో ఎమోషన్ కనెక్ట్ కాలేదు. రవితేజ ఎనర్జీ లెవెల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అలాగే జగపతిబాబు విలనిజం కూడా. ఇక భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే ఆమె ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఆకర్షణ అనే చెప్పాలి.
ఈ సినిమాను చూస్తున్న ప్రేక్షకులలో చాలామంది, భాగ్యశ్రీ మళ్లీ తెరపైకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తారు. అంతగా తన గ్లామర్ తో ఆమె ఆకర్షిస్తుంది. పాటల్లో మరింత అందంగా మెరిసింది. మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీ .. ఫిట్ నెస్ .. విశాలమైన కళ్లతో ఈ భామ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తరువాత ఆమె బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫొటోగ్రఫీ మెప్పిస్తుంది. మిక్కీ జె మేయర్ బాణీలు రెండు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ కూడా ఓకే. కథ రెగ్యులర్ ఫార్మేట్ లో ఉన్నప్పటికీ, హరీశ్ శంకర్ తనదైన స్టైల్లో చెబుతూ వెళ్లిన తీరు కూర్చోబెడుతుంది. అయితే హరీశ్ - రవితేజ కాంబినేషన్ నుంచి ప్రేక్షకులు ఆశించిన స్థాయికి కాస్త దూరంలో ఉండిపోయిందేమో అనిపిస్తుంది.
'మిస్టర్ బచ్చన్' - మూవీ రివ్యూ!
| Reviews
Mister Bachchan Review
- 'మిస్టర్ బచ్చన్' గా రవితేజ
- ఆకట్టుకునే యాక్షన్ .. రొమాన్స్
- గ్లామర్ తో కట్టిపడేసిన భాగ్యశ్రీ బోర్సే
- రవితేజ అభిమానులకు నచ్చే కంటెంట్
Movie Name: Mister Bachchan
Release Date: 2024-08-15
Cast: Raviteja, Bhagyashri Borse, Jagapathi Babu, Sachin Khedekar, Sathya
Director: Harish Shankar
Music: Mickey J Meyer
Banner: People Media Factory - T Series
Review By: Peddinti
Mister Bachchan Rating: 2.75 out of 5
Trailer