'దొరసాని' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కేవీఆర్ మహేంద్ర, 'భరతనాట్యం' అనే సినిమాను తెరకెక్కించాడు. ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అయితే పెద్దగా పబ్లిసిటీ లిపోవడం వలన, థియేటర్లకు ఈ సినిమా వచ్చి వెళ్లిన విషయం కూడా చాలామందికి తెలియదు. అలాంటి ఈ సినిమా ఈ నెల 27వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
సిటీలో దిల్ సుఖ్ నగర్ దివాకరం (హర్షవర్ధన్) లోకల్ గ్యాంగ్ లీడర్. తమ్ముడు రంగమతి ( టెంపర్ వంశీ) అధ్వర్యంలో తన అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తూ ఉంటాడు. తాము సరఫరా చేసే డ్రగ్స్ కి డాన్స్ కి సంబంధించిన పేర్లు పెట్టుకుని, ఆ సీక్రెట్ కోడ్ తో బిజినెస్ చేస్తుంటారు. ఎదురు తిరిగినవారిని అంతం చేసి, తమ స్థావరంలోనే ఆ బాడీలను దాచేస్తూ ఉంటాడు. దయాకరం చేసే అక్రమాలకు పోలీస్ ఆఫీసర్ శకుని (అజయ్ ఘోష్) సహకరిస్తూ ఉంటాడు. అతను చేసే నేరాలను బయటకి రాకుండా చూసుకుంటూ ఉంటాడు.
ఇక సినిమా డైరెక్టర్ కావాలనే ఆశతో రాజు సుందరం (సూర్యతేజ) హైదరాబాద్ వస్తాడు. అక్కడ అతనికి అభినయ (మీనాక్షి గోస్వామి) పరిచయమవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. సరైన ఉద్యోగమంటూ చేయకపోవడం వలన, రాజాను తన తల్లిదండ్రులకు పరిచయం చేయడానికి అభినయ భయపడుతూ ఉంటుంది. తన అన్నయ్య ద్వారా తల్లిదండ్రులను ఒప్పించాలనే ఆలోచనలో ఉంటుంది.
రాజు తాను తయారు చేసుకున్న కథలను చాలామంది నిర్మాతలకు వినిపిస్తాడు. ఒక్కొక్కరూ ఒక్కో వంక బెడుతూ ఉంటారు. దాంతో జనంలో నుంచి కథలు పుట్టాలని భావించి, జనం ఎక్కువగా కలిసి మాట్లాడుకునే ప్రదేశంలో ఒక రికార్డర్ వంటిది పెడుతూ వెళతాడు. ఆ తరువాత వాటిని సేకరించి .. ప్లే చేసి వింటాడు. ఫలానా ప్రదేశంలో 2 కోట్ల డీల్ జరుగుతున్న విషయం ఆ రికార్డర్ ద్వారా అతనికి తెలుస్తుంది.
రాజు తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె ఆపరేషన్ కి 8 లక్షల రూపాయలను రెడీ చేయవలసిన బాధ్యత రాజాపై పడుతుంది. ఉన్న కాస్త పొలం అమ్మేద్దామని తండ్రి కాల్ చేస్తాడు. దాంతో రాజా ఆలోచనలో పడతాడు. 2 కోట్ల డీల్ జరిగే ప్రదేశానికి వెళ్లి, తెలివిగా వాటిని కొట్టేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ డబ్బుతో తల్లికి ఆపరేషన్ చేయించవచ్చని భావిస్తాడు. తెలివిగా రంగమతి నుంచి ఆ బ్యాగ్ ను కాజేస్తాడు.
అయితే రంగమతి దగ్గర నుంచి కొట్టేసిన ఆ బ్యాగులో డ్రగ్స్ ఉండటం చూసి రాజు షాక్ అవుతాడు. ఆ డ్రగ్స్ ను డబ్బుగా ఎలా మార్చుకోవాలా అనే ఆలోచనలో పడతాడు. దివాకరం వేరే పార్టీకి అందజేయవలసి సరుకు అది. దాని కోసం ఆ గ్యాంగ్ అతనిపై ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంది. దాంతో దివాకరం అనుచరులు గాలిస్తూ ఉంటారు. మరో వైపున ఆ బ్యాగ్ పై పోలీస్ ఆఫీసర్ శకుని కన్ను కూడా పడుతుంది. రాజు పై అతనికి అనుమానం కూడా కలుగుతుంది. అప్పుడు రాజు ఏం చేస్తాడు? అతని కల నిజమవుతుందా? అనేది కథ.
ఇది చాలా చిన్న కథ .. తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా. రెండు గ్యాంగులు .. మధ్యలో ఒక పేమకథను ప్రధానంగా చేసుకుని సన్నివేశాలను అల్లుకున్నారు. ప్రేమజంట అనే పేరే తప్ప హీరో హీరోయిన్ల మధ్య లవ్ ఉండదు .. రొమాన్స్ కనిపించదు. ఇక రెండు గ్యాంగుల మధ్య గొడవ కూడా టెన్షన్ పెట్టేదిగా ఉండదు. ఆకతాయిగా .. అల్లర చిల్లరగా ఆ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. వీలైతే వాటా .. లేదంటే మొత్తం కొట్టేయాలనే శకుని రోల్ ను కూడా ఆశించిన స్థాయిలో మలచలేదు.
ఇక ఈ గ్యాంగులు తమ సప్లయ్ చేసే మత్తుపదార్థాలలో ఒక రకం మత్తు పదార్థానికి పెట్టుకున్న కోడ్ .. ఈ సినిమా టైటిల్. అది కూడా మనకి అంతగా ఎక్కదు.
హీరోకి ఇది మొదటి సినిమా .. అందువలన అతనిలోని తడబాటు తెలిసిపోతూనే ఉంటుంది. ఇక హీరోయిన్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. హర్షవర్ధన్ .. అజయ్ ఘోష్ .. టెంపర్ వంశీ .. విషయం ఉన్న ఆర్టిస్టులే. కానీ బలమైన కథ .. అందుకు తగిన సన్నివేశాలు .. పాత్రలను డిజైన్ చేసిన తీరు సరిగ్గా లేకపోయినప్పుడు వాళ్లు చేసేది కూడా ఏమీ లేదు. వైవా హర్షతో స్పూఫ్ కామెడీని అందించడానికి చేసిన ప్రయత్నం విఫలమైందనే చెప్పాలి.
వెంకట్ ఫొటోగ్రఫీ .. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం .. రవితేజ గిరిజాల ఎడిటింగ్ కంటెంట్ కి తగినట్టుగానే నడిచాయి. కంటెంట్ బలంగా .. ఇంట్రెస్టింగ్ గా ఉంటే, బడ్జెట్ గురించి ఆడియన్స్ పట్టించుకోరు. కానీ ఒక సినిమా స్థాయికి తగిన అవుట్ పుట్ లేకపోతే మాత్రం నిరాశపడతారు. దర్శకుడు కాస్త కసరత్తు చేసి ఉంటే, ఈ సినిమా ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ ను ఇవ్వగలిగేదేమో.
'భరతనాట్యం' (ఆహా) మూవీ రివ్యూ!
| Reviews
Bharatanatyam Review
- కొత్త హీరోతో 'భరతనాట్యం'
- కామెడీ డ్రామా జోనర్లో నడిచే కథ
- బలహీనమైన కథ
- పేలవమైన స్క్రీన్ ప్లే
- అంతగా ఆకట్టుకోని కంటెంట్
Movie Name: Bharatanatyam
Release Date: 2024-07-27
Cast: Suryateja, Meenakshi Goswami, Ajay Ghosh, Harshavardhan, Harsha Chemudu, Temper Vamsi
Director: KVR Mahendra
Music: Vivek Sagar
Banner: PR Films
Review By: Peddinti
Bharatanatyam Rating: 2.00 out of 5
Trailer