'రాజు యాదవ్' (ఆహా) మూవీ రివ్యూ!

Raju Yadav

Movie Name: Raju Yadav

Release Date: 2024-07-24
Cast: Getup Srinu, Ankitha Kharath, Anand Chakrapani, Mirchi Hemanth
Director:Krishnamachari
Producer: PrashanthRedy - Rajesh
Music: Harshavardhan Rameshwar
Banner: Sai VarunaviCreations
Rating: 2.00 out of 5
  • గెటప్ శ్రీను హీరోగా రూపొందిన 'రాజు యాదవ్'
  • మే 24న థియేటర్లకు వచ్చిన సినిమా
  • ఈరోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ 
  • బలహీనమైన కథాకథనాలు 
  • వినోదపరమైన అంశాలకు దూరంగా వెళ్లిన కంటెంట్

గెటప్ శ్రీనుకి బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తోనే ఆయన వెండితెరపై బిజీ అయ్యాడు. ఆయన హీరోగా చేసిన సినిమానే 'రాజు యాదవ్'. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, అంకిత ఖారత్ కథానాయికగా పరిచయమైంది. మే 24వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, తాజాగా 'ఆహా'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ అటు మహబూబ్ నగర్ లోను .. ఇటు హైదరాబాదులోను జరుగుతుంది. రాజు యాదవ్ మహబూబ్ నగర్ కి చెందిన యువకుడు. తండ్రీ .. తల్లి .. ఓ చెల్లి .. ఇది అతని కుటుంబం. డిగ్రీ పూర్తి చేయకుండా ఊళ్లో తిరుగుతూ, ఆటపాటలతోనే కాలం గడిపేస్తూ ఉంటాడు. అలాంటి రాజుకి ఓ రోజన క్రికెట్ బాల్ తగలడంతో అతని ఫేస్ దెబ్బతింటుంది. స్మైలింగ్ ఫేస్ వస్తుంది. సర్జరీ చేస్తే 4 లక్షల వరకూ అవుతుందని డాక్టర్లు చెబుతారు. 

కూతురు పెళ్లికి ఉండటంతో, సర్జరీ చేయించడానికి రాజు తండ్రి ఒప్పుకోడు. దాంతో అతని స్మైలింగ్ ఫేస్ చూసి, అంతా ఆటపట్టిస్తూ ఉంటారు. ఇక అమ్మాయిలు అతను తమ వైపు చూసి నవ్వుతున్నాడని అపార్థం చేసుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనే ఓ రోజున అతనికి స్వీటీ (అంకిత ఖారత్) తారసపడుతుంది. తొలిసారిగా ఆమెను చూడగానే అతను మనసు పారేసుకుంటాడు. మొదట్లో ఆమె కూడా అతణ్ణి అపార్థం చేసుకున్నప్పటికీ, ఆ తరువాత స్నేహం చేస్తుంది. 

ఆ తరువాత స్వీటీ హైదరాబాద్ కి వెళుతుంది. ఆమెను రోజూ చూస్తుండవచ్చనే ఉద్దేశంతో, రాజు క్యాబ్ డ్రైవర్ గా మారతాడు. ఒకసారి ఆమె బర్త్ డేకి ఖరీదైన కానుకను ఇస్తాడు. అప్పటి నుంచి ఆమె మరింత సాన్నిహిత్యంతో మెలుగుతుంది. తన బోయ్ ఫ్రెండ్ సంతోష్ చూస్తే బాగుండదని చెప్పి, కొన్ని రోజులకే రాజును దూరం పెడుతుంది. తనని ఆమె ప్రేమిస్తుందనీ .. పెళ్లి చేసుకుంటుందని భావించిన రాజు హర్ట్ అవుతాడు.

స్వీటీని మరిచిపోవాలంటే ఆ ఊరికి దూరంగావెళ్లిపోవాలని రాజు నిర్ణయించుకుంటాడు. దుబాయ్ వెళ్లడానికి తండ్రిని డబ్బు అడిగితే, పిల్ల పెళ్లి కోసం దాచిన డబ్బులను ఇస్తాడు. చివరిసారిగా స్వీటీని చూసి వస్తానని చెప్పి ఆమె ఆఫీసుకి వెళతాడు రాజు. అక్కడ ఏం జరుగుతుంది? అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేదే కథ. 

ఈ కథ యథార్థ సంఘటన ఆధారంగా అని చెప్పారు. కానీ ఇదేమీ అరుదైన సంఘటన కాదు. ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతూ ఉండటం చూస్తూనే ఉన్నాము. తన స్థాయికి మించిన యువతిని విలేజ్ లోని యువకులు ప్రేమించడం, తమకి దక్కకుండా పోయినందుకు మద్యానికి బానిసలు కావడం ఇటు బయట .. అటు సినిమాల్లోను చూస్తూనే ఉన్నాము. ఇక కొంతమంది యువతులు తమ విలాసాల కోసం లవర్స్ ను మార్చడం కూడా కామన్ అయిపోయింది. 

అలాంటి కథలను .. పాత్రలను చూస్తూ, ఇలా కూడా చేస్తారా? అని ఆడియన్స్ ఆశ్చర్యపోయే రోజులు పోయాయి. అయినా ఈ కథలో హీరోయిన్ తాను హీరోను గాఢంగా ప్రేమిస్తున్నట్టు నటించలేదు. మనిద్దరికీ సరిపడదు .. ఇది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అంటూ ఉంటుంది. సాఫ్ట్ వేర్ జాబ్ చేసే అమ్మాయి .. ఊళ్లో పనీ పాటా లేకుండా తిరిగే యువకుడిని ప్రేమిస్తుందని ఆడియన్స్ కూడా అనుకోరు. అందువలన ఆమె 'నో' చెప్పడం వలన ఆడియన్స్ వైపు నుంచి పెద్ద రెస్పాన్స్ ఏమీ రాదు.

హీరో - హీరోయిన్ .. ఎవరిని ఎవరు ఆరాధించినా అందులో ఫీల్ వర్కౌట్ చేయాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు మోసం చేసినా, అప్పటి వరకూ సాగే కథలో ఆ ఫీల్ ఉండవలసిందే. మోసపోయినవారికి ఎంత పెయిన్ ఉంటుందో .. అంతే పెయిన్ ఆ పాత్రను సపోర్టు చేసే ఆడియన్స్ కి ఉండాలి. అలా ఉండాలంటే ఆ ఇద్దరి మధ్య బలమైన సీన్స్ ఉండాలి. కానీ అలాంటివేం లేకుండా .. ఎలాంటి ట్విస్టులు గానీ .. మలుపులు గాని లేకుండా సాగిన కథ ఇది.

గెటప్ శ్రీను నటనకు వంకబెట్టలేం .. అలాగే హీరోయిన్ కూడా గ్లామరస్ గా కనిపిస్తుంది. ఇక రాజు యాదవ్ తండ్రి పాత్ర మినహా మరే బలమైన పాత్ర తెరపై కనిపించదు. ఇతర పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం .. ఎంతసేపు హీరో హీరోయిన్లను చూపిస్తూ వెళ్లడం ఒక మైనస్ గానే చెప్పుకోవాలి. ఫొటోగ్రఫీ .. బాణీలు .. నేపథ్య సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఇక ఎంత యథార్థ సంఘటనే అయినా, సినిమాకి సంబంధించిన వినోదపరమైన అంశాలను కలుపుకునే తెరపైకి రావాలనే విషయాన్ని మరిచిపోకూడదు. 

Trailer

More Reviews