ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్లోని వెబ్ సిరీస్ లకు క్రేజ్ పెరిగిపోయింది. ఈ జోనర్లోని కంటెంట్ ను అందించడానికి ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి. అలాంటి ఒక కంటెంట్ తో 'జియో సినిమా'వారు 'పిల్' అనే వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 12వ తేదీ నుంచి 8 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతోంది. రితేశ్ దేశ్ ముఖ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ పంజాబ్ లోని 'పాటియాల' నేపథ్యంలో మొదలై .. ఆ తరువాత ఢిల్లీ నేపథ్యంలో నడుస్తుంది. బ్రహ్మ గిల్ (పవన్ మల్హోత్ర) ఫార్మాస్యూటికల్ సంస్థను నిర్వహిస్తూ ఉంటాడు. ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా అతను మందులు తయారు చేసి మార్కెట్లోకి వదులుతూ ఉంటాడు. ఎటువంటి అనుమతులు లేకుండా క్లినికల్ ట్రైల్స్ నిర్వహిస్తూ ఉంటాడు. ఆ ట్రాకులో పనిచేసే అవినీతి అధికారులంతా అందుకు సహకరిస్తూ ఉంటారు.
బ్రహ్మగిల్ వెనుక ముఖ్యమంత్రి దిల్ బాగ్ ఉంటాడు. ఆయన తన కూతురు కీరత్ ను, బ్రహ్మ గిల్ కొడుకు ఏకమ్ కి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. అందువలన గిల్ ఏం చేసినా అందుకు సహకరిస్తూ ఉంటాడు. ఇక ఈ అవినీతికి మంచి అనుభవం ఉన్న బాసుదేవ్ తోడవుతాడు. ఆ సంస్థలో రీసెర్చ్ వింగ్ లో పనిచేసే ఆశిష్ ఖన్నా ఈ వ్యవహారమంతా పసిగడతాడు. అప్పటి నుంచి అతను ఆధారాలు సేకరించే పనిలో పడతాడు.
గిల్ సంస్థవారు డయాబెటిక్ పేషంట్ల కోసం ఒక కొత్త మెడిసిన్ ను తయారు చేస్తారు. ఢిల్లీ సమీపంలోని 'సీలంపూర్'లో నివాసముండే కొంతమంది పేదవారిపై ఆ మెడిసిన్ ను టెస్ట్ చేస్తారు. ఫలితంగా ఆ మందు వికటించి అనేక మంది అనారోగ్యం బారిన పడతారు. అదే సమయంలో 'మెడిసిన్ అధారిటి ఆఫ్ ఇండియా' ఘజియా బాద్ బ్రాంచ్ కి డాక్టర్ ప్రకాశ్ (రితేష్ దేశ్ ముఖ్) కి బదిలీ అవుతుంది. అక్కడికి రాగానే ఆయన గిల్ సంస్థలపై దృష్టిపెడతాడు.
ఆయన టీమ్ లో గురుసిమ్రత్ కౌర్ కూడా ఉంటుంది. ఒకసారి తాను గిల్ సంస్థకి తనిఖీలకు వెళ్లినప్పుడు, ఒక ముఖ్యమైన ఫైల్ తన కంటపడకుండా చేశారని ప్రకాశ్ తో సిమ్రత్ చెబుతుంది. ఆ ఫైల్ యువ జర్నలిస్టు ప్రకాశ్ కి దొరుకుతుంది. ఆ విషయం తెలుసుకున్న గిల్ మనుషులు అతని కోసం గాలిస్తూ ఉంటారు. నకిలీ మందుల వల్లనే తన తల్లి చనిపోవడంతో, ఆ జర్నలిస్ట్ ఆ ఫైల్ ను నిజాయితీ పరుడైన ప్రకాశ్ కి అందజేస్తాడు.
ఇక తమ సంస్థ వ్యవహారాలను ఆశిష్ ఖాన్ పసిగడుతున్నాడనే విషయాన్ని గిల్ దృష్టికి బాసుదేవ్ తీసుకుని వెళతాడు. అంతేకాదు నిజాయితీ పరుడైన ప్రకాశ్ కి ఖరీదైన కానుకల ఆశ చూపించి తమవైపు లాగాలని అనుకుంటాడు. అదే సమయంలో కేన్సర్ మందును కూడా లాంచ్ చేస్తున్నట్టుగా గిల్ ప్రకటిస్తాడు. అది మార్కెట్ లోకి వచ్చేలోగా, ఆ సంస్థను మూయించాలని ప్రకాశ్ .. సిమ్రత్ .. నూర్ నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? ఎలాంటి పరిణామలను ఎదుర్కొంటారు? అనేది మిగతా కథ.
ఈ సిరీస్ కి రాజ్ కుమార్ గుప్తా కథను అందించాడు. ప్రవీజ్ షేక్ - జైదీప్ యాదవ్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. కొన్ని ఫార్మాస్యూటికల్ సంస్థలలో సాగే చీకటి కోణాలను ఆవిష్కరించే ఈ కంటెంట్ పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. అలాగే ఇక కథనం కాస్త స్లోగా అనిపించినా, అది వెళ్లే గమ్యం ఆసక్తికరమైనదే కనుక బోర్ అనిపించదు. ప్రధానమైన పాత్రలన్నీ రిజిస్టర్ అవుతాయి .. కనెక్టు అవుతాయి.
ఫార్మాస్యూటికల్ సంస్థల మధ్య పోటీ .. మార్కెట్లో తమ మందులు మాత్రమే ఉండాలనే స్వార్థం . అందుకోసం సాగే వ్యూహాలు .. ప్రతి వ్యూహాలు .. అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని ఒక మాఫియా ప్రపంచాన్ని గుర్తుకు తెస్తాయి. ఇలాంటివారు మాత్రమే కాదు, తమ ప్రాణాలను పణంగా పెట్టే నిజాయితీపరులు కూడా మన మధ్యలో ఉన్నారనే విషయాన్ని ఈ కథ చెబుతుంది. కొంతమంది రాజకీయనాయకులు వైద్యం కోసం విదేశాలకి ఎందుకు వెళుతున్నారంటూ, కోర్టులో హీరో అడిగే ప్రశ్న ఆలోచింపజేస్తుంది.
ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా చాలా బాగా చేశారు. సుదీప్ సేన్ గుప్తా ఫొటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకి మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ సిరీస్ చూస్తుంటే, మనం చాలా సింపుల్ గా వేసుకునే టాబ్లెట్స్ వెనుక, ఇలాంటి ఒక కోణం ఉందా? అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత తతంగం జరుగుతుందా? అనే ఒక భయం తోడవుతుంది. ఎక్కడా అభ్యంతరకరమైన డైలాగ్స్ గానీ, సన్నివేశాలు గాని లేని ఈ సిరీస్ ను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
'పిల్' (జియో సినిమా) వెబ్ సిరీస్ రివ్యూ!
| Reviews
Pill Review
- రితేష్ దేశ్ ముఖ్ ప్రధాన పాత్రగా 'పిల్'
- ఫార్మాస్యూటికల్ సంస్థల చీకటి కోణమే నేపథ్యం
- బలమైన కథ
- ఆసక్తికరమైన కథనం
- ఆలోచింపజేసే కంటెంట్
Movie Name: Pill
Release Date: 2024-07-12
Cast: Ritesh Deshmukh, Pavan Malhotra, Anshul Chauhan, Akshath Chauhan, Farheen Amber, Sailaja Ramachandran
Director: Raj Kumar Guptha
Music: -
Banner: RSVP
Review By: Peddinti
Pill Rating: 3.50 out of 5
Trailer