సుధీర్ బాబు మొదటి నుంచి కూడా తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. సాధ్యమైనంతవరకూ తెరపై తాను కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'హరోం హర'. సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ సినిమాకి, జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. జూన్ 14వ తేదీన థియేటర్ లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ 1980లలో నడుస్తూ ఉంటుంది. 'కుప్పం'లో తమ్మిరెడ్డి (లక్కీ లక్ష్మణ్) మాటకి తిరుగులేదు. అతను చేసే అరాచకాలకు తమ్ముడు బసవరెడ్డి (రవి కాలే) కొడుకు శరత్ రెడ్డి ( అర్జున్ గౌడ) సహకరిస్తూ ఉంటారు. దేవాలయ భూములతో సహా వాళ్ల ఆక్రమణకు గురవుతాయి. పోలీస్ అధికారుల అండదండలు వారికే ఉండటం వలన, సామాన్యులు ఎవరికి ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఆ ఊరికి సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు) వస్తాడు.
'కుప్పం'లోని పాలిటెక్నిక్ కాలేజ్ లో అతను ల్యాబ్ అసిస్టెంట్ గా చేరతాడు. ఊళ్లో ఉన్న అతని తండ్రి (జయప్రకాశ్) ఓ తాగుబోతు. అతను చేసిన అప్పు తీర్చడం కోసమే సుబ్రమణ్యం కష్టపడుతూ ఉంటాడు. అదే కాలేజ్ లో టీచర్ గా పనిచేస్తున్న దేవి (మాళవిక శర్మ)తో సుబ్రమణ్యం ప్రేమలో పడతాడు. ఒకానొక సందర్భంలో అతను తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు. దాంతో కాలేజ్ యాజమాన్యం సుబ్రమణ్యాన్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తుంది.
ఆ ఊరు పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసిన పళని సామి (సునీల్), ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉంటాడు. అతనితో సుబ్రమణ్యానికి పరిచయం ఏర్పడుతుంది. కుప్పం .. ఆ చుట్టుపక్కల జరిగే గ్యాంగ్ వార్లపై .. ఆయుధాల అక్రమరవాణాపై పళని సామికి ఒక అవగాహన ఉంటుంది. అందువలన ఆయుధాలు తామే తయారు చేద్దామని చెబుతూ అతణ్ణి సుబ్రమణ్యం రంగంలోకి దింపుతాడు.
అలా ఇద్దరూ కలిసి 'గన్స్' .. 'బుల్లెట్స్' తయారు చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకు ఆ ఊరులో మూసేసిన ఒక పాత సినిమా హాలును ఎంచుకుంటారు. తమ్మిరెడ్డి గ్యాంగ్ కూడా వీళ్ల దగ్గరే ఆయుధాలు కొనడం మొదలుపెడుతుంది. మట్టి ఇటుకల ఫ్యాక్టరీని కొనుగోలు చేసిన సుబ్రమణ్యం, ఇటుకల మధ్యలో 'గన్స్' సప్లయ్ చేయడం మొదలుపెడతాడు. గన్స్ తయారీలో తమకి సుబ్రమణ్యం పోటీ వస్తున్నాడనే కోపంతో ముంబై గ్యాంగ్ రంగంలోకి దిగుతుంది.
తమ్మిరెడ్డి కొడుకు శరత్ రెడ్డి కారణంగా సుబ్రమణ్యం తండ్రి ప్రమాదంలో పడతాడు. ఆ ప్రమాదం నుంచి తన తండ్రిని కాపాడుకునే ప్రయత్నంలో శరత్ రెడ్డితో సుబ్రమణ్యం ఫైట్ చేస్తాడు. ఫలితంగా శరత్ రెడ్డి 'కోమా'లోకి వెళతాడు. ఈ విషయం తెలియగానే తమ్మిరెడ్డి తమ్ముడు బసవరెడ్డి ఆవేశంతో సుబ్రమణ్యంపై విరుచుకుపడతాడు. ఫలితంగా ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అప్పుడు తమ్మిరెడ్డి ఏం చేస్తాడు? సుబ్రమణ్యానికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనేది మిగతా కథ.
దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక తయారు చేసుకున్న ఈ కథలోను .. పాత్రలను డిజైన్ చేసిన తీరులోను కొన్ని లోపాలు కనిపిస్తాయి. బుద్ధిగా ఉద్యోగం చేసుకోవడానికి 'కుప్పం' వచ్చిన హీరో, ఆ ఉద్యోగం పోగానే, బ్రతకడానికి ఇక ఏ మార్గం లేదన్నట్టుగా తుపాకులు తయారుచేసే పనిని ఎంచుకోవడం, అందుకు సస్పెన్షన్ లో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ సహకరించడం, హీరో ఈ పని చేస్తున్నాడని తెలిసిన హీరోయిన్ అతణ్ణి వారించకపోగా, ఈ రోజుల్లో మంచివాళ్లుగా ఉండటం కరెక్టు కాదన్నట్టుగా మాట్లాడటం మరో విచిత్రం.
ఆయుధాల అక్రమ తయారీ .. అక్రమరవాణాలో కొడుకు చాలా దూరం వెళ్లిపోయిన తరువాత, ఇక చాల్లే అని తండ్రి సలహా ఇస్తే, పోనీలే ఇప్పుడైనా మంచి మాట చెప్పాడని అనుకుంటాం. కానీ ఆ తరువాత, 'ఆయుధమనేది బలవంతుడికి అవసరం .. మనలాంటి వారికి ఆయుధమే బలం .. దానిని నువ్వు వదలకు' అంటాడు. ఇలాంటి సంకేతాలతో ఈ కథ కొనసాగుతూ ఉంటుంది. ఇక హీరోపై ఎంతో కోపంగా ఉన్న పోలీస్ ఆఫీసర్ కిరణ్మయి, అతని విషయంలో మనసు మార్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవడం చిత్రంగా అనిపిస్తుంది.
అసలు విలన్ ను పక్కన పెట్టేసి .. విలనిజంలోను వారసుడైన కొడుకును వదిలేసి .. ఆ ఇద్దరి మధ్యలోని బసవరెడ్డి పాత్రను హైలైట్ చేయడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హీరోయిన్ పాత్రకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఇక మాఫియా నుంచి అన్నట్టుగా మధ్య మధ్యలో కొన్ని పాత్రలు దిగిపోయి హడావిడిచేస్తాయి. కాకపోతే అందులో ఎవరి పాత్రను హైలైట్ చేయాలో దర్శకుడు తేల్చుకోలేకపోయాడు. ఆ పాత్రలన్నీ మధ్యలోనే మాయమైపోతాయి.
అరవింద్ విశ్వనాథన్ ఫొటోగ్రఫీ .. చైతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఆయన స్వరపరిచిన బాణీలు మాత్రం కనెక్ట్ కావు. రవితేజ గిరజాల ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. సుధీర్ బాబు - రవికాలే పాత్రలపై తప్ప దర్శకుడు ఇతర పాత్రలపై దృష్టి పెట్టకపోవడం ఒక లోపంగా అనిపిస్తుంది. తండ్రీ కొడుకుల ఎమోషన్ చుట్టూ యాక్షన్ పెట్టినప్పటికీ, ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడంతో, హింస మాత్రమే మిగిలిపోయింది. అయితే విలన్ కంటే హీరోనే ఎక్కువ హింసకి పాల్పడటం ఈ సినిమాలోని కొసమెరుపు.
'హరోం హర' (ఆహా) మూవీ రివ్యూ!
| Reviews
Harom Hara Review
- సుధీర్ బాబు హీరోగా రూపొందిన 'హరోం హర'
- జూన్ 14న థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ రోజు నుంచి మొదలైన స్ట్రీమింగ్
- రొటీన్ గా అనిపించే కథాకథనాలు
- హింస .. రక్తపాతం ఎక్కువ
Movie Name: Harom Hara
Release Date: 2024-07-16
Cast: Sudheer Babu, Malvika Sharma, Sunil, Jayaprakash, Ravi Kale, Lakki Lakshman
Director: Gnanasagar Dwaraka
Music: Chaitan Bharadwaj
Banner: Sree Subrahmanyeshwara Cinemas
Review By: Peddinti
Harom Hara Rating: 2.50 out of 5
Trailer