'భారతీయుడు 2' మూవీ రివ్యూ!

Bharateeyudu

Movie Name: Bharateeyudu

Release Date: 2024-07-12
Cast: Kamal Haasan , Siddharth, Rakul Preet Singh, S J Suryah , Bobby Simha
Director:Shankar
Producer: Subaskaran
Music: Anirudh
Banner: Lyca Productoins
Rating: 3.00 out of 5
  • కమల్ కథానాయకుడిగా వచ్చిన 'భారతీయుడు 2'
  • ఆశించిన స్థాయిలో లేని కథ
  • ఉత్కంఠ భరితంగా సాగని కథనం 
  • బలహీనమైన బాణీలు 
  • చివర్లో మాత్రమే కనిపించే శంకర్ మార్క్     

కమల్ హాసన్ కథానాయకుడిగా గతంలో 'భారతీయుడు' సినిమా తీసి సంచలన సృష్టించిన శంకర్, ఆ సినిమాకి సీక్వెల్ గా  'భారతీయుడు 2' రూపొందించాడు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ రోజునే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకుందనేది చూద్దాం.

చెన్నైలో చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్) ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఉంటాడు. అతని స్నేహితులు హరి .. తంబేష్ .. ఆర్తి కూడా సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉంటారు. అందువల్లనే తమ కళ్ల ముందు జరుగుతున్న సంఘటనల పట్ల వెంటనే స్పందిస్తూ ఉంటారు. అవినీతి .. అపరిశుభ్రత .. లంచగొండితనం .. అధికార దుర్వినియోగం మొదలైన విషయాల పట్ల వాళ్లంతా చాలా అసంతృప్తికి లోనవుతారు. సమాజాన్ని చక్కదిద్దడానికి మరోసారి భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తారు. 

చిత్ర అరవిందన్ .. అతని స్నేహితులు భారతీయుడు మళ్లీ ఇండియాకి తిరిగి రావాలని సోషల్ మీడియా ద్వారా ఒక ఉద్యమానికే తెరతీస్తారు. దాంతో అప్పటివరకూ విదేశాలలో ఉన్న భారతీయుడు రంగంలోకి దిగుతాడు. తాను ఇండియా వచ్చినట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తాడు. దాంతో అవినీతిపరుల గుండెల్లో దడ మొదలవుతుంది. అతనిని ఎలా అడ్డుకోవాలా అనే ఆలోచనలో వాళ్లంతా ఉంటారు. 

సమాజంలో పెరుగుతున్న కలుపు మొక్కలను ఏరివేద్దామనీ .. అలాగే కుటుంబ సభ్యులు తప్పు చేసినా వారికి శిక్ష పడేలా చేయవలసిందేనని భారతీయుడు పిలుపునిస్తాడు. దాంతో అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్న తన తండ్రిపై చిత్ర అరవిందన్ .. తన తల్లిపై ఆర్తి .. తన బావపై తంబేష్ .. ఇలా అంతా కూడా తమ కుటుంబ సభ్యులు చేసే పనులపై నిఘా పెడతారు. చాలా ఇళ్లలో ఎవరో ఒకరు ఏదో ఒక తప్పు చేస్తూ మిగతావారికి దొరికిపోతుంటారు.

దాంతో ఆ కుటుంబాలలో మనఃశాంతి కరవవుతుంది. భారతీయుడి పట్ల ఒకరికి అభిమానం ఉంటే, మిగతావారు అతనికి శత్రువులుగా మారిపోతుంటారు. చిత్ర అరవిందన్ మిత్ర బృందానికి కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? పర్యవసానంగా ఏమౌతుంది? తన ఆశయ సాధనలో భారతీయుడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేది కథ. 

శంకర్ రాసుకున్న కథ ఇది. 'భారతీయుడు' ఇక ఇప్పుడు రంగంలోకి దిగవలసిందే అని మిగతా పాత్రలతో చెప్పించి, అందుకు అవసరమైన రంగాన్ని సిద్ధం చేయడానికి శంకర్ అరగంటకి పైగా సమయం తీసుకున్నాడు. భారతీయుడు ఇక తాను యాక్షన్ లోకి దిగుతున్నట్టుగా ప్రకటించే సమయానికి ఇంటర్వెల్ అవుతుంది. ఈ లోగా దర్శకుడు ప్రేక్షకుల ముందు చాలా సమస్యలు పెడతాడు. వాటన్నిటిని హీరో ఎలా పరిష్కరిస్తాడు? అనేది వాళ్లలో ఆసక్తిని రేకెత్తించే అంశం. 

ప్రభుత్వ ఉద్యోగాలను అర్హత లేనివారికి అమ్ముకోవడం .. లంచాలకు ఆశపడి భూములకు సంబంధించిన అనుమతులు ఇవ్వడం .. ప్రభుత్వ పథకాలు పేదవారికి చేరకుండా అడ్డుపడటం .. వారి ప్రాణాలు పోవడానికి కారకులు కావడం .. బాధ్యత లేకుండా కాలుష్యానికి కారణం కావడం .. ఇలాంటి సమస్యలన్నీ పెద్దవై హీరో రాకకోసం ఎదురు చూస్తుంటాయి. ఇక భారతీయుడు ఎప్పటికప్పుడు వాటిని ఎలా చక్కబెడుతూ వెళతాడు? ఫస్టు పార్టులో హీరోను పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమైన పోలీస్ ఆఫీసర్ కృష్ణస్వామి కొడుకు ప్రమోద్ (బాబీ సింహా), ఇప్పుడు తండ్రి గర్వపడేలా చేయగలుగుతాడా? లేదా? అనేవి ఆడియన్స్ ఎదురుచూసే అంశాలు.  

 'భారతీయుడు'లో మాదిరిగా కీలకమైన ఒకటి రెండు సమస్యలు తీసుకుని, వాటిని పరిష్కరించడానికి హీరో ట్రై చేయడం చూపిస్తే బాగుండేది. కానీ ఈ సారి ఎక్కువ సమస్యలను హీరో భూజాల మీద .. ఆడియన్స్ గుండెల మీద పెట్టేశారు. ఆ సమస్యలన్నిటినీ ఒకదాని తరువాత ఒకటిగా చూపిస్తూ వెళ్లడం వలన ఒక గందరగోళమైన వాతావరణం నెలకొంటుంది. అందుకు కారణమైన వారికి హీరో ముగింపు కార్డు వేసే సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. 

'భారతీయుడు' పాత్రకి ఒక స్థాయి ఉంటుంది .. ఆ స్థాయిని చివరివరకూ దర్శకుడు కాపాడుతూ వెళ్లవలసిందే. కానీ జనాలు ఆయనపై చెప్పులు .. చీపుర్లు .. రాళ్లు విసరడం వలన ఆ పాత్ర ఔన్నత్యం దెబ్బతింటుంది. ఇక మైనింగ్ కి సంబంధించిన శ్రీమంతుడిని చంపే ఎపిసోడ్ .. కమల్ ను పోలీస్ లు వెంటాడే ఎపిసోడ్ నిడివి దాటిపోయి కనిపిస్తాయి. భారతీయుడు లుక్ కూడా గతంలో మాదిరిగా ఇప్పుడు కుదరలేదేమో అనిపిస్తుంది. 

'భారతీయుడు' ఫస్టు పార్టులో ప్రతి పాత్రకి ఒక ప్రయోజనం కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో గుల్షన్ గ్రోవర్ .. ఎస్.జె.సూర్య పాత్రలను ఎందుకు క్రియేట్ చేశారనేది తెలియదు. బాబీ సింహా పాత్ర తేలిపోయింది .. బ్రహ్మానందాన్ని టీవీ ముందు కూర్చోబెట్టి ఒక్క షాట్ కి పరిమితం చేశారు. సిద్ధార్థ్ లవర్ గా రకుల్ ను భావించాలి. అందుకు సంబంధించిన దాఖలాలైతే మనకి కనిపించవు. అప్పట్లో 'భారతీయుడు' సినిమా ఓ మ్యూజికల్ హిట్. కానీ ఈ సినిమాలో గుర్తుపెట్టుకునే పాట ఒక్కటీ లేదు. 


లైకా ప్రొడక్షన్స్ వారి సినిమా గనుక, నిర్మాణ విలువలు నెక్స్ట్ లెవెల్లోనే కనిపిస్తాయి. రవి వర్మన్ ఫొటోగ్రఫీ బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. ప్రీ క్లైమాక్స్ లో మినహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కడా కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ విషయానికి వస్తే, ట్రిమ్ చేయవలసిన సీన్స్ కొన్ని కనిపిస్తాయి. పోలీసులు కమల్ ను ఛేజ్ చేయడం .. బంగారం పోగేసుకున్న బడావ్యాపారిని చంపడం .. ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకుంటున్న వ్యక్తిని చంపడం వంటి సీన్స్ సాగదీయడం .. కంటెంట్ లేని కామెడీ అసహనాన్ని కలిగిస్తాయి. 

'భారతీయుడు'లో కమల్ కి ఒక ఫ్యామిలీ ఉంటుంది .. ఆ ఫ్యామిలీ చుట్టూ కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇటు కుటుంబమా? అటు దేశమా? అని ఆలోచించుకునే ఒక విషమ పరిస్థితి హీరోకు ఎదురవుతుంది. ఆ ఎమోషన్స్ ఈ సినిమాలో మిస్సయ్యాయి. ఉన్న ఎమోషన్స్ కనెక్ట్ కాలేదు. కథాకథనాల పరంగా .. సంగీతం పరంగా ..  పాటల పరంగా ఈ సినిమా, గతంలో వచ్చిన 'భారతీయుడు'కి దూరంగానే ఆగిపోయిందని చెప్పాలి. 

ప్లస్ పాయింట్స్: భారీతనం .. కమల్ నటన 

మైనస్ పాయింట్స్ : ఎక్కువ సమస్యలు చూపించడం .. అనవసరంగా కనిపించే పాత్రలు కొన్ని ప్రాధాన్యత లేని పాత్రలు కొన్ని .. పాటల పరంగా అసంతృప్తి .. సాగతీత సన్నివేశాలు. 

Trailer

More Reviews