'హిట్ లిస్ట్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Hit List

Hit List Review

  • తమిళ యాక్షన్ థ్రిల్లర్ గా 'హిట్ లిస్ట్' 
  • అక్కడ మే 31న విడుదలైన సినిమా 
  • అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ 
  • ప్రీ క్లైమాక్స్ వరకూ ఆకట్టుకునే కథ 
  • అక్కడి నుంచి పట్టుతప్పిన కథనం

తమిళంలో ఈ ఏడాది విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమాలలో 'హిట్ లిస్ట్' ఒకటి. శరత్ కుమార్ .. విజయ్ కనిష్క .. గౌతమ్ మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, మే 31వ తేదీన థియేటర్లకు వచ్చింది. సూర్య కథిర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

చెన్నై లో విజయ్ (విజయ్ కనిష్క) ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. తండ్రి లేకపోవడంతో తల్లి - చెల్లి బాధ్యత అతనిపైనే ఉంటుంది. విజయ్ చాలా సాఫ్ట్ .. జీవహింసను ఏ మాత్రం తట్టుకోలేని స్వభావం తనది. ఒకానొక సందర్భంలో అతనికి ఏసీపీ (శరత్ కుమార్)తో పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. 

ఒక రోజున తన తల్లినీ .. చెల్లిని ఎవరో కిడ్నాప్ చేశారనీ, వాళ్లను కాపాడమని ఏసీపీని విజయ్ కోరతాడు. కిడ్నాపర్ పంపిన వీడియోను ఏసీపీకి చూపిస్తాడు. ఆ కిడ్నాపర్ మాస్క్ ధరించి ఉంటాడు. దాంతో ఆ కిడ్నాపర్ ను ఎలా పట్టుకోవాలనే విషయంపై ఏసీపీ వ్యూహ రచన చేయడం మొదలెడతాడు. విజయ్ ఎక్కడికి వెళ్లినా తెలియడం కోసం అతనికి ఒక బటన్ కెమెరా ఇస్తాడు. అలాగే అతని బైక్ కి జీపీఎస్ సెట్ చేయిస్తాడు. 

కిడ్నాపర్ ఫోన్ లో సూచనలు చేస్తూ ఉంటే, దాని ప్రకారం విజయ్ చేస్తూ వెళుతుంటాడు. అతని ఆదేశాల ప్రకారం పరిగెత్తలేక, తన ఫ్యామిలీని ఎందుకు ఇలా హింసిస్తున్నావని మాస్క్ మేన్ ను అడుగుతాడు. కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదని అతను సమాధానమిస్తాడు. అతను ఎవరో ఎందుకు ఇలా తమను నానా అవస్థలు పెడుతున్నాడో విజయ్ కి అర్థం కాదు. దాంతో అతను అయోమయంలో పడిపోతాడు. 

కిడ్నాపర్ చెబుతున్న ప్రకారం కాళీ ( గరుడ రామచంద్ర) స్థావరానికి విజయ్ వెళతాడు. కాళీ ఆ సిటీలో పెద్ద గ్యాంగ్ లీడర్. 36 హత్య కేసులు అతనిపై ఉంటాయి. రాజకీయనాయకులు .. పోలీస్ అధికారులు అతనిపేరు వింటే భయపడుతూ ఉంటారు. విజయ్ సమక్షంలోనే మాస్క్ మేన్ నుంచి కాళీకి వీడియో కాల్ వస్తుంది. తన తమ్ముడిని అతను కిడ్నాప్ చేయడం చూసి కాళీ షాక్ అవుతాడు. 

విజయ్ - కాళీ ఇద్దరూ కొట్టుకోవాలనీ, ఎవరు బ్రతికుంటే వాళ్ల మనుషులను వదిలేస్తానని మాస్క్ మేన్ చెబుతాడు. తమ వాళ్లను రక్షించుకోవడం కోసం ఇద్దరూ ఒకరి నొకరు చంపుకోవడానికి సిద్ధపడతారు. ఒక వైపున 36 హత్యలు చేసిన హంతకుడు. మరో వైపున జీవహింస మహాపాపమనే విజయ్. ఇద్దరూ కూడా తమని తాము రక్షించుకుంటూ, తమ వాళ్లను కాపాడుకోవడానికి రంగంలోకి దిగుతారు. 
 
మాస్క్ మేన్ ఎవరు? ఎందుకు అతను విజయ్ తల్లినీ చెల్లిని కిడ్నాప్ చేస్తాడు? విజయ్ ను అతను ఎందుకు టార్గెట్ చేస్తాడు?  ప్రమాదకరమైన కాళీ పైకి విజయ్ ను ఉసిగొల్పడంలో ఉద్దేశం ఏమిటి? కాళీతో పెట్టుకోవడం వలన, విజయ్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? తన తల్లినీ చెల్లిని విజయ్ రక్షించుకోగలుగుతాడా? అనేది మిగతా కథ.

దేవరాజ్ అందించిన కథ ఇది. చాలా సాధారణంగా మొదలయ్యే ఈ కథ, ఆ తరువాత వేగాన్ని పుంజుకుంటుంది. అక్కడి నుంచి చకచకా సన్నివేశాలు మారిపోతుంటాయి. కిడ్నాపర్ హీరోను పరుగులు తీయించడం .. హీరో వెనుక పోలీస్ డిపార్టుమెంటు పరుగులు పెట్టడంతో కథ ఉత్కంఠభరితంగా ముందుకు వెళుతూ ఉంటుంది. తాను హీరోను ఎందుకు టార్గెట్ చేసింది, ప్రీ క్లైమాక్స్ లో కిడ్నాపర్ చెబుతాడు. అప్పటివరకూ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది.

ఎప్పుడైతే కిడ్నాపర్ వైపు నుంచి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తారో, అక్కడి నుంచి కథలోని పట్టు సడలిపోవడం మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా కరోనా కాలంతో ముడిపడి ఉంటుంది. కరోనా పేషంట్లు .. హాస్పిటళ్లు .. ఆక్సిజన్ సిలెండర్లు .. మరణాలు .. ఇలా ఒక గగ్గోలు వాతావరణం ఉంటుంది. నిజానికి కరోనా సమయాన్ని తెరపై చూడటానికి ఆడియన్స్ ఇష్టపడటం లేదు. అది ఒక ఆందోళన కలిగించే అంశంగా మారిపోయింది. 

ఇక కరోనా ఎపిసోడ్ మొదలవగానే, విషయం ఏమిటనేది కొంతవరకూ ఆడియన్స్ కి అర్థమవుతుంది కూడా. చివర్లో ట్విస్ట్ ఉంటుంది .. అయితే అది ఆడియన్స్ గెస్ చేయలేని విధంగా ఉంటుంది. కానీ ఆ ఆశ్చర్యం ఎక్కువసేపు ఉండదు. ఇది సాధ్యమేనా? అనే ఒక ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. కరోనా ఫ్లాష్ బ్యాక్ .. క్లైమాక్స్ ఈ రెండు అంశాలపై ఇంకాస్త బెటర్ గా ఆలోచించి ఉంటే, ఈ సినిమా మరిన్ని మార్కులు కొట్టేసేదే.

పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అయితే ఆయన పాత్రను మరింత పవర్ఫుల్ గా డిజైన్ చేసి ఉండాలనిపిస్తుంది. హీరో విజయ్ కనిష్కతో పాటు, కీలకమైన పాత్రల్లో రామచంద్ర - గౌతమ్ మీనన్ మెప్పిస్తారు. ఫొటోగ్రఫీ .. సత్య నేపథ్య సంగీతం .. జాన్ అబ్రహం ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఈ కథను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు కొంతవరకూ మాత్రమే సక్సెస్ అయ్యాడని చెప్పాలి. 

Movie Name: Hit List

Release Date: 2024-07-10
Cast: Sarathkumar , Vijay Kanishka, Gautham Menon, Samuthirakani , Sithara, Munishkanth
Director: Soorya Kathir Kakkalla
Music: Sathya
Banner: RK Celluloids

Hit List Rating: 2.50 out of 5

Trailer

More Reviews