'మీర్జాపూర్ 3' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ!

Mirzapur

Mirzapur Review

  • 10 ఎపిసోడ్స్ గా వచ్చిన 'మీర్జాపూర్ 3'
  • బలమైన కథాకథనాలు
  • అనూహ్యమైన మలుపులు 
  • చివరి 3 ఎపిసోడ్స్ తో పుంజుకున్న కథ 
  • అక్కడక్కడా సాగదీసే సీన్స్ తో పెరిగిన నిడివి

అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇంతవరకూ పలకరించిన భారీ వెబ్ సిరీస్ లలో 'మీర్జాపూర్' ఒకటి. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సిరీస్, మొదటి సీజన్ లోను .. రెండో సీజన్ లోను ఆడియన్స్ వైపు నుంచి మంచి మార్కులు కొట్టేసింది. అప్పటి నుంచి అంతా కూడా సీజన్ 3 కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి సీజన్ 3 స్ట్రీమింగ్ అవుతోంది. 10 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్, మొదటి రెండు సీజన్లను మించి ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

రెండో సీజన్ ఏ విషయం దగ్గరైతే ఆగిపోయిందో, అక్కడి నుంచే సీజన్ 3 మొదలవుతుంది. గుడ్డూ భయ్యా (అలీ ఫజల్) గోలు (శ్వేత త్రిపాఠి) చేసిన దాడిలో గాయపడిన కాలీన్ భయ్యా ( పంకజ్ త్రిపాఠి)  కనిపించకుండా పోతాడు. అతను ఏమైపోయాడనేది ఎవరికీ తెలియదు. దాంతో గుడ్డూ  'మీర్జాపూర్' సింహాసనాన్ని దక్కించుకునే పనిలో పడతాడు. అంతకుముందుగా 'పూర్వాంచల్'పై పట్టు సాధించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తుంటాడు. 

ఇక శరద్ శుక్లా (అంజుమ్ శర్మ) కూడా 'మీర్జాపురం' సింహాసనం దిశగా అడుగులు వేస్తుంటాడు. అందుకు అవసరమైన బలగాన్ని కూడగట్టే దిశగా పావులు కదుపుతుంటాడు. ముఖ్యమంత్రిగా ఉన్న మాధురి (ఇషా తల్వార్) గుడ్డూ ఫ్యామిలీని ప్రమాదంలోకి నెట్టే పనులు మొదలుపెడుతుంది. అందులో భాగంగానే గుడ్డూ తండ్రి జైలు పాలవుతాడు. గుడ్డూను అంతం చేయించడానికి ఆమె ఐజీ దూబేను రంగంలోకి దింపుతుంది. 
  
ఇక గుడ్డూను అడ్డు తప్పించాలనుకున్న శరత్, భరత్ త్యాగి (విజయ్ వర్మ) సాయాన్ని కోరతాడు. గుడ్డూను .. గోలూను అంతం చేసే అదను కోసం భరత్ ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ లోకానికి తెలియకుండా అతను తన స్థావరంలోనే కాలీన్ భయ్యాను దాచి ఉంచుతాడు. కాలీన్ భయ్యాను అడ్డుపెట్టుకుని మీర్జాపూర్ సింహాసనాన్ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో శరత్ ఉంటాడు. భరత్ స్థావరం నుంచి తన ఇంటికి కాలీన్ ను తీసుకువెళ్లాలని అతను  నిర్ణయించుకుంటాడు. 

గుడ్డూపై ఉన్న పగను తీర్చుకోవడానికి శరత్ సాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి మాధురి అనుకుంటుంది. మీర్జాపూర్ పై పట్టు సాధించడానికి ఆమె అధికారం తనకి ఉపయోగ పడుతుందని శరత్ భావిస్తాడు. ఇలాంటి సమయంలోనే ఒక డీల్ మాట్లాడటానికి గుడ్డూ వేరే ప్రాంతానికి వెళతాడు. అతను లేని సమయంలో ఒంటరిగా ఒక ఆపరేషన్ లో గోలు పాల్గొంటుంది. అప్పటి నుంచి ఆమె జాడ తెలియకుండా పోతుంది. 

ఊరు నుంచి తిరిగొచ్చిన గుడ్డూకి గోలు రెండు మూడు రోజులుగా కనిపించడం లేదని తెలుస్తుంది. దాంతో అతను నేరుగా శరత్ ఇలాకాలో అడుగుపెడతాడు. గోలు కనిపించకుండా పోవడంలో తన ప్రమేయం లేదని శరత్ చెబుతాడు. మరి గోలు కనిపించకుండా పోవడానికి కారకులు ఎవరు? ఆమె ఆచూకీ తెలుసుకోవడం కోసం గుడ్డూ ఏం చేస్తాడు? అతణ్ణి లేపేయడానికి మాధురి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? చివరికి మీర్జాపూర్ సింహాసనం ఎవరికి దక్కుతుంది? అనేది కథ.

ఈ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్కో ఎపిసోడ్ నిడివి గంటలోపు ఉంటుంది. ఈ కథ చాలా విస్తృతమైనదనే విషయం రెండు సీజన్లను ఫాలో అయ్యేవారికి తెలిసే ఉంటుంది. కథ నాలుగు వైపులా నుంచి కొనసాగుతూ ఉంటుంది గనుక, పాత్రల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత.. ప్రయోజనం ఉండటం వలన, ప్రేక్షకులు మరిచిపోయే అవకాశం తక్కువ. 

మొదటి రెండు సీజన్లు చూసినవారు చాలా తేలికగానే మూడో సీజన్లోకి వెళ్లిపోతారు. మొదటిసారిగా ఈ సీజన్ ను మాత్రమే చూసేవారికి మాత్రం కథ అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. కథాపరంగా సన్నివేశాలు అనేక ప్రదేశాలకు షిఫ్ట్ అవుతూ ఉండటం అందుకు కారణమని చెప్పాలి. నిజానికి ఈ సిరీస్ కి స్క్రీన్ ప్లే వేయడం చాలాకష్టమైన విషయం. ఎక్కడా ప్రధానమైన పాత్రలను వదలకుండా, ప్రతి ఎపిసోడ్ లోను టచ్ చేస్తూ వెళ్లారు. 

7 ఎపిసోడ్స్ వరకూ కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీసినట్టుగా అనిపించినా, ఆ తరువాత 3 ఎపిసోడ్స్ మాత్రం స్పీడ్ అందుకుంటాయి. ఇక్కడి నుంచి చకచకా సన్నివేశాలు .. లొకేషన్స్ మారిపోతూ ఉంటాయి. ట్విస్టులపై ట్విస్టులతో కథ మరింత ఆసక్తికరంగా నడుస్తూ ఉంటుంది. క్లైమాక్స్ విషయంలో కూడా ఎవరికీ ఎలాంటి అసంతృప్తి ఉండదు. మరో సీజన్ కూడా ఉందనే హింట్ ఇచ్చేశారు.  

ప్రధానమైన పాత్రలను పోషించినవారంతా వారి పాత్రలకి న్యాయం చేశారు. నేపథ్య సంగీతం .. కెమెరా పనితనం .. ఎడిటింగ్ కథను నెక్స్ట్ లెవల్ కి తీసుకుని వెళతాయి. గుడ్డూ - శరత్ పాత్రలపై ఎక్కువ ఫోకస్ చేయడం .. ఆ పాత్రలలో ఆశించినస్థాయి పవర్ కనిపించకపోవడం .. రెండు సీజన్లలో చక్రం తిప్పిన త్రిపాఠి పాత్ర, ఈ సిరీస్ లో మంచానికే పరిమితం కావడం .. నిడివి కాస్త ఎక్కువగా అనిపించడం వలన, గతంలో వచ్చిన రెండు సీజన్లకు ఒక మెట్టు క్రిందనే ఈ సీజన్ కనిపిస్తుందని చెప్పాలి.

 ప్లస్ పాయింట్స్:
కథ .. స్క్రీన్ ప్లే .. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. ట్విస్టులు .. నటీనటుల నటన .. .. చివరిమూడు ఎపిసోడ్స్ .. క్లైమాక్స్.    

మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా అభ్యంతరకరమైన సంభాషణలు .. సన్నివేశాలు .. హింస .. రక్తపాతం ..  త్రిపాఠి పాత్రను నామమాత్రంగా చూపించడం. 


Movie Name: Mirzapur

Release Date: 2024-07-05
Cast: Pankaj Tripathi, Ali Fazal, Shweta Tripathi, Rasika Dugal, Isha Talwar, Vijay Varma, AnjumSharma
Director: Gurmeet Singh
Music: -
Banner: Excel Media Entertainment

Mirzapur Rating: 3.50 out of 5

Trailer

More Reviews