తమిళంలో ఐశ్వర్య రాజేష్ కి మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోల జోడీగాను .. నాయిక ప్రధానమైన కథలలోను నటిస్తూ ఆమె తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆమె నటించిన 'తీరా కాదల్' సినిమా, 2023 మే 26వ తేదీన అక్కడి థియేటర్ లకు వచ్చింది. ఆ తరువాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. రోహిన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
గౌతమ్ (జై) చెన్నైలో ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య వందన (శివద) కూతురు ఆర్తి ఇదీ అతని కుటుంబం. వందన కూడా ఒక సంస్థలో హెచ్ ఆర్ మేనేజర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఎలాంటి సమస్య లేకుండా వారి జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. ఒకసారి అతను కంపెనీ పనిమీద మంగుళూరు బయల్దేరతాడు. ట్రైన్ లో అతనికి శరణ్య (ఐశ్వర్య రాజేశ్) తారసపడుతుంది. కాస్త ఇబ్బంది పడుతూనే ఒకరినొకరు పలకరించుకుంటారు.
తాను మంగుళూరు వెళుతున్నట్టుగా శరణ్యతో గౌతమ్ చెబుతాడు. ఓ ముఖ్యమైన పనిమీద తాను కూడా మంగుళూరుకే వెళుతున్నట్టుగా శరణ్య చెబుతుంది. తన భార్య పిల్లలను గురించి గౌతమ్, తన భర్త ప్రకాశ్ గురించి శరణ్య ఒకరికొకరు చెప్పుకుంటారు. మంగుళూరు వెళ్లిన తరువాత కూడా ఇద్దరూ కలుసుకోవడం .. మాట్లాడుకోవడం .. కలిసి భోజనం చేయడం చేస్తుంటారు. అలా ఇద్దరూ కూడా చాలా సన్నిహితంగా మసలుకోవడం మొదలుపెడతారు.
కాలేజ్ రోజుల్లో గౌతమ్ - శరణ్య ప్రేమించుకుంటారు. అయితే వారి పెళ్లికి శరణ్య పేరెంట్స్ ఒప్పుకోరు. తన పేరెంట్స్ అడ్డుచెప్పడం వలన శరణ్య కూడా ధైర్యం చేయలేకపోతుంది. తల్లిదండ్రులు చూసిన ప్రకాశ్ ను పెళ్లి చేసుకుంటుంది. అతను మహా ఆవేశపరుడు .. తొందరపాటు మనిషి. ఒక రేంజ్ లో అతను శరణ్యను టార్చర్ పెడుతూ ఉంటాడు. అదే విషయాన్ని గౌతమ్ తో శరణ్య చెబుతుంది. ఆమె పరిస్థితి పట్ల అతను జాలిపడతాడు.
మంగుళూరు నుంచి చెన్నై కి వచ్చిన తరువాత కూడా గౌతమ్ ను శరణ్య మరిచిపోలేకపోతుంది. తన భర్త నుంచి విడిపోయి, గౌతమ్ ఫ్లాట్ కి ఎదురుగా ఉండే ఫ్లాట్ లో దిగుతుంది. గౌతమ్ ఇంట్లో ఉన్నా .. ఆఫీసులో ఉన్నా తరచూ కాల్ చేసి అతణ్ణి టెన్షన్ పెడుతూ ఉంటుంది. తన భార్య వందనకు తెలిస్తే ఏమౌతుందోనని గౌతమ్ సతమతమవుతూ ఉంటాడు. ఆమెకి అనుమానం రాకుండా ఉండటం కోసం నానా తంటాలు పడుతూ ఉంటాడు.
అయితే కొన్ని రోజులుగా గౌతమ్ ప్రవర్తనలో మార్పు రావడాన్ని వందన గమనిస్తుంది. ఆయన తన దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నాడనే విషయం ఆమెకి అర్థమవుతుంది. తాను తన భర్తను వదిలేసొచ్చాను గనుక, గౌతమ్ కూడా వందనను వదిలేసి తనతో ఉండాలని శరణ్య పట్టుపడుతుంది. ఇద్దరం కలిసి వందనకు నచ్చజెబుదామని ఒత్తిడి చేస్తుంది. అప్పుడు గౌతమ్ ఏం చేస్తాడు? ఫలితంగా ఏం జరుగుతుంది? అనేది కథ.
కాలేజ్ రోజుల్లో ప్రేమలో పడటమనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ నుంచి జీవితంలో కొంత దూరం వెళ్లిన తరువాత .. వివాహమై ఎవరి కుటుంబాలు వారివి అయిన తరువాత కాలేజ్ ప్రేమ అనేది ఒక అందమైన జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతే బాగుంటుంది. అలా కాకుండా ఆ ప్రేమను మళ్లీ దార్లో పెట్టాలని చూస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతానేదే ఈ సినిమా కథ. దర్శకుడు తాను తయారుచేసుకున్న ఈ కథను చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశాడు.
ఈ కథలో ప్రధానమైన పాత్రలు మూడే. అయినా ఎక్కడా బోర్ అనిపించకుండా .. మొదటి నుంచి చివరివరకూ ఆసక్తికరంగా కొనసాగుతుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. చాలా సహజంగా కథను నడిపిస్తూనే .. ఎక్కడ ఏ బ్యాంగ్ అవసరమో అక్కడ దానిని వేస్తూ వెళ్లడం వలన చివరివరకూ కూర్చోబెట్టేస్తుంది. ప్రియురాలికి .. భార్యకి మధ్యలో నలిగిపోయే ఒక యువకుడి కథ చాలామందికి కనెక్ట్ అవుతుంది.
ప్రధానమైన పాత్రలను పోషించిన ముగ్గురూ జీవం పోశారు. రియల్ లొకేషన్స్ ఈ కథకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. రవివర్మన్ ఫొటోగ్రఫీ .. సిద్ధూ కుమార్ నేపథ్య సంగీతం .. ప్రసన్న ఎడిటింగ్ ఈ కథకు మరింత బలాన్ని ఇచ్చాయి. ఆసక్తికరమైన కథాకథనాలు .. పాత్రలను తీర్చిదిద్దిన తీరు .. అనూహ్యమైన మలుపులు .. ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా ఇది.
'తీరా కాదల్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
| Reviews
Theera Kaadhal Review
- రొమాంటిక్ డ్రామాగా 'తీరా కాదల్'
- జై జోడీగా నటించిన ఐశ్వర్య రాజేశ్
- సహజత్వంతో ఆకట్టుకునే కథాకథనాలు
- ఆసక్తికరమైన మలుపులు
- ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా
Movie Name: Theera Kaadhal
Release Date: 2024-07-02
Cast: Jai, Aishwarya Rajesh, Shivada, Vriddhi Vishal, Amzath Khan
Director: Rohin Venkatesan
Music: Siddhu Kumar
Banner: Lyca Productoins
Review By: Peddinti
Theera Kaadhal Rating: 3.00 out of 5
Trailer