ఆశిష్ హీరోగా 'లవ్ మీ' సినిమా రూపొందింది. వైష్ణవి చైతన్య కీలకమైన పాత్రలో నటించిన ఈ సినిమా, మే 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. హర్షిత్ రెడ్డి - హన్షిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించాడు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కథలోకి వెళితే .. అర్జున్ (ఆశిష్) అతని సోదరుడు ప్రతాప్ (రవికృష్ణ) ఒక యూ ట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ ఉంటారు. అర్జున్ చేసే సాహసాల వలన .. కొన్ని ప్రయోగాల వలన ఆ ఛానల్ కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అర్జున్ ఎవరికీ భయపడడు .. దేనికీ వెనకడుగు వేయడు. ఎవరైనా ఒక పని చేయవద్దని అంటే, ఆ పని చేసే వరకూ నిద్రపట్టని స్వభావం అతనిది. తాను ఒక పని చేయాలనుకుంటే, అది చేసేవరకూ అతను ఎవరి మాటా వినిపించుకోడు.
ఈ నేపథ్యంలో అతను దెయ్యాలు లేవనే విషయాన్ని నిరూపిస్తూ, అవన్నీ మూఢనమ్మకాలనేది అందరికీ అర్థమయ్యేలా చెబుతూ ఉంటాడు. ఒక రోజున ప్రతాప్ ను అతని లవర్ ప్రియ (వైష్ణవీ చైతన్య) కలుసుకుంటుంది. మాటల సందర్భంలో దెయ్యాల ప్రస్తావన తీసుకొస్తుంది. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దులో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతుంది. అక్కడి ఒక అపార్టుమెంటులో 'దివ్యవతి' అనే దెయ్యం ఉందని అంటుంది. అపార్టుమెంటులో దెయ్యం ఉందని తెలియడంతో, అంతా ఖాళీ చేసి వెళ్లిపోయారనీ, దాంతో ఇప్పుడది పాడుబడిపోయిందని చెబుతుంది.
పాడుబడిన ఆ అపార్టుమెంటు వైపు ఎవరూ వెళ్లకపోవడం వలన, అదో అడవిని తలపిస్తూ ఉంటుందనీ, అప్పుడప్పుడు ఆ దెయ్యం అపార్టుమెంటు బాల్కనీలో ఉండటాన్ని కొంతమంది చూశారని చెబుతుంది. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన దివ్యవతి జీవితంపై కథలు రాయడానికి వెళ్లినవారు .. పరిశోధనల పేరుతో వెళ్లినవారు ఆ దెయ్యం చేతిలో చనిపోయారని అంటుంది. అది చాలా ప్రమాదకరమైన దెయ్యమని స్పష్టం చేస్తుంది.
ప్రతాప్ ద్వారా ఈ కథ విన్న అర్జున్, ఆ దెయ్యం ఉన్న ప్రదేశానికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఆ దెయ్యాన్ని చూడాలనీ .. ఆమెతో మాట్లాడాలని .. అవసరమైతే ఆమెతో రొమాన్స్ చేయాలని అనుకుంటాడు. ఈ విషయంలో ప్రతాప్ ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా, అర్జున్ ఒంటరిగా బయల్దేరి వెళతాడు. ప్రస్తుతం నిర్జన ప్రదేశంగా మారిపోయిన ఆ అపార్టుమెంటు దిశగా అతను వెళ్లడాన్ని అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నించి విఫలమవుతారు.
అర్థరాత్రి వేళ .. ఎవరూ లేని పాడుబడిన అపార్టుమెంటులోకి అర్జున్ అడుగు పెడతాడు. అక్కడ ఏం జరుగుతుంది? దెయ్యాలు లేవు .. ఒకవేళ ఉంటే ముగ్గులోకి దింపేద్దామని సిల్లీగా ఆలోచించిన అతనికి అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? దివ్యవతి గురించి అతను తెలుసుకునే నిజాలేమిటి? అతనికి దివ్యవతిని గురించి తెలిసేలా చేయడంలో ప్రియ ఉద్దేశం ఏమిటి? అనేది కథలో ఆసక్తిని పెంచే అంశాలు.
దర్శకుడు ఈ కథను 'రామచంద్రాపురంలో' అంటూ ఒక జంటకి సంబంధించిన కథను ప్రస్తావిస్తూ మొదలుపెట్టాడు. ఆరేళ్లుగా ఆ ఇంట్లో జరుగుతున్న సంఘటనలు .. ఆ ఇంటిపై ఊళ్లోవారికి అనేక అనుమానాలు .. భయాలను చూపిస్తూ ఈ కథ ముందుకు వెళుతూ ఒక చోట విరామం తీసుకుంటుంది. అక్కడి నుంచి దెయ్యం కథ అపార్టుమెంటులో మొదలవుతుంది. మొదటి కథకీ .. ఈ కథకి ఉన్న లింక్ గురించిన ఆలోచన చేస్తూనే ఆడియన్స్ ఫాలో అవుతూ ఉంటారు.
సాధారణంగా ఈ కథ లవ్ .. రొమాన్స్ ను టచ్ చేస్తూ, నిదానంగా హారర్ దిశగా అడుగులు వేస్తుందని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ ఈ కథ హారర్ తోనే మొదలవుతుంది. దెయ్యం నేపథ్యంతో కూడిన కథతోనే దర్శకుడు భయపెట్టే ప్రయత్నాలు చేస్తూ వెళతాడు. ప్రియ పాత్రలో వైష్ణవి ఎంట్రీ ఇచ్చిన తరువాతైనా, ఇక రొమాన్స్ దిశగా కథ వెళుతుందేమోనని ఆడియన్స్ అనుకుంటారు. కానీ ఎక్కడా ఆ ఊసే కనిపించదు.
ఫలానా బంగ్లాలో దెయ్యం ఉంది .. అక్కడికి వెళ్లినవారిని అది చంపేస్తుంది అనే చోటుకి హీరో వెళతాడు. ఎంత హీరో అయినా కొన్ని ఊహించని సంఘటనలకు అతను భయపడవలసిందే. ఎందుకంటే అది మానవ సహజం. కానీ ఈ సినిమాలో హీరో కొత్తగా గృహ ప్రవేశం చేసిన ఇంట్లో ఎంత కూల్ గా ఉంటాడో , అనేక మందికి దెయ్యం చంపిన ఆ ఇంట్లో అలా ఉంటాడు. హాయిగా కళ్లు మూసుకుని యోగా చేసుకుంటూ ఉంటాడు. కొత్త పెళ్ళాంతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతుంటాడు. ఇదే సహజత్వం నుంచి దూరంగా తీసుకుని వెళుతుంది.
ఫస్టాఫ్ విషయానికి వస్తే కథనం ఎలా ఉన్నా, ఏం జరుగుతుందనే విషయంలో ఒక క్లారిటీ ఉంటుంది. సెకండాఫ్ విషయానికి వచ్చేసరికి ఆ క్లారిటీ మిస్సవుతుంది. ఇక ఈ సినిమాకి ముందు వైష్ణవి తేజ చేసిన 'బేబి' భారీ విజయాన్ని అందుకుంది. రొమాన్స్ వైపు నుంచి ఆ సినిమాకి కావలసిన వసూళ్లను తెచ్చిపెట్టింది. అలాంటి ఆమె ప్రస్తావన ఫస్టాఫ్ లో చాలా సేపటి వరకూ లేకపోవడమే ఆడియన్స్ కి అసహనాన్ని కలిగిస్తుంది. సెకండాఫ్ లో ఆమె పాత్ర ప్రాధాన్యత పెరుగుతుంది గానీ, ఆమె గ్లామర్ వైపు నుంచి ఆడియన్స్ ఆశించేది మాత్రం తెరపై కనిపించదు. అసలు ఆమె కథానాయకుడి సోదరుడి లవర్ గా ఎంట్రీ ఇవ్వడమే ఆడియన్స్ కి మిగుడుపడదు.
నిర్మాణ విలువలకు వంకబెట్టవలసిన పనిలేదు. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి. కీరవాణి నేపథ్య సంగీతం ఈ సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చిందని అనాలి. సంతోష్ కామిరెడ్డి ఎడిటింగ్ ఓకే. ఈ సినిమాకి సంబంధించిన లైన్ బాగానే అనిపిస్తుంది. చివర్లో ట్విస్టులు కూడా బాగానే అనిపిస్తాయి. అయితే ఈ మధ్యలోని కథనే ఆడియన్స్ కి కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. హీరో మరీ సీరియస్ గా కనిపించడం .. వినోదం లోపించడం మైనస్ గా కనిపిస్తుంది.
'లవ్ మీ' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
| Reviews
Love Me Review
- ఆశిష్ హీరోగా రూపొందిన 'లవ్ మీ'
- ఆయన జోడీకట్టిన వైష్ణవి చైతన్య
- రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ జోనర్లో సాగే కంటెంట్
- కథలో కనిపించే గందరగోళం
- వినోదాన్ని జోడించలేకపోయిన డైరెక్టర్
Movie Name: Love Me
Release Date: 2024-06-14
Cast: Ashish Reddy, Vaishnavi Chaitanya, Ravi Krishna, Simran Choudhary,Rajeev Kanakala
Director: Arun Bhimavarapu
Music: Keeravani
Banner: Dil Raju Productions
Review By: Peddinti
Love Me Rating: 2.00 out of 5
Trailer