'యక్షిణి' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

Yakshini

Movie Name: Yakshini

Release Date: 2024-06-14
Cast: Vedika, Rahul Vijay, Manchu Lakshmi, Ajay
Director:Teja Marni
Producer: Shobhu Yarlagadda
Music: Priyadarshan Balasubramaniyan
Banner: Arka Media Works
Rating: 2.50 out of 5
  • వేదిక ప్రధానమైన పాత్రగా రూపొందిన 'యక్షిణి'
  • 6 ఎపిసోడ్స్ గా వచ్చిన సిరీస్ 
  • ఆసక్తిని పెంచలేకపోయిన కథాకథనాలు 
  • ఉత్కంఠకు దూరంగా నడిచే సన్నివేశాలు 
  • మెప్పించలేకపోయిన కంటెంట్ 

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై సోషియో ఫాంటసీ కథలకు మంచి క్రేజ్ ఉంది. ఈ తరహా కంటెంట్ ను చూడటానికి ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక హారర్ కంటెంట్ కి కూడా అంతే డిమాండ్ ఉంది. ఈ రెండు అంశాలను కలుపుతూ రూపొందిన వెబ్ సిరీస్ గా 'యక్షిణి' కనిపిస్తుంది. వేదిక ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ ను, 'బాహుబలి' నిర్మాతలు నిర్మించడం విశేషం. ఈ రోజు నుంచే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

అది 'అలకాపురి' అనే యక్షలోకం. ఆ యక్షలోకానికి చెందిన సౌందర్యవతి మాయ (వేదిక), తాంత్రికుడైన మహాకాళ (అజయ్) ప్రేమలో పడుతుంది. తన ద్వారా యక్షలోకానికి చెందిన ద్వారాన్ని తెలుసుకోవడం కోసం తనని ప్రేమిస్తున్నట్టుగా అతను నటిస్తున్నాడనే నిజాన్ని తెలుసుకోవడానికి ఆమెకి కొంత సమయం పడుతుంది. ఆ తరువాత ఆమె అతనికి దూరమవుతుంది. అయితే అప్పటికే ఆలస్యమైపోతుంది. 

యక్షలోకానికి సంబంధించిన నియమ నిబంధనలను పక్కన పెట్టినందుకు ఆమె కుబేరుడి ఆగ్రహానికి గురవుతుంది. మానవలోకంలోనే జీవించమని ఆయన ఇచ్చిన శాపం ఫలితంగా ఆమె వచ్చి భూమిపై పడుతుంది. జరిగిన దానికి ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. 100 మంది మానవులను చంపితే అప్పుడు ఆమెకి శాపవిమోచనం కలుగుతుందనీ, 'అలకాపురి'లో అడుగుపెట్టడానికి అర్హత లభిస్తుందని కుబేరుడు చెబుతాడు. 

ఇక అదే యక్ష లోకానికి చెందిన మరో యువతి జ్వాలాముఖి (మంచులక్ష్మీ) అలకాపురిలో తనకంటే సౌందర్యవతి ఉండకూడదనే అసూయతో ఆమె లావణ్య రసాన్ని దొంగిలిస్తుంది. ఫలితంగా కుబేరుడి ఆగ్రహానికి గురై ఆమె కూడా భూలోకానికి విసిరివేయబడుతుంది. అలా యక్షలోకానికి చెందిన మాయ - జ్వాలా ఇద్దరూ కూడా భూమి మీదకు వచ్చేస్తారు. ఈ విషయాన్ని తాంత్రికుడైన మహాకాళ (అజయ్) పసిగడతాడు.

మహాకాళ నాగజాతికి ప్రతినిధి. తన గురువైన 'నాగ' ద్వారా అతను అనేక తాంత్రిక విద్యలను అభ్యసించి ఉంటాడు. యక్షుల ద్వారా యక్షలోకం దారి తెలుసుకుని, ఆ లోకంపై పట్టు సాధించాలనేది అతని గురువు ఆలోచన. ఆ ప్రయత్నంలోనే అతను 'మాయ' చేతిలో మరణిస్తాడు. ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన మహాకాళ, అప్పటి నుంచి యక్షలోకానికి దారి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు.     
  
శాపవిమోచనం కోసం 'మాయ' ఒక్కొక్కరినీ చంపుతూ వెళుతూ ఉంటుంది. ఆ హత్యల గురించిన ఆనవాళ్లను పసిగడుతూ, మాయను బంధించే ప్రయత్నాల్లో మహాకాళ ఉంటాడు. మాయ అంతం చేయవలసిన 100వ వ్యక్తి బ్రహ్మచారియై ఉండాలి. చావుకు తెగించినవాడై ఉండాలి అనే నిబంధన ఉంటుంది. ఆ ఒక్క వ్యక్తిని చంపితే నేరుగా 'మాయ' తన లోకానికి వెళ్లిపోతుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి కృష్ణ (రాహుల్ విజయ్) తారసపడతాడు.

దాంతో కృష్ణను ముగ్గులోకి దింపే పనిలో పడుతుంది మాయ. అతణ్ణి నమ్మిస్తూ పెళ్లివరకూ తీసుకొస్తుంది. అదే సమయంలో జ్వాల కూడా అక్కడికి చేరుకుంటుంది. తాను మాయకి అత్తయ్యను అవుతానంటూ అక్కడివారిని పరిచయం చేసుకుంటుంది. తమ కోసం మహాకాళ వెదుకుతున్నాడనీ, అతను వచ్చేలోగా పని పూర్తిచేయమని మాయతో చెబుతుంది. అప్పుడు మాయ ఏం చేస్తుంది? కృష్ణను చంపాలనే ఆమె కోరిక నెరవేరుతుందా? తన లోకానికి చేరుకోవాలనే ఆమె ప్రయత్నం ఫలిస్తుందా అనేది మిగతా కథ. 

ఈ కథ నాలుగు ప్రధానమైన పాత్రలను కలుపుకుంటూ నడుస్తుంది. యక్షిణులుగా మాయ - జ్వాలా, మాయను ప్రేమించే కృష్ణ ..  ఆమెను బంధించాలనే పట్టుదలతో ఉన్న మహాకాళ .. ఈ నాలుగు పాత్రలలో కనిపిస్తారు. యక్షిణి 99వ వ్యక్తిని చంపడంతోనే ఈ కథ మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి 100వ వ్యక్తిని దొరకబుచ్చుకోవడానికి ఆమె చేసే ప్రయత్నాలు .. ఎదురయ్యే అవరోధాలుగా కథ నడుస్తూ ఉంటుంది.

ఈ కథ యక్షలోకంతో ముడిపడి నడుస్తుంది. కథ ఆరంభం .. ముగింపు ఈ రెండూ అక్కడ జరిగేవే. అందువలన యక్షలోకం సెట్ వేయడానికి ట్రై చేసి ఉంటే బాగుండేదేమో. అలా కాకుండా 'హంపీ' గోపురాన్ని చూపించి .. యక్షలోకం ద్వారం అన్నట్టుగా చూపించడం ఇబ్బంది పెడుతుంది. అలాగే సరైన ప్రోపర్టీస్ లేకుండా మరో పాత సెట్ చూపించడం నిరాశను కలిగిస్తుంది. ఇక ప్రధానమైన పాత్రల కాస్ట్యూమ్స్ కూడా అతకలేదు. 


యక్షిణి పాత్ర ఈ కథలో చాలా కీలకం. అలాంటి ఆమె పాత్ర ఇంట్రడక్షన్ చాలా సింపుల్ గా జరిగిపోతుంది. ఇక తాంత్రికుడిగా అజయ్ లుక్ కూడా మనకి అర్థం కాదు. ఖరీదైన బంగ్లాలో ఉంటూ .. యక్షిణిని బంధించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన బంగ్లాకి .. లుక్ కీ .. డైలాగ్స్ కి పొంతన ఉండదు. యక్షిణి 100వ హత్య చేయకుండా .. ఆమె అలకాపురికి వెళ్లకుండా ఆపాలనేది ఆయన ఆశయం. మరి అలాంటప్పుడు ఆమె 99 మందిని చంపేవరకూ ఈయన ఏం చేస్తున్నట్టు? అనే  డౌట్ రానివారు దాదాపుగా ఉండరు.

ఇక అప్పుడప్పుడు ఇటు యక్షిణులు .. అటు తాంత్రికుడు బిగ్గరగా అరవడం, గాల్లోకి ఎగరడం వంటి హడావిడి కనిపిస్తుంది. వీఎఫ్ ఎక్స్ కూడా గట్టిగానే సందడి చేశాయి. అయితే ఎటొచ్చి కథలోనే పట్టులేదు .. కథనంలోనే కొత్తదనం లేదు. సంభాషణలు కథా నేపథ్యానికీ .. పాత్రల  స్వభావానికి తగినట్టుగా లేవు. యక్షిణిని త్వరగా పట్టుకోవాలనే ఆతృత విలన్ లో .. ఆయన పట్టుకునేలోగా జంప్ కావాలనే కంగారు యక్షిణిలో ఎంతమాత్రం కనిపించవు. వాళ్లిద్దరికే లేని కంగారు మనకెందుకు అన్నట్టుగానే ప్రేక్షకుడు తాపీగా ఉంటాడు.

ఈ కథలో లవ్ ఉంది .. రొమాన్స్ ఉంది .. యాక్షన్ ఉంది .. ఎమోషన్ ఉంది. కాకపోతే వాటిలో జీవం తక్కువగా కనిపిస్తుంది. జగదీశ్ చీకటి ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ నేపథ్య సంగీతం అక్కడక్కడా నీరసంగా అనిపిస్తుంది. కార్తికేయన్ ఎడిటింగ్ ఫరవాలేదు. కంటెంట్ కి తగిన సెట్స్ .. పాత్రలను డిజైన్ చేయడం దగ్గర నుంచి కాస్త గట్టిగా కసరత్తు చేసి ఉంటే, ఈ సిరీస్ మరో మెట్టుపైన కనిపించేదేమో. 

Trailer

More Reviews