'మంజుమ్మల్ బాయ్స్' మూవీ రివ్యూ!

Manummel Boys

Manummel Boys Review

  • ఈ ఏడాది ఫిబ్రవరి 22న విడుదలైన సినిమా 
  • మలయాళంలో తిరుగులేని బ్లాక్ బస్టర్ గా రికార్డ్ 
  • తెలుగులో ఈ రోజునే థియేటర్లకు వచ్చిన సినిమా 
  • అడుగడుగునా ఉత్కంఠభరితం 
  • ఊపిరిబిగబట్టి చూసే సన్నివేశాలు 
  • నిజమైన స్నేహమంటే ఇదీ అని నిరూపించే యథార్థ సంఘటన

యథార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడం చాలాకాలం నుంచే వస్తోంది. అలా 2006లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా మలయాళంలో 'మంజుమ్మల్ బాయ్స్' సినిమా రూపొందింది. ఈ కథ 'గుణ కేప్స్'ను కేంద్రంగా చేసుకుని నడుస్తుంది. తమిళనాడులోని కొడైకెనాల్ లో కమల్ హాసన్ 'గుణ' సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అప్పటి నుంచి వీటికి 'గుణ కేవ్స్' అనే పేరు వచ్చింది. అంతకుముందు ఆంగ్లేయుల కాలంలో ఈ గుహలను 'డెవిల్స్ కిచెన్' గా పిలిచేవారు. ఆ గుహలో పడిపోయిన 16 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. అలాంటి గుహలో చిక్కుకున్న తమ స్నేహితుడిని కాపాడటానికి కొంతమంది కుర్రాళ్లు చేసిన ప్రయత్నమే ఈ సినిమా. 

కేరళలోని 'మంజుమ్మల్' ప్రాంతంలో ఓ 11 మంది స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. పెద్దయిన తరువాత కూడా వాళ్ల స్నేహం అలాగే ఉంటుంది. ఒక ఫంక్షన్ సందర్భంగా వాళ్లంతా కలుసుకుంటారు. సరదాగా 'కొడైకెనాల్' వెళ్లిరావాలని అనుకుంటారు. ఆ తరువాత ఒక రోజును ఫిక్స్ చేసుకుని కార్లో బయల్దేరతారు. కొడెకైనాల్ చూసిన తరువాత వారికి 'గుణ కేప్స్' ను కూడా చూడాలనే కోరిక కలుగుతుంది. 

అందరూ కలిసి 'గుణ కేవ్స్' దగ్గరికి చేరుకుంటారు. నిషేధిత ప్రాంతం వైపు వెళ్లవద్దని అక్కడ హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఉత్సాహంతో ఈ ఫ్రెండ్స్ పట్టించుకోరు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కంటపడకుండా ప్రమాదకరమైన గుహ దగ్గరికి వెళతారు. అక్కడ ఫొటో తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా, సుభాశ్ అనే అతను ఊహించని విధంగా అక్కడున్న పెద్ద బిలంలోకి జారిపోతాడు. పైకి చిన్న బిలంలా కనిపిస్తూ ఉన్నప్పటికీ, అది చాలా పెద్ద లోయ అనే విషయం ఆ తరువాత వాళ్లకి తెలుస్తుంది.   
   
సుభాశ్ చీకటి లోయలోకి జారిపోవడంతో మిగతా స్నేహితులంతా కంగారు పడిపోతారు. తలా ఒక వైపున పరిగెత్తి తమ స్నేహితుడిని కాపాడమని వేడుకుంటూ స్థానికుల సహాయాన్ని అర్థిస్తారు. అందులో పడినవారెవరూ ప్రాణాలతో బయటపడలేదని తెలిసి కన్నీళ్ల పర్యంతమవుతారు. ఇటు ఫారెస్టు డిపార్టుమెంటువారు .. అటు పోలీస్ డిపార్టుమెంటువారు ఎవరూ కూడా ఆ లోయలోకి వెళ్లడానికి ఒప్పుకోరు. స్థానికులకు ఆ లోయ గురించి తెలుసును గనుక, ఎవరూ ముందుకు రారు. 

సుభాశ్ ను రక్షించడం సాధ్యం కాదనీ, ఇక అక్కడి నుంచి అందరూ బయటికి వెళ్లవలసిందేనని పోలీస్ ఆఫీసర్స్ హెచ్చరిస్తారు.  సుభాశ్ స్నేహితులతో ఒకడైన సిజూ డేవిడ్ తాను లోపలికి వెళతానని ముందుకువస్తాడు. అక్కడి పోలీస్ ఆఫీసర్స్ అతనిని ఎంతగానో వారించినప్పటికీ అతను వినిపించుకోడు. దాంతో బలమైన త్రాడు తీసుకొచ్చి అతణ్ణి లోపలికి దింపుతారు. ఆ తరువాత ఏమవుతుంది? సిజూ డేవిడ్ కి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? అతని ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ. 

 చిదంబరం దర్శకత్వం వహించిన సినిమా ఇది. 2006లో జరిగిన ఒక సంఘటన .. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సష్టించింది. ఆ సంఘటనకి దృశ్య రూపాన్ని ఇస్తూ ఈ సినిమాను రూపొందించారు. స్నేహితుల కలయికతో సరదాగా మొదలైన ఈ సినిమా .. గుహలోని అగాధంలోకి ఒక స్నేహితుడు జారిపోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ స్నేహితుడిని బయటకి తీయడానికి మిగతా మిత్ర బృందం ప్రయత్నించడం .. అందుకు అడుగడుగునా ఎదురవుతూ వచ్చిన అడ్డంకులు ప్రేక్షకులను టెన్షన్ పెట్టేస్తాయి. 

దర్శకుడు చిదంబరం సామాన్యుడు కాదు. ప్రేక్షకులందరినీ తీసుకుని వెళ్లి ఆయన ఆ గుహ ముందు నిలబెట్టేశాడు. ఇక వాళ్లంతా ఊపిరి బిగబట్టి జరుగుతున్న తతంగాన్ని అలా చూస్తూ ఉండిపోతారు. థియేటర్లో ఏసీ రన్ అవుతున్నా చమటలు పట్టించాడు. స్నేహితుడిని కాపాడకుండా అక్కడి నుంచి కదిలేది లేదు .. అతను లేకుండా తిరిగి వెళ్లేది లేదు అంటూ, మిగతా స్నేహితులు వాననీరు గుహలోకి వెళ్లకుండా అడ్డంగా పడటం మనసును బరువెక్కిస్తుంది. 

అలాగే కొత్త ప్రదేశాలకి వెళ్లినప్పుడు అత్యుత్సాహానికి వెళ్లకుండా కాస్త వెనకా ముందు చూసుకుని మసలు కోవడం చేయాలి. నిషేధిత ప్రదేశంలోకి ఎప్పుడూ ప్రవేశించకూడదు అనే ఒక విషయాన్ని కూడా ఈ కథ స్పష్టం చేస్తుంది. ఆర్టిస్టులంతా తమ పాత్రలలో జీవించారు. సుశీన్ శ్యామ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. ప్రేక్షకులను సన్నివేశంలోకి తీసుకెళ్లి ఊపిరి బరువయ్యేలా చేశాడు. షైజు ఖలీద్ ఫొటోగ్రఫీ .. వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాగున్నాయి. 20 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 250 కోట్లవరకూ వసూలు చేసింది. అంతటి ఆదరణ పొందడానికి కారణం ఏమిటనేది ఈ సినిమా చూస్తేనే తెలుస్తుంది. 

Movie Name: Manummel Boys

Release Date: 2024-04-06
Cast: Soubin Shahir, Sreenath Bhasi, Balu Varghese, Ganapathi, Lal Jr. ,Deepak Parambol
Director: Chidambaram
Music: Sushin Shyam
Banner: Parava Films

Manummel Boys Rating: 3.50 out of 5

Trailer

More Reviews