కార్తీ కెరియర్లో 'ఖాకీ' చెప్పుకోదగిన సినిమా. ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఆయన తన విశ్వరూపం చూపించాడు. అలాంటి కార్తీ అందుకు పూర్తి భిన్నమైన 'ఖైదీ' పాత్రతో ఈ సారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో 'ఖైదీ'గా కార్తీ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించాడో, కథానాయికగానీ .. పాటలు గాని లేకుండా కార్తీ చుట్టూనే కథను తిప్పుతూ దర్శకుడు చేసిన ప్రయత్నం ఎంతవరకూ ఫలించిందో ఓసారి పరిశీలిద్దాం.
డిల్లీ (కార్తీ) జైల్లో పదేళ్ల పాటు శిక్షను అనుభవించి ఆ రోజున విడుదలవుతాడు. తన పదేళ్ల కూతురిని చూసుకోవాలనే ఆత్రుతతో, ఆ పాప వుంటున్న అనాథ శరణాలయానికి బయల్దేరతాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఆదిశంకరం (హరీశ్ ఉత్తమన్) అనే మాఫియా ముఠా నాయకుడికి చెందిన 900 కేజీల మాదకద్రవ్యాలు పోలీసుల చేతికి చిక్కుతాయి. ఆ డ్రగ్స్ ను వాళ్లు బ్రిటీష్ కాలంనాటి బంగ్లా అయిన ఎస్పీ ఆఫీస్ లో ఉంచుతారు. ఆ డ్రగ్స్ ను తిరిగి దక్కించుకోవడం కోసం .. వాటిని సీజ్ చేసిన అయిదుగురు పోలీస్ ఆఫీసర్స్ ను అంతం చేయడం కోసం ఆదిశంకరం మనుషులు రంగంలోకి దిగుతారు. వాళ్ల వ్యూహంలో చిక్కుకున్న పోలీసులు, తప్పనిసరి పరిస్థితుల్లో డిల్లీ సాయాన్ని కోరతారు. తమకి సహకరిస్తే .. అతని కూతురికి మంచి భవిష్యత్తు ఉండేలా చూస్తామని మాట ఇస్తారు. దాంతో పోలీసులకి సహకరించడానికి డిల్లీ అంగీకరిస్తాడు. పర్యవసానంగా చోటుచేసుకునే పరిణామాలతో మిగతా కథ నడుస్తుంది.
కథానాయిక గ్లామర్ లేకుండా .. పసందైన పాటలు లేకుండా .. భారీ తారాగణం లేకుండా .. కామెడీ సపోర్ట్ లేకుండా ఒక కథను మొదటి నుంచి చివరి వరకూ ఇంట్రెస్టింగ్ గా నడిపించడం, ప్రేక్షకులను కదలకుండా థియేటర్లో కూర్చోబెట్టడం అంత ఆషామాషీ విషయమేం కాదు. అలాగే కథ మొత్తం రాత్రివేళలో నడిచేలా ప్లాన్ చేసుకోవడం కూడా అంత తేలికైన పనేంకాదు. అలాంటి సాహసమే ఈ సినిమాతో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ చేశాడు. కథానాయిక .. పాటలు .. కామెడీ లేకపోయినా, అసలు వాటిని గురించిన ఆలోచన ప్రేక్షకులకు కలగకుండా చేయడంలోనే దర్శకుడిగా ఆయన సక్సెస్ ను సాధించాడు.
జైలు నుంచి విడుదలైన ఒక తండ్రి తొలిసారిగా కూతురును చూడటం కోసం పడే తాపత్రయం .. పోలీసులకి సహకరించే ప్రయత్నంలో ప్రాణాలుపోతే కూతురిని చూడలేనేమో అనే ఆందోళన .. తన కోసం ఎవరో వస్తున్నారని తెలిసి అనాథ శరణాలయంలో ఎదురుచూసే కూతురు .. 840 కోట్ల విలువచేసే డ్రగ్స్ ను దాచిన బంగ్లా (ఎస్పీ ఆఫీస్)కి కొత్తగా ట్రాన్స్ ఫర్ తో వచ్చిన మధ్య వయస్కుడైన ఒక కానిస్టేబుల్ మాత్రమే కాపలా. ఆ బంగ్లా పై భాగంలోని సెల్ లో కరడుగట్టిన నేరస్థులు .. ఓ కేసు విషయంపై అక్కడికి వచ్చి చిక్కుకుపోయిన ఓ అయిదుగురు కాలేజ్ స్టూడెంట్స్ .. పోలీస్ ఆఫీసర్స్ లో మాఫియా మనిషిగా ఒక ఇన్ ఫార్మర్ .. మాఫియా గ్యాంగ్ లో ఇన్ ఫార్మర్ గా ఒక పోలీస్ ఆఫీసర్ .. ఇలా ఈ త్రెడ్స్ అన్నింటిని కలుపుతూ ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తూ .. ఉద్వేగానికిలోను చేస్తూ లోకెశ్ కనగరాజ్ శభాష్ అనిపించుకున్నాడు.
ఇటీవల కార్తీ ఒక వేదికపై మాట్లాడుతూ, 'ఖాకీ' తరువాత తనకి ఆ స్థాయిలో 'ఖైదీ' పేరు తెచ్చిపెడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందనే చెప్పాలి. ఈ సినిమాలో ఓ ఆడపిల్ల తండ్రిగా .. ఓ ఖైదీగా ఆయన డిల్లీ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన లుక్ .. బాడీ లాంగ్వేజ్ ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి.
తన కోసం ఎదురుచూస్తున్న కూతురి దగ్గరికి చేరుకోవాలి .. ఈ లోగా తనపై నమ్మకం పెట్టుకున్న పోలీస్ ఆఫీసర్స్ ను రక్షించాలనే ఓ మానవతా దృక్పథం కలిగిన పాత్రలో ఆయన జీవించాడు. యాక్షన్ సీన్స్ లో దుమ్ము రేపేశాడు .. ఎమోషనల్ సీన్స్ లో మనసులను భారం చేశాడు. ఇక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నరైన్ .. ప్రాణాలను సైతం లెక్కచేయని సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ గా జార్జ్ మరియన్ నటన ఈ సినిమాకి హైలైట్. కార్తీ తరువాత ఎక్కువ మార్కులు దక్కేది వీరికే.
కథా కథనాలు ఈ సినిమాకి రెండు పిల్లర్లు అయితే, నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ మరో రెండు పిల్లర్లుగా చెప్పుకోవచ్చు. శ్యామ్ సీఎస్ సంగీతం .. సత్యన్ సూర్యం ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ప్రేక్షకులను కథలో భాగం చేసేంతగా కీలకమైన పాత్రను పోషించాయి. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ కూడా బాగుంది. అన్ని వైపుల నుంచి సన్నివేశాలను షార్ప్ గా కట్ చేస్తూ కథలో వేగాన్ని పెంచాడు. ఇక యాక్షన్ సీన్స్ కూడా సహజత్వానికి దగ్గరగా వుండి ఆకట్టుకున్నాయి. కథానాయిక - పాటలు లేకుండా దర్శకుడు చేసిన సాహసం .. కథ మొత్తాన్ని నైట్ ఎఫెక్ట్ లోనే చెప్పే ప్రయోగం ఫలించాయి. యాక్షన్ .. ఎమోషన్ తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమా, కార్తీ అభిమానులకే కాదు .. మిగతా ప్రేక్షకులకు సైతం నచ్చుతుందని చెప్పొచ్చు.
'ఖైదీ' మూవీ రివ్యూ
| Reviews
Khaidi Review
840 కోట్ల విలువ చేసే 900 కేజీల డ్రగ్స్ పోలీసుల చేతికి చిక్కుతుంది. ఆ డ్రగ్స్ ను తిరిగి చేజిక్కించుకోవడానికి మాఫియా గ్యాంగ్ రంగంలోకి దిగుతుంది. వాళ్ల ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు పోలీసులు డిల్లీ అనే ఒక ఖైదీ సాయం కోరతారు. తన కూతురిని కలుసుకోవడం కోసం వాళ్లకి సహకరించడానికి అంగీకరించిన ఆ ఖైదీ, చివరికి తన కూతురిని కలుసుకున్నాడా లేదా అనేదే కథ. బలమైన కథ .. ఆసక్తికరమైన కథనంతో ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
Movie Name: Khaidi
Release Date: 2019-10-25
Cast: Karthi, Narain, Ramana, George Maryan, Dheena, Harish Uthaman
Director: Lokesh kanagaraj
Music: Sam CS
Banner: Dream Warrior Pictures
Review By: Peddinti