ఈ మధ్య కాలంలో బోల్డ్ కంటెంట్ అనేది ఇటు సినిమాలను .. అటు వెబ్ సిరీస్ లను ఒక రేంజ్ లో ఆక్రమిస్తూ వెళుతోంది. అందుకు అవసరమైన అంశాలనే కథలుగా మలచుకుని రావడం కనిపిస్తోంది. బాలీవుడ్ నుంచి ఇలాంటి కంటెంట్ భారీగా దిగుమతి అవుతూ ఉండగా, తెలుగు సినిమాలు .. సిరీస్ లు కూడా ఆ దిశగా అడుగుల వేగాన్ని పెంచాయి. ఆ క్రమంలో వచ్చిన సినిమాగా 'మిక్స్ అప్'ను గురించి చెప్పుకోవచ్చు. ఆకాశ్ బిక్కి దర్శకత్వం వహించిన ఈ సినిమా, నిన్నటి నుంచే 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
అభి (కమల్ కామరాజు) నిక్కీ (అక్షర గౌడ) భార్యాభర్తలు. అభి పద్ధతి కలిగిన మనిషి .. అతనికి నిక్కీ అంటే ఎంతో ఇష్టం. అతను ప్రేమలో సున్నితత్వాన్ని కోరుకుంటాడు. అలాగే శృంగారం విషయంలోను. కానీ నిక్కీ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అది నచ్చని అభి ఆమెకి అభ్యంతరం చెబుతూ ఉంటాడు. దాంతో ఆమె అభిని తక్కువగా చేసి చూస్తూ ఉంటుంది. నలుగురిలో అవమానకరంగా ప్రవర్తిస్తూ ఉంటుంది.
ఇక సాహూ (ఆదర్శ్ బాలకృష్ణ) మైథిలి (పూజ జవేరి) భార్యాభర్తలు. పై జంటకు భిన్నంగా ఈ జంట కనిపిస్తూ ఉంటుంది. సాహూ తన భార్య నుంచి సెక్స్ ను మాత్రమే కోరుకుంటూ ఉంటాడు. సెక్స్ అనేది ప్రేమతో ముడిపడి ఉండాలనే మైథిలి మాటను అతను పట్టించుకోడు. పద్ధతిగా ఉండటం .. గౌరవంగా మసలు కోవడం అతనికి చేతకాదనే విషయం ఆమెకి అర్థమైపోతుంది. అతనికి ఎలాంటి ఎమోషన్స్ లేకపోవడం వారి మధ్య దూరం పెంచుతూ వెళుతుంది.
రెండు జంటలు కూడా వేరు వేరుగా సైకాలజిస్ట్ ను కలుస్తాయి. కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడపడం వలన, వారి ఆలోచనా విధానంలో మార్పు రావొచ్చనే సమాధానం లభిస్తుంది. దాంతో అనుకోకుండా ఈ రెండు జంటలు 'గోవా' వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటాయి. ఎవరి కారులో వారు 'గోవా' చేరుకుంటారు. ఈ ప్రయాణం కూడా అలకలు .. అసహనంతో నడుస్తుంది. గోవాకి వెళ్లిన తొలిరోజునే సాహుతో నిక్కీకి, అభితో మైథిలికి పరిచయం ఏర్పడుతుంది.
సాహూతో నిక్కీ పరిచయం ఎక్కడివరకూ వెళుతుంది? అది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది? తన భార్యను ఎంతగానో ప్రేమించే అభి ఏం చేస్తాడు? తన భర్త నుంచి ప్రేమానురాగాలను ఆశించడం అమాయకత్వమని గ్రహించిన మైథిలి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది? గోవా ప్రయాణం వారి జీవితాలను ఎలా మార్చివేస్తుంది? అనేది మిగతా కథ.
ఇది హైమా వర్షిణి అందించిన కథ. ఇది కొత్త కథేం కాదు గానీ, పరిమితమైన పాత్రలతో, చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పిన కథ. భార్యాభర్తల మధ్య అనేక విషయాల్లో అభిప్రాయభేదాలు ఉంటాయి. అభిరుచుల విషయంలోను మనస్పర్థలు తలెత్తుతూ ఉంటాయి. అయితే లవ్ - సెక్స్ అనే రెండు అంశాలను మాత్రమే ప్రధానంగా తీసుకుని దర్శకుడు ఈ కథను నడిపించాడు. లవ్ ని మాటల్లో వినిపించి, సెక్స్ ను సెన్సార్ పరిధిలోనే తెరపై చూపించే కంటెంట్ ఇది.
తన భర్తలో తగ్గిన లక్షణాలేవో వేరొకరి భర్తలో చూసి ఆకర్షణకి లోనయ్యేవారు ఒకరు. తన భార్య నుంచి తాను కోరుకున్న లక్షణాలు మరొక యువతిలో చూసి మోజుపడేవారు ఒకరు. ఆ జంటలో నుంచి ఒకరు .. ఈ జంటలో నుంచి ఒకరు కలిసి ఒక జంటగా ఏర్పడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా అనిపించవచ్చుగానీ, చాలామందికి ఇబ్బందికరంగా అనిపించే అవకాశమే ఎక్కువ. ఇది తప్పుకదా? అని ప్రశ్నించేవారు, ఇలాంటివారు లేకపోలేదు కదా? అనే సమాధానాన్ని ఎదుర్కోవలసిందే.
వయసులో ఉన్న రెండు జంటలు .. ఒక జంటలోని పురుషుడికి శృంగారపరమైన ఆవేశం ఎక్కువ. మరో జంటలోని యువతికి శృంగార పరమైన ఆలోచనలు ఎక్కువ. అందువలన క్లైమాక్స్ ఎలా ఉంటుందనే విషయాన్ని దాదాపుగా దగ్గరగా ఊహించుకుంటారు. ఇక ఇది బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా అని ముందుగానే తెలిసిపోతుంది గనుక, మొహమాటం లేకుండా చూసేవాళ్లే ఈ కథలో కాలు పెడతారు. శృంగారం మోతాదు కాస్త శ్రుతి మించినట్టు అనిపించినప్పటికీ, చివర్లో ఇచ్చే సందేశంతో కలుపుకుని సరిపెట్టుకోవలసిందే.
తిరుమలరెడ్డి - అమిరెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, కథకి తగిన నిర్మాణ విలువలు కనిపిస్తాయి. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. కౌశిక్ నేపథ్య సంగీతం .. దినేశ్ బాబు ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. సత్య ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది. ఎలాంటి మలుపులు .. ట్విస్టులు లేకుండా కథ సాదాసీదాగా నడుస్తుంది. రొమాన్స్ మాత్రమే ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుంది. 'పెళ్లి అంటే అర్థం చేసుకోవడమే కాదు .. అర్థం చేసుకోబడటం కూడా' అనే సందేశంతో ఈ కథకి ఎండ్ కార్డు పడుతుంది.
'మిక్స్ అప్' (ఆహా) మూవీ రివ్వ్యూ!
| Reviews
Mix Up Review
- బోల్డ్ కంటెంట్ తో వచ్చిన 'మిక్స్ అప్'
- ఆలుమగలైన రెండు జంటల చుట్టూ తిరిగే కథ
- ప్రధానమైన కథాంశంగా కనిపించే లవ్ - సెక్స్
- రొమాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన కంటెంట్
- కథాకథనాల్లో కనిపించని కొత్తదనం
Movie Name: Mix Up
Release Date: 2024-03-15
Cast: Kamal Kamaraju, Pooja Jhaveri, Aadsrsh Balakrishna, Akshara Gouda, Kamakshi Bhaskarla
Director: Akash Bikki
Music: Koushik
Banner: Sprint Films
Review By: Peddinti
Mix Up Rating: 2.75 out of 5
Trailer