కత్రినా కైఫ్ - విజయ్ సేతుపతి కాంబినేషన్ అనగానే, చాలామందిలో కథ ఏమై ఉంటుందనే ఒక ఆసక్తి కలిగింది. తమిళ - హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిసి, ఇతర తారాగణం కోసం గాలించారు. వీరిద్దరూ తప్ప వేరే స్టార్స్ ఎవరూ కనిపించలేదు. ఈ అంశం అందరిలో మరింత కుతూహలాన్ని పెంచింది. అలా మొదటినుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తూ వచ్చిన ఈ సినిమా, జనవరి 12వ తేదీన భారీస్థాయిలో విడుదలైంది. ఆ సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో అందుబాటులోకి వచ్చింది.
ఈ కథ .. 'ముంబై'ని 'బొంబాయి'గా పిలుచుకునే రోజుల్లో మొదలవుతుంది. కథలోకి వెళితే .. ఆ రోజున 'క్రిస్మస్' .. బొంబాయిలో ఎటు వైపు చూసినా అందుకు సంబంధించిన సందడి .. సంబరం కనిపిస్తూ ఉంటాయి. ఐదేళ్ల వయసున్న తన కూతురు 'యాని'తో కలిసి మరియా (కత్రినా) ఒక రెస్టారెంట్ కి వెళుతుంది. అక్కడే ఆమెకి అల్బర్ట్ ( విజయ్ సేతుపతి) తారసపడతాడు. అక్కడ జరిగిన ఒక సంఘటన వలన, వైవాహిక జీవితంలో ఆమె సంతోషంగా లేదనే విషయం అతనికి అర్థమవుతుంది.
మరియా ఒంటరిగానే ఇంటికి బయల్దేరడంతో, ఆమెకి తోడుగా అల్బర్ట్ కూడా వెళతాడు. పాపను నిద్ర పుచ్చిన తరువాత ఇద్దరూ సరదాగా అలా బయటికి వెళతారు. ఆ కాసేపటిలోనే వారిద్దరి మధ్య చనువు పెరుగుతుంది. తన భర్త జెరోమ్ (ల్యూక్ కెన్నీ) మంచివాడు కాదనీ, 'యాని' పుట్టిన తరువాత అతని నిజస్వరూపం తనకి అర్థమైందని మరియా చెబుతుంది. 'యాని'కి మాటలు రావనీ, అందుకు అవసరమైన ట్రీట్మెంట్ జరుగుతుందని అంటుంది. 'బేకరీ నడుపుతూ తాను జీవితాన్ని కొనసాగిస్తున్నానని చెబుతుంది.
తాను రోజీ (రాధిక ఆప్టే) అనే యువతిని ప్రేమించానని, అయితే ఆమె చనిపోయిందని అల్బర్ట్ చెబుతాడు. ఆమె కోసం కొన్న 'డైమండ్ రింగ్'ను చూపిస్తాడు. రోజీ పట్ల అతనికి ఇంకా ప్రేమ తగ్గలేదనే విషయం మరియాకి అర్థమవుతుంది. ఆ తరువాత ఇద్దరూ కలిసి మరియా ఇంటికి తిరిగొస్తారు. హాల్లోని కుర్చీలో తనభర్త శవం చూసి మరియా షాక్ అవుతుంది. అతని చేతిలో గన్ .. ఛాతి నుంచి కారుతున్న రక్తం చూసి ఇద్దరూ బిత్తరపోతారు.
జెరోమ్ ను హాస్పిటల్ కి తీసుకుని వెళదామని మరియా అంటే, అతను ఆల్రెడీ చనిపోయాడని అల్బర్ట్ అంటాడు. అయితే పోలీస్ లకు కాల్ చేయమని మరియా తొందరపెడుతుంది. ముందుగా చెప్పినట్టు తాను ఆర్కిటెక్ట్ కాదనీ, ఓ మర్డర్ కేసులో ఏడేళ్లు జైలు జీవితం గడిపి, ఆ రోజునే విడుదలయ్యానని అల్బర్ట్ చెబుతాడు. రోజీ చనిపోలేదనీ .. తానే చంపానని అంటాడు. ఆ మాటలకు మరియా ఉలిక్కిపడుతుంది. అప్పటివరకూ అతనితో గడిపినందుకు భయపడుతుంది.
పోలీస్ లు వచ్చే సమయానికి తాను అక్కడ ఉండకూడదనీ, అలా ఉంటే ఆమెనే చిక్కుల్లో పడుతుందని అల్బర్ట్ అంటాడు. ఈ విషయంలో తాను ఎలాంటి సాయం చేయలేనని చెబుతాడు. అప్పుడు మరియా ఎలా స్పందిస్తుంది? ఆ తరువాత ఏం చేస్తుంది? రోజీని అల్బర్ట్ ఎందుకు హత్య చేయవలసి వచ్చింది? జెరోమ్ ను హత్య చేసింది ఎవరు? ఈ హత్య కేసులో చోటుచేసుకునే మలుపులు ఎలాంటివి? అనేది మిగతా కథ.
శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. బాలీవుడ్ లో కత్రినాకి ఉన్న క్రేజ్ వేరు .. సౌత్ లో విజాయ్ సేతుపతికి ఉన్న ఇమేజ్ వేరు. అందువలన ఈ ఇద్దరూ ఈ సినిమాలో హీరో - హీరోయిన్స్ అయ్యుండరు అనే విషయాన్ని చాలామంది ఊహిస్తారు. ఆ ఊహకు తగినట్టుగానే నడిచే కథ ఇది. ఈ కథలో ఇద్దరివి ప్రధానమైన పాత్రలుగానే భావించవలసి ఉంటుంది. పరిస్థితులకు తగినట్టుగా ప్రవర్తించే పాత్రలుగానే అర్థం చేసుకోవలసి ఉంటుంది.
దర్శకుడు ఈ ఇద్దరి పాత్రలను ప్రధానంగా చేసుకునే ఈ కథను నడిపించాడు. ఆ తరువాత మరో నాలుగైదు పాత్రలు కాస్త ముఖ్యమైనవిగా కనిపిస్తాయంతే. ఎక్కడా ఎలాంటి కమర్షియల్ హంగులు మనకి కనిపించవు. క్రిస్మస్ పండుగ రోజున .. ఒక రాత్రిలో జరిగే సంఘటనల సమాహారమే ఈ కథ. కొన్ని సంక్షిప్త కథలు కొసమెరుతో ముగుస్తూ ఉంటాయి. అలాంటి ఒక ఫ్రెంచి కథకి దృశ్యరూపాన్ని ఇచ్చిన సినిమా ఇది.
ఈ కథలో చివర్లో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంటుంది. అప్పటివరకూ కథ నిదానంగా .. నింపాదిగా కొనసాగుతుంది. దాదాపు మొదటి గంటసేపు వరకూ కథలో ఎలాంటి కదలిక కనిపించదు. ఆ తరువాత కాస్త పుంజుకున్నప్పటికీ, అది ప్రేక్షకులలో కుతూహలాన్ని పెంచే స్థాయిలో ఉండదు. చివర్లో వచ్చే కొసమెరుపు కూడా కొంతమందికి అర్థం కావొచ్చు .. మరికొందరికి అర్థం కాకపోవచ్చు కూడా.
ఈ కథ ముంబైని 'బొంబాయి'గా పిలుచుకునే రోజుల్లో నడుస్తుంది గనుక, ఆ కాలానికి సంబంధించిన వాతావరణం .. కార్లు .. బస్సులు .. సినిమా థియేటర్లు .. పోస్టర్లు .. ల్యాండ్ లైన్ ఫోన్స్ .. కాస్ట్యూమ్స్ ను కథకి తగినట్టుగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. డేనియల్ జార్జ్ నేపథ్య సంగీతం .. మధు నీలకందన్ కెమెరా పనితనం .. పూజ ఎడిటింగ్ కథకి తగినట్టుగానే కనిపిస్తాయి. ఫస్టాఫ్ లో సాగతీత సహనానికి పరీక్ష పెడితే, సెకండాఫ్ లోని ట్విస్టులను కలుపుకుంటే కాస్త ఫరవాలేదనిపిస్తుంది.
'మెర్రీ క్రిస్మస్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ
| Reviews
Merry Christmas Review
- మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ
- సహనానికి పరీక్ష పెట్టే ఫస్టాఫ్
- పేలవమైన ఫ్లాష్ బ్యాక్ లు
- కథనంలో కనిపించని వేగం
- సెకండాఫ్ లో ట్విస్టులు ఓకే
Movie Name: Merry Christmas
Release Date: 2024-03-08
Cast: Katrina Kaif, Vijay Sethupathi, Radhika Apte, Radhika Sarathkumar
Director: Sriram Raghavan
Music: Daniel B. George
Banner: Tips Films - Matchbox Pictures
Review By: Peddinti
Merry Christmas Rating: 2.50 out of 5
Trailer