'బ్రీత్' (ఆహా) మూవీ రివ్యూ!

Breathe

Breathe Review

  • చైతన్యకృష్ణ హీరోగా చేసిన 'బ్రీత్'
  • డిసెంబర్ 2న థియేటర్లకు వచ్చిన సినిమా
  • నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • హాస్పిటల్లోనే నడిచే కథ 
  • ఎంటర్టైన్ మెంట్ లోపించిన కథ

నందమూరి చైతన్యకృష్ణ 20 ఏళ్ల క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం వలన, ఆ తరువాత మరో సినిమా చేయలేదు. మళ్లీ ఇంతకాలానికి ఆయన నుంచి మరో సినిమా వచ్చింది .. ఆ సినిమా ప్రేరే 'బ్రీత్'. డిసెంబర్ 2వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. నిన్నటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళితే .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్య వర్మ (కేశవ్ దీపక్) ఒక రోజున గోల్ఫ్ ఆడుతూ కుప్పకూలిపోతాడు. దాంతో వెంటనే అతణ్ణి 'బ్రీత్' అనే హాస్పిటల్ లో చేరుస్తారు. అదే సమయంలో బైక్ పై నుంచి పడిపోయిన అభి (చైతన్యకృష్ణ) కూడా అదే హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని గురించి ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ హెల్త్ బులిటెన్ కారణంగానే అభిలో అనుమానం తలెత్తుతుంది. 

అభి ఎంబీబీఎస్ మూడో ఏడాది వరకూ చదువుతాడు. ఆ తరువాత ఓ కారణంగా మానేస్తాడు. అందువలన ఏ మందు ఏ ట్రీట్మెంట్ కి వాడతారనే విషయంలో అతనికి అవగాహన ఉంటుంది. గతంలో తనతో పాటు కలిసి చదువుకున్న 'కడలి' (వైదిక) అదే హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె కారణంగా హాస్పిటల్లోనే రోజులు గడుపుతూ, అక్కడి డాక్టర్ల కదలికలపై దృష్టిపెడతాడు. ముఖ్యమంత్రి ట్రీట్మెంట్ కి సంబంధించి ఏం జరుగుతుందనేది రహస్యంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. 

ఆ హాస్పిటల్లో ఐదుగురు డాక్టర్లు ఒక జట్టుగా ఏర్పడి, వీఐపీ కేటగిరిలో వచ్చినవారి ప్రాణాలు తీసేస్తుంటారు. సహజంగానే వీఐపీ కేటగిరిలోనివారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. అలాంటి వీఐపీలు అనారోగ్యం బారిన పడేలా చేసి .. వారు తమ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యేలా చేసి .. వారి శత్రువుల నుంచి సుపారీ తీసుకుని చంపేస్తుంటారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తపడుతుంటారు.  

 ఒక పథకం ప్రకారం ముఖ్యమంత్రికి కొన్ని రకాల మందులను వాడుతూ, ఫలానా రోజున అతను బ్రెయిన్ డెడ్ తో చనిపోయేలా ఆ టీమ్ ప్లాన్ చేసిన విషయం అభికి అర్థమవుతుంది. ఈ మొత్తం  వ్యవహారంలో ఏయే డాక్టర్లు పాల్గొంటున్నారనేది తెలుసుకునే పనిలో పడతాడు. అది గమనించిన హాస్పిటల్ సిబ్బంది, డిశ్చార్జ్ పేరుతో అతణ్ణి బయటికి పంపించడానికి ప్రయత్నిస్తారు. అయితే కావాలని మెట్ల పై నుంచి పడిపోయి, మళ్లీ హాస్పిటల్లో కొనసాగేలా అభి చూసుకుంటాడు.

ముఖ్యమంత్రికి సంబంధించిన విషయాలపై అభి దృష్టిపెట్టాడని గ్రహించిన ఆ టీమ్, ముఖ్య మంత్రి కంటే ముందుగా అతణ్ణి లేపేయాలని నిర్ణయించుకుంటుంది. ఫలితంగా అభికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? ముఖ్యమంత్రిని రక్షించుకోవడానికి అతను ప్రయత్నించడానికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రిని డాక్టర్ల ద్వారా చంపించడానికి ప్లాన్ వేసింది ఎవరు? ఆ విషయం తెలుసుకున్న అభి ఏం చేస్తాడు? అనేది మిగతా కథ. 

ఈ సినిమాకి రచయితగా .. దర్శకుడిగా వంశీకృష్ణ ఆకెళ్ల వ్యవహరించాడు. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వెనుక జరిగే అరాచకం నేపథ్యంలో ఆయన ఈ కథను తయారు చేసుకున్నాడు. ముఖ్యమంత్రిని చంపడానికి ప్రయత్నించే ఒక టీమ్, అందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం ఇంటర్వెల్ బ్యాంగ్ గా వస్తుంది. ముఖ్యమంత్రి ప్రాణాలను కాపాడుకోవడానికి హీరో ఏం చేశాడనే సన్నివేశాలతో సెకండాఫ్ నడుస్తుంది. 

సమాజంలోని కొన్ని పెద్దతలకాయలు తమదారికి అడ్డొస్తున్నవారిని తప్పించడానికిగాను డాక్టర్లకు సుపారీ ఇవ్వడం .. డబ్బు పట్ల ఆశతో కొంతమంది డాక్టర్లు అందుకు ఒప్పుకోవడం వంటి ఒక కొత్త పాయింటును దర్శకుడు టచ్ చేశాడు. అయితే ముఖ్యమంత్రి .. హీరో .. విలన్  ఈ మూడు పాత్రలు హాస్పిటల్లోనే ఉంటాయి. కథ అంతా కూడా హాస్పిటల్లోనే నడుస్తూ ఉంటుంది. హాస్పిటల్ వాతావరణాన్ని టచ్ చేస్తూనే దర్శకుడు ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు. 

సాధారణంగా కథలో ఒకటి రెండు సీన్స్ హాస్పిటల్ నేపథ్యంలో ఉంటే చూస్తారుగానీ, కథ అంతా హాస్పిటల్ నేపథ్యంలోనే నడిస్తే ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తిని చూపించరు. ఎందుకంటే 100లో 90 మందికి హాస్పిటల్ వాతావరణం అంటే ఇష్టం ఉండదు. అంబులెన్స్ సౌండ్ వినడానికి ఇష్టపడనివారే ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. అందువలన ఈ కంటెంట్ కి ఆడియన్స్ కనెక్ట్ కావడం కష్టమే. ఇక కామెడీని కూడా హాస్పిటల్లోనే చేయించడానికి దర్శకుడు ట్రై చేశాడుగానీ, ఎంతమాత్రం పేలలేదు. 

కార్పొరేట్ హాస్పిటల్లో చాపక్రింద నీరులా జరిగే అరాచకమే ఈ కథ. హీరో తాను రక్షించాలనుకున్న వ్యక్తి కోసం పేషంట్ గా మారతాడు. అందువలన హీరో కండబలం చూపించే ఛాన్స్ లేదు. ఈ చీకటి నెట్ వర్క్ నడిపే అసలు విలన్, క్లైమాక్స్ వరకూ బయటికి రాడు. వచ్చిన తరువాత సీన్స్ ను ఫాస్ట్ ఫార్వార్డ్ లో లాగించారు. అందువలన ఆడియన్స్ లో కనిపించే అసంతృప్తి ఎక్కువ. మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం .. రాకేశ్ హోసమణి ఫొటోగ్రఫీ కథకి తగినట్టుగానే అనిపిస్తాయి. కథలో ఏ విషయాన్నయితే దాచాలో .. ఆ విషయాన్ని ముందుగానే చెప్పకుండా ఉంటే, ఈ సినిమా ఇంకాస్త బెటర్ గా అనిపించేదేమో. 

Movie Name: Breathe

Release Date: 2024-03-08
Cast: Chaitanya Krishna, Vaidika, Keshav Deepak, Vennela Kishore
Director: Vamsi Krishna Akella
Music: Mark. K Robin
Banner: Basava Tarakam Creatoins

Breathe Rating: 2.00 out of 5

Trailer

More Reviews