'సప్తసాగరాలు దాటి సైడ్ బీ' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Saptha Sagaralu Daati Side B

Saptha Sagaralu Daati Side B Review

  • కన్నడలో రూపొందిన ప్రేమకథా చిత్రం 
  • అక్కడ మంచి వసూళ్లను రాబట్టిన కథ 
  •  ఆద్యంతం నడిచే ఆసక్తికరమైన కథనం
  • లవ్ ఫీల్ ను వర్కౌట్ చేసిన సీన్స్
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి సైతం నచ్చే సినిమా

కన్నడ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమకథలలో, యూత్ కి బాగా కనెక్ట్ అయిన  సీక్వెల్ గా 'సప్తసాగరాలు దాటి సైడ్ బీ' నిలిచింది. రక్షిత్ శెట్టి - రుక్మిణీ వసంత్ - చైత్ర ఆచార్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, నవంబర్ 17వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులోకి వచ్చింది. కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ ఎలా అనిపించిందనేది ఇప్పుడు చూద్దాం. 

'సప్తసాగరాలు దాటి సైడ్ ఎ' కథలో మనూ - ప్రియా ఇద్దరూ ప్రేమించుకుంటారు. తమ అభిరుచికి తగినట్టుగా బ్రతకడానికి అవసరమైన డబ్బు కోసం చేయని నేరాన్ని తనపై వేసుకుని మనూ జైలుకి వెళతాడు. అయితే డబ్బు ఇస్తామని చెప్పిన ప్రభు అండ్ టీమ్ అతణ్ణి మోసం చేస్తారు. దాంతో అతనికి పదేళ్ల పాటు శిక్ష పడుతుంది.  శిక్షా కాలం పూర్తయిన తరువాత మనూ (రక్షిత్ శెట్టి) జైలు నుంచి విడుదలవుతాడు. ప్రియ ( రుక్మిణీ వసంత్) ఎక్కడ ఉందనేది తెలుసుకోవడం కోసం రంగంలోకి దిగడంతో సెకండ్ పార్టు మొదలవుతుంది. 

ప్రియ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాల్లోనే అతను సురభి (చైత్ర ఆచార్) అనే వేశ్యకి దగ్గరవుతాడు. ఆమె సాయంతోనే ప్రియా ఆచూకీ తెలుసుకుంటాడు. తన కలలు .. ఆశలు .. ఆశయం చంపుకుని  ప్రియ చాలా ఇరుకైన ఇంట్లో నివసిస్తూ ఉండటం అతను తట్టుకోలేకపోతాడు. ప్రియ భర్త దీపక్ ఒక హోటల్ నడుపుతూ ఉంటాడు .. వారి సంతానమే పునీత్. ప్రియ సంతోషంగా లేదనీ, అందుకు కారణం హోటల్ బిజినెస్ లో వాళ్లు పెద్దమొత్తంలో నష్టపోవడమేనని ప్రియ తమ్ముడు వినోద్ ద్వారా తెలుసుకుంటాడు.

ఒక స్నేహితుడిగా ప్రియ భర్త దీపక్ కి చేరువై, అతనికి మానసిక ధైర్యాన్ని ఇస్తాడు. తనకి డబ్బు ఇస్తానని మోసం చేసిన శ్రీమంతులను బెదిరించి, తనకి రావలసిన డబ్బును వసూలు చేస్తాడు. తన స్నేహితుడు ప్రకాశ్ ద్వారా ప్రియ ఫ్యామిలీకి సాయం చేస్తూ, ఆమె కోరుకున్న జీవితానికి చాలా దగ్గరగా తీసుకుని వెళతాడు. అలాగే తనతో సహజీవనాన్ని కొనసాగిస్తున్న సురభిని కూడా ప్రేమతో చూసుకుంటూ ఉంటాడు. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్న సమయంలో, మనూపై పగతో రగిలిపోతున్న సోమా ( రమేశ్ ఇందిర) ఎంట్రీ ఇస్తాడు.

సోమా కారణంగా మనూకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అతని కారణంగా వచ్చే ప్రమాదాలను మనూ ఎలా ఎదుర్కొంటాడు? మనూ జైలు నుంచి వచ్చిన విషయం ప్రియకి తెలుస్తుందా? గాయనిగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆమె కోరిక నెరవేరుతుందా?  గతంలోని వారి ప్రేమ వ్యవహారం దీపక్ దగ్గర బయటపడుతుందా? మనూను నమ్ముకుని వచ్చిన సురభికి చివరికి మిగిలేదేమిటి? అనే మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.

రక్షిత్ శెట్టి నిర్మించిన ఈ సినిమాకి, హేమంత్ రావు దర్శకత్వం వహించాడు. కథా రచనలో ఆయన భాగస్వామ్యం కూడా ఉంది. ఒక వైపున హీరో ... ఒక వైపున హీరోయిన్ .. మరో వైపున వేశ్య పాత్ర ..  ఇంకో వైపున రౌడీ గ్యాంగ్. ఈ నాలుగు వైపుల నుంచి కథ ఆసక్తికరంగా నడుస్తూ ఉంటుంది. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ ను కూడా కనెక్ట్ చేస్తూ, సన్నివేశాలు తమతో పాటు ఆడియన్స్ ను తీసుకుని వెళుతూ ఉంటాయి. ఏ ట్రాక్ లోను సినిమా టిక్ డ్రామా ఉండదు. వాస్తవాలకు దగ్గరగా కథ నడుస్తూ ఉంటుంది. 

సాధారణంగా ప్రేమించిన యువతికి తాను దూరమైనప్పుడు .. ఆమెకి మరొకరితో వివాహమైనప్పుడు .. తిరిగి ఆమెకి చేరువ కావడానికే చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఆమె ఫ్యామిలీ వైపు నుంచి ఉన్న లోపాలను .. బలహీనతలను అవకాశంగా తీసుకుని తిరిగి ఆమె లైఫ్ లోకి ఎంటరవుతూ ఉంటారు. కానీ అలా కాకుండా ఆమె మనసు తెలిసి ఉండటం వలన, ఆమె కోరుకున్న జీవితాన్ని అజ్ఞాతంగా అందించే నిస్వార్థపరుడైన ప్రేమికుడి కథగా దీనిని మలిచిన తీరు మంచి మార్కులను కొట్టేస్తుంది. 

లవ్ స్టోరీస్ అంటే హీరో .. హీరోయిన్స్ మధ్య మంచి డ్యూయెట్స్ ఉండాలని ఆడియన్స్ భావిస్తారు. కానీ ఈ కథలో పాటలకు అవకాశం లేదు .. అందువలన ఫ్లాష్ బ్యాక్ లో నుంచి దర్శకుడు ఒక పాటను తీసుకున్నాడు. అయినా ఎక్కడా కూడా పాటలు లేవనే ఆలోచన రాదు. ఎందుకంటే పాటలు ఆవిష్కరించే ఫీల్ ను సన్నివేశాలే వర్కౌట్ చేస్తుంటాయి. అక్కడక్కడా సున్నితమైన భావోద్వేగాలు తొంగిచూస్తుంటాయి. 

రక్షిత్ శెట్టి .. రుక్మిణీ వసంత్ .. చైత్ర ఆచార్ .. రమేశ్ ఇందిర నటన సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తూ ఆకట్టుకుంటుంది. అద్వైత గురుమూర్తి ఫొటోగ్రఫీ .. చరణ్ రాజ్ నేపథ్య సంగీతం .. సునీల్ భరద్వాజ్ ఎడిటింగ్ బాగున్నాయి. తాము ప్రేమించినవారు తమకి దక్కకపోయినా, వారి జీవితం అందంగా ... ఆనందంగా ఉండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ అనే సందేశాన్ని అందించే ఈ సినిమా, యూత్ కి మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Movie Name: Saptha Sagaralu Daati Side B

Release Date: 2024-01-25
Cast: Rakshit Shetty, Rukmini Vasanth, Chaithra J. Achar, Achyuth Kumar, JP Tuminad, Ramesh Indira
Director: Hemanth M. Rao
Music: Charan Raj
Banner: Paramvah Studios

Saptha Sagaralu Daati Side B Rating: 3.25 out of 5

Trailer

More Reviews