తమిళంలో ఈ ఏడాదిలో చిన్న సినిమాగా వచ్చి .. పెద్ద విజయాలను సాధించినవాటి జాబితాలో 'పార్కింగ్' ఒకటిగా కనిపిస్తుంది. సుధాన్ సుందరం నిర్మించిన ఈ సినిమాకి, రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 1వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్లకు వచ్చింది. మౌత్ టాక్ తోనే జనంలోకి వెళ్లిన ఈ సినిమా, ఈ రోజు నుంచే డిస్నీ ప్లస్ హార్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా విశేషాలేమిటనేది ఇప్పుడు చూద్దాం.
ఈశ్వర్ (హరీశ్ కల్యాణ్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఆధిక (ఇందుజా)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమె పేరెంట్స్ కి ఆ పెళ్లి ఇష్టం లేకపోవడం వలన, వాళ్లతో మాటలు లేకుండాపోతాయి. ఆధిక గర్భవతి అవుతుంది .. దాంతో ఈశ్వర్ ఆమెను మరింత మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇంట్లోని పై పోర్షన్ లో రెంట్ కి దిగుతాడు. ఓనర్ వేరే ప్రదేశంలో ఉంటాడు. క్రింది పోర్షన్ లో ఏకరాజు (భాస్కర్) కుటుంబ సభ్యులు పదేళ్లుగా నివసిస్తూ ఉంటారు.
ఏకరాజు ఓ గవర్నమెంట్ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య కుమారి .. కూతురు అపర్ణ. ఆ కుటుంబ సభ్యులు ఈశ్వర్ దంపతులను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. తాను ఆఫీసుకి వెళ్లిరావడానికీ .. భార్య హెల్త్ చెకప్ లకు ఇబ్బంది అవుతుందని భావించిన ఈశ్వర్, కొత్తగా ఒక కారు కొంటాడు. ఈశ్వర్ తన కారును లోపల పార్క్ చేస్తూ ఉండటం వలన, తన బైక్ ను బయటికి తీయడం .. లోపల పెట్టడం ఏకరాజుకి ఇబ్బంది అవుతూ ఉంటుంది.
ఒక రోజున ఏకరాజు తన బైక్ లోపల పెడుతూ ఉండగా, ఈశ్వర్ కారుపై గీత పడుతుంది. అక్కడ కలర్ పోవడంతో అతను తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. అక్కడి నుంచి పార్కింగ్ విషయంలో ఇద్దరికీ చిన్నపాటి వార్ జరుగుతూనే ఉంటుంది. ఈశ్వర్ ను పార్కింగ్ ప్లేస్ లో కారు పెట్టనీయకుండా చేయడం కోసం, ఏకరాజు కూడా కొత్త కారు కొంటాడు. మహా పిసినారిగా ఉన్న ఆయన కొత్త కారు కొనడం ఆ వీధిలోని వాళ్లందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
కారు పార్క్ చేయడం కోసం ఒకరికంటే ఒకరు ముందుగా ఇంటికి రావడం మొదలెడతారు. ఆఫీసుకి వెళ్లినా వర్క్ పై మనసు పెట్టలేకపోతుంటారు. చివరికి హాఫ్ డే నే వర్క్ చేసి ఇంటికి వచ్చేయడం చేస్తుంటారు. అలా ఒకరికంటే ఒకరు ముందుగా ఇంటికి చేరుకుని పార్క్ చేసే ప్రయత్నంలో అటు ఏకరాజు కారు ..ఇటు ఈశ్వర్ కారు డ్యామేజ్ అవుతాయి. తన కారును డ్యామేజ్ చేసిన ఏకరాజుపై ఈశ్వర్ చేయిచేసుకుంటాడు.
ఏకరాజుపై ఈశ్వర్ చేయి చేసుకోవడాన్ని అతని భార్య ఆధిక తప్పుబడుతుంది. ఇల్లు మారిపోదామని అతనితో చెబుతుంది. అయితే ఈ లోగానే ఏకరాజు తొందరపడతాడు. తనకి జరిగిన అవమానానికి ప్రతీకారంగా అందరిలో ఈశ్వర్ ని కూడా తలెత్తుకోకుండా చేయాలనే నిర్ణయానికి వస్తాడు. అందుకోసం ఏకరాజు ఏం చేస్తాడు? అతను తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? పార్కింగ్ ప్లేస్ కోసం జరిగే ఈ పోరాటానికి ముగింపు ఏమిటి? అనేది మిగతా కథ.
రామ్ కుమార్ బాలకృష్ణ దర్శకత్వం వహించిన సినిమా ఇది .. కథ ఆయన తయారు చేసుకున్నదే. సాధారణంగా పట్టణాలలో .. అద్దె ఇళ్లలో .. రెండు కుటుంబాలవారు అద్దెకి ఉన్నప్పుడు పార్కింగ్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. చిన్నపాటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే 'ఈగో' కారణంగా ఇవి చాలా పెద్దవవుతూ ఉంటాయి. ఇలాంటి గొడవలు ఎక్కువ సంఖ్యలోనే కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సంఘటనలలో నుంచే ఈ కథ పుట్టిందనుకోవాలి.
దర్శకుడు ఈ కథను ఎంత సహజంగా రాసుకున్నాడో, అంతే బలంగా చెబుతూ వెళ్లాడు. తక్కువ పాత్రలనే ఎంచుకున్నప్పటికీ, వాటిని వాస్తవానికి చాలా దగ్గరగా ఆవిష్కరిస్తూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. తమ ఈగోలను చల్లబరచుకోవడం కోసం కొంతమంది ఎంతవరకూ వెళతారు? అందువలన వాళ్లు ఏం కోల్పోతారు? అనే విషయాలను దర్శకుడు చెప్పిన విధానం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. చిన్న సర్దుబాటుకి అహం అడ్డురావడం వలన, ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయనేది అర్థమయ్యేలా ఆవిష్కరించిన సినిమా ఇది.
రెండు కుటుంబాలు .. ఒకటే పార్కింగ్ ప్లేస్ చుట్టూ తిరిగే ఈ కథ చాలా సింపుల్ గా మొదలవుతుంది. అక్కడి నుంచి దర్శకుడు ఈ కథను నడిపించిన తీరు ఆడియన్స్ ను అలా కూర్చోబెట్టేస్తుంది. అనవసరమైన సీన్ ఒక్కటి కూడా కనిపించదు. ప్రీ క్లైమాక్స్ ... క్లైమాక్స్ కూడా ఆడియన్స్ ఊహకు అందకుండా ఉత్కంఠను రేకెత్తిస్తాయి. ఆర్టిస్టులంతా అలా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ కథను మరో మెట్టు పైన నిలబెట్టింది. కథకి తగినట్టుగానే ఫొటోగ్రఫీ సాగింది.
సాధారణంగా ఒక సినిమాకి కథను రెడీ చేయాలంటే అది ఆకాశంలో నుంచి ఊడిపడే ఐటమ్ అన్నట్టుగా పైకి చూస్తూ చుక్కలను లెక్కపెడుతూ ఉంటారు. కథ అనేది ఎక్కడో పుట్టేది కాదు .. ఎవరో ఎక్కడో పెంచేది కాదు .. దానిని పార్కింగ్ ప్లేస్ లో నుంచి కూడా తీయవచ్చు అని నిరూపించిన సినిమా ఇది. ఈగోను పక్కన పెట్టకపోతే ఇబ్బందులు తప్పవని చెప్పే కథ ఇది. ఈ ఏడాది తమిళంలో వచ్చిన మంచి సినిమాల జాబితాలో ఈ సినిమాకి కూడా స్థానం దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
'పార్కింగ్' - (హాట్ స్టార్) మూవీ రివ్యూ
| Reviews
Parking Review
- తమిళంలో చిన్న సినిమాగా రూపొందిన 'పార్కింగ్'
- డిసెంబర్ 1వ తేదీన థియేటర్లకు వచ్చిన సినిమా
- తెలుగుతో పాటు ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్
- బలమైన కథాకథనాలు .. సహజమైన సన్నివేశాలు
- మొదలుపెడితే చివరివరకూ కదలనీయని కథ ఇది
Movie Name: Parking
Release Date: 2023-12-30
Cast: Harish Kalyan, M. S. Bhaskar, Indhuja, Rama Rajendra, Prathana Nathan, Ilavarasu
Director: Ramkumar Balakrishnan
Music: Sam C. S.
Banner: Passion Studios
Review By: Peddinti
Parking Rating: 3.50 out of 5
Trailer