కన్నడలో రాజ్ బి. శెట్టి విలక్షణ నటుడిగా కనిపిస్తాడు. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు విభిన్నంగా ఉంటాయి. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుని మెప్పించడం ఆయన ప్రత్యేకత. అలాంటి రాజ్ బి. శెట్టి నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమానే 'టోబి'. ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. అలాంటి ఈ సినిమా, నిన్నటి నుంచి 'సోనీలివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ .. హీరో టీనేజ్ నుంచి మొదలవుతుంది. అతను బాలనేరస్థులకి సంబంధించిన జైలులో శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. అతని మానసిక స్థితి సరిగ్గా లేదనే విషయం అక్కడికి వచ్చిన చర్చి ఫాదర్ (యోగి)కి తెలుస్తుంది. అతను ఏ ఊరికి చెందినవాడో .. తల్లిదండ్రులు ఉన్నారో లేదో కూడా తెలియదని అక్కడి సిబ్బంది చెబుతారు. అతనిలో హింసా ప్రవృత్తి ఎక్కువనీ, భయమనేది తెలియదని అంటారు. జైల్లో జరిగిన ఒక సంఘటన కారణంగా అతని ఓకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయనీ, అతను మాట్లాడలేడని చెబుతారు.
ఆ పిల్లాడికి పేరు లేదని తెలిసిన ఫాదర్ .. 'టోబి' అనే పేరు పెడతాడు. ఆ కుర్రాడి చేతిపై ఆ పేరు రాసి .. ఇక నుంచి అదే అతని పేరు అని చెబుతాడు. అప్పటి నుంచి అతనికి ఫాదర్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. తన ఆవేశం కారణంగా శిక్షలు పెరుగుతూ వెళ్లి .. అనేక జైళ్లకు మారుతూ వెళ్లిన 'టోబి' నడిమి వయసులో విడుదలవుతాడు. శవాల గదికి కాపలాగా ఉంటూ .. చేపలు పడుతూ అతను తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ ఊళ్లో వాళ్లంతా గ్రామదేవతను కొలుస్తూ ఉంటారు. అమ్మవారి ముక్కుకి అలంకరించే 'అడ్డ బేసర'కి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.
ఓ రోజు రాత్రివేళ చేపలు పట్టడానికి వెళ్లిన 'టోబి'కి అమ్మవారి 'అడ్డ బేసర' దొరుకుతుంది. దానిని అతను పదిలంగా దాస్తాడు. ఓ కాలువ పక్కన ఎవరో ఒక ఆడ శిశువును వదిలేసి వెళ్లిపోతారు. ఆ శిశువును ఏం చేయాలా అని అందరూ ఆలోచన చేస్తూ ఉంటే, 'టోబి' ఆ పసిబిడ్డను తాను నివాసముండే శవాల గదికే తీసుకుని వస్తాడు. ఆ పాపకి 'జెన్నీ' (చరిత్ర ఆచార్) అనే పేరుపెట్టి పెంచుతూ వస్తాడు. ఈ క్రమంలోనే అతను 'సావిత్రి' (సంయుక్త) అనే ఒక వేశ్యను ఇష్టపడతాడు. అతనికి మాటలు రాకపోయినా ఆమె కూడా అతని తోడును కోరుకుంటుంది.
జెన్నీ యుక్త వయసుకి వస్తుంది. ఆమెకి రక్షణగా ఒక ఇల్లు అవసరమని 'టోబి'తో సావిత్రి చెబుతుంది. ఇల్లు ఏర్పాటు చేయడం ఎలా? అనే ఆలోచనలో 'టోబి' ఉండగా, ఆ ఊళ్లో మటన్ షాప్ నడిపే ఆనంద్ (రాజ్ దీపక్ శెట్టి) అతనిని కలుస్తాడు. తన వ్యాపారానికి అడ్డుపడుతున్న సంతోష్ ను అంతం చేస్తే, అతనికి కావలసిన ఇంటిని తాను కట్టించి ఇస్తానని హామీ ఇస్తాడు. సంతోష్ ఆ ఊళ్లో పెద్ద రౌడీ లీడర్. తన దారికి అడ్డొచ్చినవారిని ఎంతోమందిని హత్య చేసిన చరిత్ర అతనిది.
ఊళ్లో అందరూ కూడా 'టోబి'ని పిచ్చోడు అనే పిలుస్తుంటారు. పైగా అతనికి నేరచరిత్ర ఉండటం వలన, సంతోష్ ను చంపేసే పనిని ఆనంద్ అతనికి అప్పగిస్తాడు. జెన్నీకి ఇల్లు అవసరమని భావించిన 'టోబి' అందుకు సిద్ధమవుతాడు. ఊళ్లో వాళ్లందరూ చూస్తుండగానే సంతోష్ ను చంపేస్తాడు. అప్పటివరకూ సంతోష్ కి భయపడుతూ బ్రతుకుతూ వచ్చిన ఆనంద్, ఆ ఊరికి నాయకుడు అవుతాడు. అతని వలన 'టోబి' ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడతను ఏం చేస్తాడు? అనేది మిగతా కథ.
దయానంద్ రాసిన ఈ కథకి, రాజ్ బి.శెట్టినే స్క్రీన్ ప్లే చేయడం విశేషం. ఈ కథకి దృశ్యరూపాన్ని ఇచ్చింది బాసిల్ అచలక్కల్. మూడు ప్రధానమైన పాత్రలతో .. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథను దర్శకుడు చాలా సహజంగా ఆవిష్కరించాడు. ఇది ఒక సినిమా ... మనం థియేటర్లో కూర్చుని చూస్తున్నాం అనిపించదు. మన ఇంటి అరుగుపై కూర్చుని 'టోబి' చేసే పనులను గమనిస్తున్నట్టుగా ఉంటుంది. ప్రతి పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరు, ఆ పాత్రల వెంట మనం పరిగెత్తేలా చేస్తుంది.
'టోబి' మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి. ఏ క్షణంలో ఎలా మారిపోతాడో ఎవరికీ తెలియదు. అతని వ్యక్తిత్వంలో అనేక కోణాలు ఉంటాయి. అలాంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు? అతని హావభావాలు ఎలా ఉంటాయి? మేనరిజమ్స్ ఎలా ఉంటాయి? అనే విషయాలపై దర్శకుడు ఎంతగా కసరత్తు చేశాడనేది, 'టోబి' పాత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. తెరపై ఆ పాత్ర తప్ప మనకి రాజ్ బి. శెట్టి కనిపించడు. ఆయన నటనే ఈ సినిమాకి హైలైట్.
మిథున్ ముకుందన్ నేపథ్య సంగీతం .. ప్రవీణ్ శ్రియన్ ఫొటోగ్రఫీ కథకు మరింత సహజత్వాన్ని ఆపాదించేలా సాగుతాయి. నితిన్ శెట్టి ఎడిటింగ్ కూడా నీట్ గా అనిపిస్తుంది. సినిమా మొత్తంలో ఎక్కడా అనవసరమైన సీన్ అనేది కనిపించదు. 'టోబి' కూతురు పాత్రలో చరిత్ర ఆచార్ ... ప్రతినాయకుడి పాత్రలో దీపక్ శెట్టి నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
మానసిక స్థితి సరిగ్గా లేని ఒక వ్యక్తి .. మానవత్వం గురించి పెద్దగా తెలియని వ్యక్తి, ఒక ఆడశిశువుకి ఆశ్రయం కల్పిస్తాడు. ఆ బిడ్డకి రక్షణగా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో, దాని కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. అలాంటి ఆ అమ్మాయికి హాని తలపెట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అతను ఏం చేస్తాడు? అనేదే ఈ కథ. ఒకసారి ఈ కథలోకి ఎంటరైతే ఇక రిమోట్ పక్కన పెట్టేస్తాం. అంతలా కంటెంట్ ను కనెక్ట్ చేయడానికి కారణం, కథలోని సహజత్వం .. దర్శకుడి గొప్పతనం ... హీరో టాలెంట్ అనే చెప్పాలి.