లారెన్స్ - ఎస్.జె.సూర్య ప్రధానమైన పాత్రలను పోషించిన 'జిగర్ తండ డబుల్ ఎక్స్' నవంబర్ 10వ తేదీన థియేటర్స్ కి వచ్చింది. భారీ తారాగణంతో .. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. అలాంటి ఈ సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ 1975 కాలంలో నడుస్తూ ఉంటుంది .. ఆ కాలంలోనే ప్రేక్షకుడు ట్రావెల్ చేయవలసి ఉంటుంది. రే దాసన్ ( ఎస్.జె. సూర్య)కి పోలీస్ ఆఫీసర్ కావాలనేది బలమైన కోరిక. తనని పోలీస్ ఆఫీసర్ గా చూడాలనుకున్న తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి ఆయన కష్టపడుతూ ఉంటాడు. రేపో .. మాపో ఎస్.ఐ.గా పోస్టింగ్ వస్తుందని ఎదురుచూస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో .. తన ప్రమేయమేలేని హత్య కేసులో జైలుకి వెళతాడు.
కర్నూల్ అనేది సీజర్ (లారెన్స్) అడ్డా. అక్కడ అక్రమవ్యాపారాలు చేస్తూ .. అక్కడి రాజకీయనాయకుడికి అండగా నిలబడతాడు. సినిమాల్లో హీరోలుగా జయకృష్ణ (షైన్ టామ్ చాకో) .. చిన్నా మధ్య గట్టిపోటీ ఉంటుంది. రాజకీయ నాయకుడి ఆదేశం మేరకు, కర్నూల్ లో జయకృష్ణ సినిమాకి థియేటర్లు దొరక్కుండా చేస్తాడు సీజర్. దాంతో సీజర్ పై కోపంతో రగిలిపోయిన జయకృష్ణ, అతణ్ణి అంతం చేసే పనిని డీఎస్పీ రత్నకుమార్ (నవీన్ చంద్ర)కి అప్పగిస్తాడు.
అప్పటికే జైలులో ఉన్న దాసన్ తో ఈ పనిని పూర్తి చేయించాలని రత్నకుమార్ భావిస్తాడు. ఇది ప్రభుత్వానికి అవసరమైన సీక్రెట్ ఆపరేషన్ అనీ, సీజర్ ను చంపితే ఆ మరుసటి రోజునే పోలీస్ జాబ్ లో చేరే ఛాన్స్ ఇస్తానని దాసన్ కి ఆశపెడతాడు. పోలీస్ జాబ్ చేయాలనే పట్టుదల కారణంగా దాసన్ అందుకు అంగీకరిస్తాడు. సీజర్ దగ్గర డబ్బు ఉంది .. సినిమాలో హీరోగా క్రేజ్ తెచ్చుకోవాలనే ఆశ ఉంది. అందుకు సమర్థుడైన దర్శకుడు కావాలని పేపర్లో ప్రకటన ఇస్తాడు. సీజర్ జీవితచరిత్రను తీస్తానని చెబుతూ, అతనికి దాసన్ చేరువవుతాడు. సీజర్ ను అంతం చేయడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.
ఇదిలా ఉండగా 'కొంబై' ఫారెస్టు ప్రాంతంలోని ఆదిమవాసులు ... అడవినే నమ్ముకుని బ్రతుకుతూ ఉంటారు. అడవికి ఏనుగులే రక్షణ అని భావించిన కారణంగా వాళ్లు వాటిని వేటాడరు. కానీ 'షట్టాని' (విధు) అనేవాడు ఏనుగులను వేటాడడమే పనిగా పెట్టుకుంటాడు. అందుకు అడ్డుపడిన ఆదిమవాసులను హతమారుస్తూ ఉంటాడు. షట్టాని ఎంతటి కిరాతకుడో దాసన్ కి తెలుసు. అందువలన అతని చేతిలో సీజర్ ప్రాణాలు పోయేలా మాస్టర్ ప్లాన్ వేస్తాడు.
సినిమాలో హీరో అంటే .. అన్నీ మంచి పనులే చేయాలనీ, అలాగైతేనే అతనితో సినిమాను పూర్తి చేస్తానని సీజర్ తో దాసన్ అంటాడు. మంచి పనులు చేస్తే జనాలు జై కొడతారనీ, అప్పుడే హీరోయిజం ఎలివేట్ అవుతుందని చెబుతాడు. 'కొంబై' ఫారెస్టు ప్రాంతంలోని 'షట్టాని' నుంచి ఆదిమవాసులను కాపాడమని అంటాడు. వాళ్లంతా అతనిని దేవుడిలా చూస్తారని చెబుతాడు. ఆ మాటలు నమ్మిన సీజర్, అతనితో కలిసి అక్కడికి వెళతాడు.
భయంకరమైన ఆ అడవిలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? సీజర్ ను చంపాలనే జయకృష్ణ ప్లాన్ ఫలిస్తుందా? ఈ విషయంలో రత్నకుమార్ కోరిక నెరవేరుతుందా? సీజర్ ను అడవి వరకూ తీసుకెళ్లిన దాసన్, అతణ్ణి చంపగలుగుతాడా? షట్టాని చేతిలో సీజర్ మరణిస్తాడా? అసలు షట్టాని ఎవరు? అతని వెనకున్న పెద్ద తలకాయలు ఎవరివి? అనేవి కథలో ఆసక్తికరమైన అంశాలుగా అనిపిస్తూ, ముందుకు తీసుకుని వెళుతుంటాయి.
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తయారు చేసుకున్న కథ ఇది. అడవికీ .. అమాయకులైన ఆదివాసులకు .. అవినీతి రాజకీయ నాయకులకు .. వాళ్లకి వంతపాడే పోలీస్ అధికారులకు మధ్య జరిగే కథ ఇది. 1975 కాలంలో జరుగుతున్న కథ అంటే, కాస్ట్యూమ్స్ మొదలు అనేక అంశాలలో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఆ విషయంలో కార్తీక్ సుబ్బరాజ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కథాకథనాల విషయానికి వచ్చేసరికి, కథ తిరిగిన చోటుకే మళ్లీ మళ్లీ వస్తుంటుంది. అందువలన ఇంకాస్త పదునుగా .. పెర్ఫెక్ట్ గా స్క్రీన్ ప్లే ను డిజైన్ చేసుకుని ఉంటే బాగుండునని అనిపిస్తుంది.
ఇక ఇటు హీరో పాత్ర వైపు నుంచి .. అటు ఎస్.జె. సూర్య పాత్ర నుంచి కామెడీ ఉంది. మిగతా సీన్స్ మాత్రం సీరియస్ గా సాగుతూ ఉంటాయి. విలన్ షైన్ టామ్ చాకో అనే అనుకుంటారు. అయితే అప్పుడప్పుడు మాత్రమే ఆయన పాత్ర కనిపిస్తూ ఉండటంతో, మరో విలన్ ఎవరో ఉన్నారనే ఒక డౌట్ ప్రేక్షకుడికి వస్తుంది. అందుకు సంబంధించిన ట్విస్టు కూడా ఆకట్టుకుంటుంది. లారెన్స్ .. ఎస్.జె. సూర్య నటన ఈ సినిమాకి హైలైట్. తిరు కెమెరా పనితనం .. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ కథకు మరింత బలాన్ని ఇచ్చాయి. షఫీక్ మహ్మద్ అలీ ఎడిటింగ్ ఓకే.
ఎదుటివారిని భయపెట్టి .. వాళ్ల కళ్లలో భయాన్ని చూస్తూ ఆనందించే హీరోయిజం కంటే, ఎదుటివారికి సాయం చేసి ... వాళ్ల కళ్లలో ఆనందాన్ని చూస్తూ పొందే హీరోయిజం గొప్పదనే సందేశాన్ని అంతర్లీనంగా ఇచ్చిన సినిమా ఇది. మన కోసం మారడం కాదు ... మంచి కోసం మారడం గొప్ప విషయం అనే సందేశం కూడా మరో పాత్ర ద్వారా ఇచ్చారు. కథపై మరింత కసరత్తు చేసి, కంటెంట్ ను మరింత టైట్ గా అందించి ఉంటే, ఈ సినిమాకి మరిన్ని మార్కులు దక్కేవనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్: కథ .. 1975 నేపథ్యం .. ఫారెస్టు లొకేషన్స్ .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం.
మైనస్ పాయింట్స్: లూజ్ సీన్స్ .. బలమైన విలనిజం బయటికి కనిపించకపోవడం .. సన్నివేశాలను పొడిగిస్తూ వెళ్లడం.
'జిగర్ తండ డబుల్ ఎక్స్' ( నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ
| Reviews
Jigar Thanda Review
- కార్తీక్ సుబ్బరాజ్ 'జిగర్ తండ డబుల్ ఎక్స్'
- అడవి చుట్టూ అల్లుకున్న పొలిటికల్ డ్రామా
- ఆసక్తికరమైన కథ .. పొడిగిస్తూ వెళ్లిన సీన్స్
- ప్రధాన బలంగా ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం
- ఆలోచింపజేసే సందేశం
Movie Name: Jigar Thanda
Release Date: 2023-12-08
Cast: Raghava Lawrence, S. J. Suryah, Nimisha Sajayan, Naveen Chandra, Shine Tom Chacko, Sanchana Natarajan
Director: Karthik Subbaraj
Music: Santosh Narayan
Banner: Stone Bench Films
Review By: Peddinti
Jigar Thanda Rating: 3.00 out of 5
Trailer