'యానిమల్' - మూవీ రివ్యూ

Animal

Animal Review

  • సందీప్ రెడ్డి వంగా నుంచి 'యానిమల్'
  • ఫరవాలేదనిపించే ఫస్టాఫ్ 
  • బలహీనపడిన సెకండాఫ్ 
  • హింస .. రక్తపాతం .. మోతాదు మించిన యాక్షన్ 
  • పవర్ఫుల్ విలనిజం లేకపోవడం ప్రధానమైన లోపం

రణ్ బీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' సినిమాను రూపొందించాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో, కథానాయికగా రష్మిక నటించింది. ఈ రోజునే ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. చాలా రోజులుగా ఒక రేంజ్ లో పబ్లిసిటీ చేస్తూ, ఈ రోజున ఈ సినిమాను థియేటర్లకు వదిలారు. రిలీజ్ కి ముందే బజ్ పెంచుకున్న కారణంగా థియేటర్ల దగ్గర సందడి కాస్త గట్టిగానే కనిపించింది. 3 గంటలకు పైగా నిడివిని కలిగి ఉన్న ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ ఢిల్లీ నేపథ్యంలో నడుస్తుంది.1996లో మొదలై ప్రస్తుతకాలంలో కొనసాగుతుంది. బల్వీర్ సింగ్ (అనిల్ కపూర్) పెద్ద బిజినెస్ మేన్. అనేక వ్యాపార వ్యవహారాలతో ఆయన సతమతమవుతూ ఉంటాడు. భార్య జ్యోతి(చారు శేఖర్) రీత్ - రూప్ అనే ఇద్దరు కూతుళ్లు .. విజయ్ (రణ్ బీర్ కపూర్) ఇది అతని ఫ్యామిలీ. ఎప్పుడు చూసినా బిజినెస్ పనులంటూ తండ్రి తమని పట్టించుకోలేదనే ఒక భావన విజయ్ లో బలంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ విషయంలో అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు కూడా.  

అందువలన బల్వీర్ .. ఇంటికి దూరంగా అతనిని బోర్డింగ్ స్కూల్లో వేస్తాడు .. ఆ తరువాత పై చదువుల కోసం విదేశాలకి పంపిస్తాడు. అక్కడి నుంచి వచ్చిన విజయ్, తొలి చూపులోనే గీతాంజలి (రష్మిక) ప్రేమలో పడిపోతాడు. తనకి జరిగిన ఎంగేజ్ మెంట్ ను కూడా కాదనుకుని ఆమె అతనితో వచ్చేస్తుంది. విజయ్ కి తన ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించకపోవడంతో, గీతూను పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్లిపోతాడు. ఆరేళ్ల తరువాత తన తండ్రిపై ఎవరో కాల్పులు జరిపారని తెలిసి, గీతూతో పాటు ఇద్దరు పిల్లలను తీసుకుని తిరిగొస్తాడు. 

చిన్నప్పటి నుంచి తమని తండ్రి పట్టించుకోలేదనే అసంతృప్తి ఉన్నప్పటికీ, ఆయనంటే విజయ్ కి ప్రాణం. అలాంటి తండ్రి ప్రాణాలకు ప్రమాదం లేదని తెలిసి తేలికగా ఊపిరి పీల్చుకుంటాడు. బల్వీర్ కి కుడి భుజంలా వ్యవహరిస్తూ, ఆయనకి సంబంధించిన అన్ని పనులను పెద్దల్లుడు వరుణ్ ( సిద్ధాంత్ కామిక్) చక్కబెడుతుంటాడు. విజయ్ తిరిగి రావడం అతనికి నచ్చదు. ఆ ఫ్యామిలీ నుంచి అతనిని దూరం చేయాలనే ట్రై చేస్తుంటాడు. అయినా విజయ్ భరిస్తూ వస్తుంటాడు. 

తన తండ్రిని హత్య చేయడానికి ఎవరు ప్రయత్నించారనే విషయంపై విజయ్ తీవ్రంగా ఆలోచన చేస్తాడు. తండ్రి చుట్టూ ఉండే బాడీ గార్డ్స్ ను తీసేసి, తన మనుషులను పెడతాడు. అలాగే తండ్రిని పోలిన వ్యక్తిని తీసుకొచ్చి బాడీ డబుల్ చేయిస్తాడు. తన తండ్రిని చంపడానికి రహస్యంగా ప్లాన్ చేస్తున్న వ్యక్తి ఎవరనేది తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. అతను ఊహించినట్టుగానే బల్వీర్ అనుకుని అతని బాడీ డబుల్ ను శత్రువులు హతమారుస్తారు.

తనకి తెలియకుండా తన చుట్టూ ఏదో జరుగుతుందనే విషయం బల్వీర్ కి అప్పుడు అర్థమవుతుంది. ఇక తాను ఆలస్యం చేయకూడదనే నిర్ణయానికి విజయ్ అప్పుడే వస్తాడు. ఆ వెంటనే అతను ఏం చేస్తాడు? బల్వీర్ ను హత్య చేయడానికి ట్రై చేస్తున్నది ఎవరు? హంతకుల వెనకున్న అసలు హస్తం ఎవరిది? విజయ్ ను నమ్ముకుని అతనికి భార్యగా వచ్చిన గీతూకి, ఆ ఇంట్లో ఎదురయ్యే పరిస్థితులు ఎలాంటివి? అనేవి కథలోని ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి.

ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా రైటర్ గా .. ఎడిటర్ గా ... దర్శకుడిగా వ్యవహరించాడు. బిజినెస్ లావాదేవీల్లో పడి ఫ్యామిలీని పెద్దగా పట్టించుకోని తండ్రి, అయినా ఆయనను అతిగా ప్రేమించే ఒక కొడుకు చుట్టూ తిరిగే కథ ఇది. తండ్రి కోసం ఆ కొడుకు ఏం చేయడానికైనా వెనుకాడడు. అతనిలో ఒక క్రిమినల్ ఉండటం వల్లనే అలాంటి పనులు చేయడం సాధ్యమవుతోందనే అభిప్రాయాన్ని తండ్రి వ్యక్తం చేస్తుంటాడు. ఇక్కడే ఇద్దరికీ వాదన జరుగుతూ ఉంటుంది. 

అనిల్ కపూర్ .. రణ్ బీర్ కపూర్ .. రష్మిక చుట్టూనే ప్రధానమైన కథ నడుస్తూ ఉంటుంది. అనిల్ కపూర్ పాత్రను .. రష్మిక పాత్రను సందీప్ సరిగ్గానే డిజైన్ చేసుకున్నాడు. రణ్ బీర్ పాత్ర విషయానికి వచ్చేసరికి, ఆ పాత్ర ఒక రకమైన ఉన్మాదంతో ముందుకు వెళుతూ ఉంటుంది. పోనీ అలా అతను ప్రవర్తించడానికి బలమైన కారణం ఏదైనా ఉందా అంటే .. ఏమీ లేదు. ఇతని మానసిక స్థితి సరిగ్గా లేదా? లేక అతనిలో ఒక సైకో ఉన్నాడా? అనే సందేహం ప్రేక్షకుడిని చివరివరకూ వేధిస్తూనే ఉంటుంది .. వెంటాడుతూనే ఉంటుంది. 

సందీప్ ఈ కథను పెర్ఫెక్ట్ గా అల్లుకున్నాడా? ఇంట్రెస్టింగ్ గా చెప్పాడా? అంటే లేదనే చెప్పాలి. కథ మొదలైన దగ్గర నుంచి ఇంటర్వెల్ కి కాస్త ముందు వరకూ బాగానే వెళ్లింది. ఆ తరువాత నుంచి పక్కకి వెళ్లిపోతుంది .. పట్టు జారిపోతుంది. అక్కడి నుంచి బలహీనమైన కథనంతో .. పేలవమైన సన్నివేశాలతో ముందుకు వెళుతుంది. సెకండాఫ్ ను సందీప్ సరిగ్గా డిజైన్ చేసుకోలేదనే విషయం ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. 

ఇక అండర్ వేర్ కి సంబంధించిన కామెడీ సీన్ అనవసరం అనిపిస్తుంది. ఇంటర్వెల్ ఫైట్ సీన్ .. సెకండాఫ్ లో రష్మిక - రణ్ వీర్ ను నిలదీసే సీన్ .. అనిల్ కపూర్ - రణ్ వీర్ వాదించుకునే సీన్ సాగదీశారు. ఈ సీన్స్ ను ట్రిమ్ చేస్తే బాగుండేది. అక్కడక్కడా అసభ్యకరమైన డైలాగులు .. ఒకటి రెండు చోట్ల శృంగార సన్నివేశాలు ఉన్నాయి. ఇక రణ్ వీర్ - రష్మిక లిప్ లాకులకు లెక్కేలేదు. ఇంత నిడివి కలిగిన ఈ కథలో, వీరిద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్ లేకపోవడం విచిత్రం.      

ఇక ఒక బలమైన వ్యవస్థను ఢీ కొట్టాలంటే .. విలన్ కూడా అంతటి బలవంతుడై ఉండాలి .. లేదంటే అంతటి బలగాన్ని కలిగినవాడై ఉండాలి. కానీ ఈ కథలో పవర్ఫుల్ విలన్ అన్నట్టుగా ఎవరూ లేరు. విలన్ ఇతనే అనుకునే వ్యక్తిని ఇంటర్వెల్ తరువాత కూడా చాలా సేపటికి రివీల్ చేశారు. అప్పటికే ఆలస్యమైపోయిందని అనుకున్నారేమో,  అతను హీరోను మించిన తేడా అనే విషయాన్ని ఫస్టు సీన్ లోనే చెప్పేశారు.

ఇప్పటి సినిమాల్లో అప్పటివరకూ ఫ్రెండ్స్ తో కలిసి కామెడీ చేసిన హీరోలు, హీరోయిన్స్ తో కలిసి సరదాగా పాటలు పాడుకునే హీరోలే .. రౌడీల తలలు తీసి తెరపై పెడుతున్నారు. అసలే ఈ కథలో హీరో ఒక ఉన్మాదానికి లోనైనట్టుగా కనిపిస్తాడు. అలాంటి ఆయన యాక్షన్ లోకి దిగితే తెరపై ఏ స్థాయిలో హింస .. రక్తపాతం ఉంటుందని అనుకుంటారో .. అంతకు మించే ఉంటుంది. కంట్లో షూట్ చేయడం .. నోట్లో గన్ పెట్టి పేల్చడం .. నాభి క్రింది భాగంలో గన్ పెట్టి కాల్చడం లాంటివి వాటిలో  కొన్ని. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ సంగతి అలా ఉంచితే, హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం ప్రధానమైన బలంగా నిలిచిందని చెప్పచ్చు. 

ప్లస్ పాయింట్స్: ఫస్టాఫ్ .. నిర్మాణ విలువలు .. నేపథ్య సంగీతం 

మైనస్ పాయింట్స్: సెకండాఫ్ .. హింస .. రక్తపాతం .. అక్కడక్కడ అనవసరమైన సీన్స్

Movie Name: Animal

Release Date: 2023-12-01
Cast: Ranbir Kapoor, Anil Kapoor, Bobby Deol, Rashmika Mandanna, Tripti Dimri,Babloo Prithiveeraj
Director: Sandeep Reddy Vanga
Music: Harshwardhan Rameshwar
Banner: T-Series Films

Animal Rating: 3.00 out of 5

Trailer

More Reviews