తమిళంలో ఈ ఏడాది కామెడీ డ్రామా జోనర్లో వచ్చిన సినిమాలలో 'సత్య శోధనై' ఒకటి. జులై 21వ తేదీన ఈ సినిమా, అక్కడి థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 24వ తేదీ నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ్ జీ అమరెన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఏ స్థాయిలో ఆకట్టుకుందనేది చూద్దాం.
ప్రవీణ్ (ప్రేమ్ జీ అమరెన్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. అతనికి సంబంధించిన వ్యవహారాలను అక్కా బావలే చూసుకుంటూ ఉంటారు. అతను ఏమీ చదువుకోకపోవడం వలన, ఎలాంటి జాబ్ చేసే పరిస్థితి లేకుండా ఉంటాడు. ఆ కారణంగానే వివాహం విషయంలోను ఆలస్యమవుతూ ఉంటుంది. ఇకనైనా లైఫ్ ను కాస్త సీరియస్ గా తీసుకుని, ఏదైనా పని చూసుకోమని అక్క పోరుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే ప్రవీణ (స్వయం సిద్ధ) తో అతనికి పెళ్లి కుదురుతుంది.
ఓ రోజున ప్రవీణ్ తనకి కాబోయే భార్య దగ్గరికి స్కూటర్ పై వెళుతూ ఉండగా, ఊరు చివరలో ఒక శవం కనిపిస్తుంది. ఎవరో కత్తులతో దాడి చేసి ఆ వ్యక్తిని చంపేశారనే విషయాన్ని అతను గ్రహిస్తాడు. శవం ఎండకి ఉందని .. అక్కడికి కాస్త దగ్గరలో ఉన్న చెట్టుక్రిందికి లాక్కుని వెళతాడు. శవం మెడలో ఉన్న బంగారం చైన్ .. చేతికి ఉన్న వాచ్ .. సెల్ ఫోన్ తీసుకుంటాడు. వాటిని పోలీస్ స్టేషన్ లో ఇచ్చి, జరిగిన హత్య గురించి చెప్పాలనుకుంటాడు.
అలా వెళుతున్న అతనికి కొంతదూరంలో ఒక వృద్ధురాలు కనిపిస్తుంది. ఆమె నడవలేకపోతుందని భావించి, ఆమెను ఎక్కించుకుని వెళ్లి స్టేషన్ దగ్గర దింపుతాడు. అక్కడికి దగ్గరలోనే తన ఇల్లు ఉందని చెప్పి ఆమె వెళ్లిపోతుంది. 'సంగుపట్టి' పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ప్రవీణ్, జరిగింది చెప్పి .. తాను తెచ్చిన వస్తువులు అప్పగిస్తాడు. అయితే ఆ వ్యక్తిని హత్య చేసినవారిని మరో పోలీస్ స్టేషన్ కి చెందినవారు పట్టుకుంటారు.
శవాన్ని ప్రవీణ్ జరపకపోతే ఆ కేసు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్లేది. చనిపోయిన వ్యక్తి తాలూకు బంధువులు స్టేషన్ కి వస్తారు. ఆ వ్యక్తికి ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరించే అలవాటు ఉందనీ, ఆ నగలు ఏమైపోయాయని అడుగుతారు. హత్య చేసినవారు తాము ఆ నగలను తీయలేదని అంటారు. దాంతో ప్రవీణ్ తీసి ఉండొచ్చని పోలీసులు మహదేవన్ - కుబేరన్ భావిస్తారు. అతని నుంచి ఎలాగైనా ఆ బంగారాన్ని రాబట్టి పంచుకోవాలని, వేరే పోలీస్ స్టేషన్ వారు ఈ పోలీసులపై ఒత్తిడి తెస్తుంటారు.
దాంతో ప్రవీణ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న కుబేరన్ 'వాకీ టాకీ' తీసుకుని పారిపోతాడు. దాంతో అతని కోసం పోలీస్ లు వెతకడం మొదలుపెడతారు. వాకీటాకీలో అతనితో మాట్లాడతారు. తనని అనుమానించడం కరెక్టు కాదనీ, తనకంటే ముందుగా అదే దారిలో ముసలమ్మ వెళ్లిందనీ .. అంత మాత్రన ఆమెను అనుమానిస్తారా? అంటాడు ప్రవీణ్. దాంతో పోలీస్ లు ముసలమ్మపై విచారణ జరపడానికి సిద్ధమవుతారు. ఆ విచారణలో ఎలాంటి నిజాలు వెలుగు చూస్తాయనేది మిగతా కథ.
సురేశ్ సంగయ్య దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఆయనే కథ .. స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. చనిపోయిన వ్యక్తికి బంగారంపై వ్యామోహం ఎక్కువ. అందువలన ఆ బంగారం కోసమే అతని హత్య జరిగిందా? లేదంటే నిజంగానే ముసలమ్మ తీసి ఉంటుందా? అనే సందేహం ఆడియన్స్ ను వెంటాడుతూ ఉంటుంది. ప్రవీణ్ ఆ బంగారం తీయలేదని ఆడియన్స్ కి తెలుసు. అయితే రెండు పోలీస్ స్టేషన్స్ కి చెందిన పోలీసులు అతని నుంచి బంగారం తీసుకుని పంచుకోవాలని ప్లాన్ చేస్తారు.
తాను బంగారం తీయలేదు అని చెబితే పోలీసులు వినిపించుకోవడం లేదనే బాధ ఒక వైపు, ఇంత జరిగిన తరువాత తనతో పెళ్లిని ప్రవీణ క్యాన్సిల్ చేసుకోకుండా ఉంటుందా? అనే టెన్షన్ ఒక పక్క. దాంతో ప్రవీణ్ సతమతమైపోతుంటాడు. పోలీసుల వలన వలన ప్రవీణ్ పడే ఇబ్బందులే ఇక్కడ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ఓ పదిమంది లోపే ప్రధానమైన ఆర్టిస్టులతో ఈ కథ అంతా నడుస్తుంది. పోలీస్ స్టేషన్ కీ .. కోర్టుకి మధ్య నడిచే సన్నివేశాలు సరదాగా అనిపిస్తాయి.
కథా పరంగా చూసినా .. తారాగణం పరంగా చూసినా .. బడ్జెట్ పరంగా చూసినా ఇది చాలా చిన్న సినిమా. అయినా మొదటి నుంచి చివరివరకూ బోర్ అనిపించకుండా వినోదభరితంగా సాగుతుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. లొకేషన్స్ సినిమాకి అదనపు బలంగా నిలిచాయి. ఎక్కడా అనవసరమైన సీన్స్ కనిపించవు. నవ్వించడానికి అవకాశం ఉన్న ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు ఉపయోగించుకున్నాడు.
ప్రేమ్ జీ అమరెన్ నటన ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ. స్టేషన్ నుంచి కొట్టేసిన వాకీ టాకీ చేతిలో పట్టుకుని, తాను పోలీస్ నని నమ్మిస్తూ .. తనకి కావలసినవి ఫ్రీగా తీసుకోవడం .. ఇక బంగారం కాజేసింది ఎవరనేది డైరెక్టర్ రివీల్ చేసిన తీరు .. తలచుకుని నవ్వుకునేలా చేస్తాయి. ముసలమ్మ కూడా చాలా సహజంగా చేసింది. తెరపై హింస .. రక్తపాతం .. అశ్లీలత ఎక్కువైపోతున్న ఈ ట్రెండులో, ఇలా ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకుంటూ చూసే సినిమా రావడం విశేషమే.
'సత్యశోధనై' (సోనీ లివ్) మూవీ రివ్యూ
| Reviews
Sathiya Sothanai Review
- తమిళంలో అక్టోబర్ లో వచ్చిన 'సత్య శోధనై'
- ఈ నెల 24 నుంచి మొదలైన స్ట్రీమింగ్
- కామెడీ డ్రామా జోనర్లో సాగే కథాకథనాలు
- ప్రేమ్ జీ అమరెన్ నటన హైలైట్
- ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా
Movie Name: Sathiya Sothanai
Release Date: 2023-11-24
Cast: Premgi Amaren, Swayam Siddha, Reshma Pasupuleti, K. G. Mohan, Selva Murugan
Director: Suresh Sangaiah
Music: Deepan Chakaravarthy
Banner: Super Talkies
Review By: Peddinti
Sathiya Sothanai Rating: 3.00 out of 5
Trailer